సర్కార్ కమాల్..తెలంగాణలో సాగు ఢమాల్..!!
తెలంగాణలో వ్యవసాయంకు పెద్ద దెబ్బ తగిలింది. ఖరీఫ్ సీజన్‌లో సాగునీరుపై నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా పథకం ఆలస్యం కారణంగా ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో పంటపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సీజన్ ముగిసేందుకు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పంటలైన వరి, పత్తి, ధాన్యాల సాగుపై సందిగ్ధత నెలకొంది.
మనకు అందుతోన్న సమాచారం మేరకు ఆగష్టు 10వ తేదీ నాటికి కేవలం 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాధారణంగా ఖరీఫీ సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో నాట్లు వేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల కేవలం 65.4శాతం మేరకే నాట్లు జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది 99.9 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కాగా మొత్తం ఖరీఫ్ సీజన్లో 1.26 కోట్ల ఎకరాల్లో పంట సాగైంది.
అయితే ఇప్పటికీ నాట్లు పూర్తి కాకపోవడంతో రైతుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వంపై చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో సాగునీరు అందడం, రైతు భరోసా అందడంతో వ్యవసాయంలో వృద్ధి నమోదయ్యేదని కానీ ఈసారి ఆగష్టు నెల వచ్చినప్పటికీ నాట్లు వేసే కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభుత్వం నుంచి మద్దతు లేకపోవడం, సాగునీరు కొరత ఉండటంతో పూర్తిస్థాయిలో నాట్లు చేపట్టలేకపోయామని రైతులు చెబుతున్నారు.
కొన్ని జిల్లాలు పూర్తిగా సాగునీరు పై ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. రైతులు కూడా పంట వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. వీటన్నిటికీ సమగ్ర కారణం భూగర్భ జలాలు అడుగంటిపోవడమే. గతేడాది 6.17మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉండగా అది 2.08 మీటర్లకు పడిపోయింది.
అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండగా.. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వ్యవసాయం అత్యంత దారుణంగా ఉంది. కృష్ణ నదీ జలాలపైనే ఆధారపి ఉన్న నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కేవలం 60శాతం మాత్రమే పంట సాగు జరిగింది. ఖరీఫ్ సీజన్‌లో ఈ స్థాయిలో పంట సాగు జరగడం ఇదే తొలిసారి అని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెరుకు, వరి, ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె, పత్తి వంటి ప్రధాన పంట సాగుపై తీవ్ర ప్రభావం పడింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో పంట సాగు ఇంత తీవ్రంగా పడిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగం ఎంత సంబరంగా వ్యవసాయం చేసిందో ఇప్పటి ప్రభుత్వంలో అదే రైతాంగం ఎలా దిగాలుగా ఉందో చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో అత్యంత పేలవంగా పంటసాగు జరుగుతోందంటే ఎవరు కారణమని ప్రశ్నించారు. దశాబ్దకాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో ఎనిమిది నెలల్లోనే వ్యవసాయ విధ్వంసం జరిగిందని మండిపడ్డారు.
Aug 12 2024, 15:07