అక్కడ తింటే చావు కొని తెచ్చుకున్నట్లే
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఓ చోట అధికారులు దాడులు చేస్తున్నారు. అధికారులు తనిఖీ చేసిన ప్రతి చోట ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కుల్లిపోయిన కూరగాయలు, గడువు దాటిన పదార్థాలు, కుల్లిపోయిన మాంసంతో వంటలు చేసి అందులో మసాలాలు వేసి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. టేస్ట్ బాగుందని కస్టమర్లు లాగించేస్తున్నారు.
కొన్ని హెటళ్లలో కెమికల్స్ కూడా ఇష్టారితీగా వినియోగిస్తున్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ బృందం దాడులు చేసింది.సంతోష్ నగర్‌లోని హోటల్ స్వీకర్, స్వాతి హోటల్, హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపిలో దాడులు నిర్వహించారు. హోటళ్లలో అనేక ఉల్లంఘనలు గుర్తించారు. పాచీ ఉన్న ఫ్లోర్, ఎక్కడపడితే అక్కడ నీరు, కిచెన్ రాక్‌లలో బొద్దింకలు, గడువు ముగిసిన మలబార్ పరోటాలు కనిపించాయి. వంట చేసేవారు, వడ్డించేవారికి తలపాగాలు, అప్రాన్‌లు, గ్లౌజుల లేవు. తాజాగా ఆదివారం ఉదయం హబ్సిగూడ, నాచారంలోని పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు చేశారు.
హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్లో తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వంట గదిలో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. దారుణ పరిస్థితులు ఉండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన ఫుడ్ ఇంగ్రిడియెంట్స్తో వంటకాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ల్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అక్కడ కుళ్లిపోయిన టమాటా, ఆలుగడ్డ, గడువు తీరిన పన్నీరు, మష్రూమ్ ప్యాకెట్లను గుర్తించారు.
హోటల్ యజమాన్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొవద్దని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని నెలలుగా తనిఖీలు నిర్వహిస్తున్నా.. పలు రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితి మారడం లేదు. కఠిన చర్యలు తీసుకుంటేనే.. వారు మారుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Nov 10 2024, 13:31