రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ, న్యాయమూర్తులు.. కోర్టుల్లో ప్రాక్టీస్ చేయవచ్చా?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదివారం అంటే నవంబర్ 10వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టునున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు కేంద్రం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సోమవారం అంటే నవంబర్ 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఇతర న్యాయమూర్తులు సైతం రిటైర్ అవుతుంటారు. అనంతరం వారు దేశంలోని వివిధ కోర్టుల్లో న్యాయవాదులుగా ప్రాక్లీస్ చేయవచ్చా? అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే కాదు ఇతర న్యాయమూర్తులు సైతం.. న్యాయాన్ని రక్షించడంతోపాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షిచడంలో వీరంతా కీలకంగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో వారి పదవి కాలం ముగిసిన అనంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(7) ప్రకారం.. సీజేఐలు, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ భారతీయ కోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వహించకూడదని నిషేధం విధించింది.
న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతోపాటు సమగ్రతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొంచిందే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్. అలాంటి దేశంలో న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభంగా పరిగణింపబడుతుంది. ఆ వ్యవస్థ యొక్క విశ్వసనీయత.. వాస్తవ నిష్పాక్షికతపై ఆధారపడి ఉంటుంది. దీంతో న్యాయమూర్తి విధులు నిర్వహించిన అనంతరం న్యాయవాదిగా చేయడానికి అనుమతించినట్లు అయితే వారి పదవీ కాలంలో ఇచ్చిన తీర్పులపై పలు సందేహాలు రేకెత్తినట్లు అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. వైరుధ్యాలను నివారించడం, న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కొనసాగించడం, అనవసరమైన ప్రభావాన్ని నిరోధించడం కోసం.. కోర్టుల్లో వీరి ప్రాక్టీస్‌పై భారత రాజ్యాంగం నిషేధం విధించింది.
ది ఆర్బిట్రేషన్ అండ్ కొన్సలైషన్ యాక్ట్ -1996 ప్రకారం.. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు మధ్యవర్తులుగా అంటే ఆర్బిట్రేటర్స్ లేదా మీడియేటర్స్ (arbitrators or mediators)గా వ్యవహరించవచ్చు. ఎందుకంటే చట్టపరమైన పలు అంశాలు క్లిష్టంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను పరిష్కరించడం కోసం వీరిని ఆర్బిట్రేటర్స్‌గా నియమించే అవకాశం ఉంది. .
అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసిన వారిని వివిధ కమిషన్లకు చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తుంది. అంటే జాతీయ మనవ హక్కుల కమిషన్, లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా నియమించ వచ్చు.
ఇక చాలా మంది పదవి విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులు.. న్యాయ కళాశాలల్లో విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంటారు. అలాగే న్యాయ శాస్త్రంలో తమకున్న జ్ఞానాన్నివిద్యార్ధులకు తమ ప్రసంగాల పాఠాల ద్వారా అందిస్తారు. ఇంకొంత మంది అయితే.. న్యాయ శాస్త్రాలకు చెందిన పుస్తకాలను రాస్తుంటారు. అదే విధంగా రాజ్యాంగ బద్ద సంస్థలకు అధిపతులుగా లేకుంటే రాష్ట్రాలకు గవర్నరులు, ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల్లో సభ్యులుగా సైతం నియమించే అవకాశముంది.
అయితే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గోగోయి విధులు నిర్వహించారు. ఆయన పదవి విరమణ చేశారు. ఆ కొద్ది కాలానికే ఆయన రాజ్యసభ సభ్యుడుగా పెద్దల సభలో అడుగు పెట్టారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. అలాగే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో ఇటీవల వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీనిపై కూడా పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ అగ్రనాయకత్వం స్పందించిందిన విషయం విధితమే.
Nov 09 2024, 12:48