తిరుపతికి తియ్యటి వార్తను ప్రకటించిన కేంద్రం
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం కావడంతోపాటు వరుసగా నాలుగు రోజులు సెలవుదినాలు కావడంతో రైళ్లన్నీ కిక్కిరిసి నడవబోతున్నాయి.
రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈనెల 14, 16 తేదీల్లో కాచిగూడ నుంచి తిరుపతి మధ్య (07653) నడవబోతున్నాయి.
రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మార్గమధ్యంలో షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటాయి.
షిరిడీ వెళ్లేవారికి అనుకూలంగా ఈనెల 14వ తేదీన తిరుపతి నుంచి నాగర్ సోల్ మధ్య 07417 పేరుతో మరో రైలు నడవనుంది. తిరుపతిలో ఉదయం 8.15 గంటలకు బయలుదేరి రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్ నాందేడ్, ఔరంగాబాద్ మీదుగా తర్వాత రోజు ఉదయం 10.00 గంటలకు నాగర్ సోల్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 07418 పేరుతో 15వ తేదీ రాత్రి 10.00 గంటలకు నాగర్ సోల్ లో బయలుదేరి తర్వాతరోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
అధికారులకు ప్రయాణికుల ఫిర్యాదు ఏపీలో ప్రధాన నగరమైన కడపకు ఈ నాలుగు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఇచ్చారు. అయితే వివిధ ప్రాంతాలకు వెళుతున్న రైళ్లు కొన్ని కడప జిల్లాలోని కొన్ని స్టేషన్లలో ఆగడంలేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. కరోనా తర్వాత హాల్టింగ్ నిలిపివేశారని, వెంటనే పునరుద్ధరించాలంటూ అధికారులకు విన్నవించారు.
కొన్ని కొన్ని స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఆరునెలలపాటు రైళ్లను ఆపుతున్నామని, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం రైల్వేకు బాగుంటే కొనసాగిస్తామని, లేదంటే అంతటితో ఆ సౌకర్యాన్ని నిలిపివేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Aug 12 2024, 15:10