పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులకు రెట్టింపు జరిమానా
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ తీవ్రమవుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా పేలవమైన స్థాయిలో నమోదవుతోంది. ఏక్యూఐ లెవల్స్ రాజధాని ప్రాంతంలో 400కుపైనే నమోదవుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది.
కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రెట్టింపు జరిమానా విధించేలా నిబంధనలను (Farmers to face fines) సవరించింది. రూ.30 వేల వరకూ జరిమానాను పెంచింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. కేంద్ర నిబంధనల ప్రకారం.. రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రూ.5 వేల జరిమానా విధించనున్నారు. రెండు నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న వారికి రూ.10 వేలు, ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.30 వేలు జరిమానా విధించనున్నారు.
కాగా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత 367గా నమోదైంది. ఆనంద్ విహార్, జహంగీర్‌పురి, అశోక్ విహార్, బావన, ముంద్కల్, రోహిని, సోనియా విహార్, వివేక్ విహార్, వాజీపూర్.. ఈ తొమ్మిది ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉన్నది.
Nov 08 2024, 13:42