"నల్లగొండ జిల్లా సమగ్ర స్వరూపం" పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
నల్లగొండ: జిల్లాల చరిత్రల తోనే రాష్ట్ర సమగ్ర స్వరూపం ఆవిష్కృతం అవుతుందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ‘నల్లగొండ జిల్లా సమగ్ర స్వరూపం’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, రాజకీయ చరిత్రను తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నల్లగొండ పేరు ఎలా వచ్చిందో ఇప్పటి తరానికి తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు పఠించాలని సూచించారు.
సభాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ౩౩ జిల్లాల సమగ్ర స్వరూపం నేటి తరానికి అందించాలనే సంకల్పం మేరకు తెలంగాణ సారస్వత పరిషత్ ఈ పుస్తక ప్రచురణ చేపట్టిందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పుస్తకాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే జిల్లాలోని అన్ని పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ఈ పుస్తకాలు చేరుతాయని అన్నారు. దీని కోసం పరిషత్ డిస్కౌంట్ కూడా ఇస్తుందని అన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యా ధనుంజయ్ మాట్లాడుతూ.. ఒక పుస్తకం ప్రచురించాలంటే ఎన్నో పురిటి నొప్పులు పడాలాని అలాంటిది 33 జిల్లాల సమగ్ర స్వరూపాలు తీసుకురావడం సాధారణ విషయం కాదని అన్నారు. ఇలాంటి గొప్ప సాహిత్య సేవను చేస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్ కృషిని ఆమె అభినందించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు డా. సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ.. ఈ పుస్తకం పోటీ పరీక్షలకు కూడా ఉపయుక్తమని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఎన్నో చారిత్రిక, సాంస్కృతిక కట్టడాలు, గ్రంథాలు, వ్యక్తులు ఉన్నారని వారందరి గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహద పడుతుందని అన్నారు.
తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ.. ఈ గ్రంథం ఎంతో మంది నల్లగొండ సాహితీ వేత్తలు కలిసి రూపొందించిన గ్రంథమని పాఠకులు ఆదరించాలని కోరారు.
ప్రముఖ సాహితీవేత్త డా. శ్రీరంగాచార్య మాట్లాడుతూ.. తాను మహబూబ్ నగర్ లో నివసిస్తున్నా ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా సమాచారంతో ఎన్నో గ్రంథాలు వెలువరించానని అన్నారు. నేటి తరాలు తనను గుర్తించడం లేదని ఆవేదన చెందారు.
నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం లాంటి బృహత్తర గ్రంథం తమ కళాశాలలో ఆవిష్కరించడం గర్వకారణమని అన్నారు.
కార్యక్రమ అనంతరం వ్యాసకర్తలను దుశ్శాలువాతో సన్మానించి, పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో సమాచారశాఖ సంయుక్త సంచాలకులు కన్నెగంటి వెంకట రమణ, తెలుగుశాఖ అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, గ్రంథ రచనా కోర్ కమిటీ సభ్యులు డా. భిన్నూరి మనోహరి, డా. తండు కృష్ణ కౌండిన్య, డా. బండారు సుజాతా శేఖర్, పున్న అంజయ్య, డా. సాగర్ల సత్తయ్య, సాహితీవేత్తలు డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మునాసు వెంకట్, లవేందర్ రెడ్డి, కందుకూరి దుర్గాప్రసాద్, డా. పురుషోత్తమాచార్య, మేరెడ్డి యాదగిరి రెడ్డి, పెరుమాళ్ళ ఆనంద్, డా. ఉప్పల పద్మ, అధ్యాపకులు గోవర్ధనగిరి, డా. వాసా భూపాల్, డా. సైదులు, మల్లేశం, వెంకట్ రెడ్డి, భాగ్యలక్ష్మి, విద్యార్థినీ, విద్యార్థులు, తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.
Nov 18 2024, 12:02