ప్రజ్వల్ రేవణ్ణకు షాకిచ్చిన సుప్రీంకోర్టు
మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రజ్వల్‌కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు, ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హసన మాజీ ఎంపీతో పాటు ఆయన తండ్రిపై ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. కానీ, అతడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదరయ్యింది. ఈ కేసులో ప్రజ్వల్‌కు బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేకాదు, ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని వ్యాఖ్యానించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజ్వల్ వీడియోలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. వందల మందిపై అత్యాచారాలకు పాల్పడి... వాటిని వీడియోలు తీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి ససేమిరా అంది. దీంతో రేవణ్ణ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడి ధర్మాసనం.. వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి వ్యాఖ్యానించింది.
రేవణ్ణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ వేశారు కానీ, ప్రాథమిక ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదుచేయలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అక్టోబరు 21న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అరెస్ట్ అయిన ఆరు నెలల తర్వాత కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించాలని రోహత్గీ కోరారు. అయితే దాని గురించి ఏమీ చెప్పలేమని బెంచ్ పేర్కొంది. అనంతరం అతని పిటిషన్‌ను కొట్టివేసింది.
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడులు, అత్యాచారాలపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మాజీ ప్రదాని మనవడిపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ పూర్తిచేసిన సిట్.. ఆగస్టులో 2,144 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి, హోళినరిసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపులు, కిడ్నాప్ వంటి ఆరోపణల్లో అరెస్టయ్యారు. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయట ఉన్నారు.
Nov 11 2024, 14:34