శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగా ఉద్యమించాలి: ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్
నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ: కార్మిక వ్యతిరేక విధానాలు, మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో.. శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ అన్నారు. పాలక వర్గాలు కార్పొరేట్ శక్తుల తొత్తుగా మారాయని యూసుఫ్ విమర్శించారు.ఏఐటియుసి నల్లగొండ జిల్లా శిక్షణా తరగతులు సోమవారం మిర్యాలగూడ లో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి సయీద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో ఏఐటియుసి చరిత్ర, కార్మిక చట్టాలు అనే అంశంపై యూసుఫ్ బోధించారు.
1920 లో ఆవిర్భావించిన ఏఐటియుసి.. స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పాత్ర పోషించిందని, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరింది మొదట ఏఐటియుసి అని యూసుఫ్ తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు ఆ తర్వాత స్వాతంత్ర్య భారతదేశంలోను అలుపెరుగని పోరాటాలతో హక్కులను సాధించిన ఘనత ఏఐటియుసికి దక్కుతుందన్నారు.
ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల క్రింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదని విమర్శించారు.
సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణ ఇప్పుడు -అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిని ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలన్నారు. పాలకులు కార్మికులను కాదని యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని, శ్రమకు తగిన వేతనం ఇప్పించడంలో విఫలమవుతున్నాయన్నారు.
గతంలో కార్మిక చట్టాలు అత్యంత పదునుగా ఉండడంతో శ్రమకు తగిన రీతిలో కాకపోయినా కనీసం సగమైనా వేతనం లభించేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. పాలకులు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం నిర్వహించే పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, ధరలు పెరగడం వల్ల కార్మిక మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఉద్యమ నేపథ్యం, కార్మికుల సమస్యలు, పోరాట మార్గాలపై దశ దిశ నిర్దేశం చేశారు. జిల్లాలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు ఎం.డి సయ్యద్, కె.ఎస్ రెడ్డి, పానం వెంకట్రావు, సహాయ కార్యదర్శులు నూనె వెంకటేశ్వర్లు, దోటి వెంకన్న, జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యాదయ్య, లింగా నాయక్,వలపట్ల వెంకన్న, శంతాబాయి, డి.రాణి, సుజిత, వనజ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Nov 12 2024, 17:47