NLG: ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ త్రిపాఠి
నల్గొండ: ఈ నెల 6 నుండి నిర్వహించనున్న సామాజిక ,ఆర్థిక, విద్య, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విషయమై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ మేరకు సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల టీచర్ల తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సర్వే.. ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ముందుగా ఇండ్ల జాబితా తయారు చేయాలని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై విస్తృత ప్రచారం కల్పించాలని, 6వ తేదీ నుండి సర్వే నిర్వహిస్తున్న విషయం అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతం వరకు చేరాలని, సర్వే వివరాల సేకరణ తర్వాత ఏకకాలంలో డేటాను కంప్యూటరైజేషన్ చేయాలని, ఎట్టి పరిస్థితులలో తప్పు వివరాలు డేటా ఎంట్రీ చేయకూడదని ఆయన ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో అధికారులతో ఇదే విషయమై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను సర్వే ఎన్యుమరేటర్లుగా తీసుకోవడం జరుగుతుందని, ఇందుకుగాను జిల్లాలో ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయుల జాబితాను తక్షణం సమర్పించాలని డిఈఓ ను ఆదేశించారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు జిల్లాలో మొత్తం 4000 మంది ఎన్యుమనేటర్లు అవసరం కాగా, సుమారు 2800 మంది టీచర్లు అందుబాటు లో ఉన్నారని, ఇదివరకు గుర్తించిన ఎన్యుమరేటర్లలో ప్రతిభ కలిగిన వారిని ముందుగా సర్వేకు నియమించి తక్కిన వారిని ఎన్యుమరేటర్లు గా తీసుకోవాలని అన్నారు.అంతేకాకుండా పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖలలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సిఆర్పిలు, తదితరులు అందరిని ఎన్యుమరేటర్లు గా తీసుకోవాలని తెలిపారు.
అలాగే సర్వే నిర్వహించిన అనంతరం తక్షణమే డేటా ఎంట్రీ చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను,సిస్టమ్స్ ను గుర్తించి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లకు ఇచ్చేందుకు తిరిగి గుర్తింపు కార్డులను తయారు చేయాలని, స్టిక్కర్లు అన్నిటిని మరోసారి ముద్రించి సిద్ధం చేసుకోవాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేకించి ఎస్జిటి టీచర్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించనున్న దృష్ట్యా తిరిగి వారికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సిపిఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఆర్డిఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, ఈడిఎం దుర్గారావు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
Nov 03 2024, 21:39