ప్రత్యేక హోదా ఇవ్వలేం.. పార్లమెంటులో తేల్చి చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పేసింది. దీంతో ఇప్పటివరకు ప్రత్యేక హోదా వస్తుందని పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. లోక్‌సభలో మెజార్టీ మార్కును అందుకోవడంలో విఫలమైన బీజేపీకి ఎన్డీఏలోని టీడీపీ, జేడీయూలు కీలక మిత్రపక్షాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఏపీ, బీహార్‌లు ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురుచూస్తుండగా.. కేంద్రం చేసిన ప్రకటనతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.
మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా 2014 నుంచి కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ సొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి సొంతంగా లోక్‌సభలో మెజార్టీ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ - టీడీపీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ - జేడీయూల మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్.. మళ్లీ తెరపైకి వచ్చింది.
అయితే ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రణాళిక సహాయం కోసం.. గతంలో నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ -ఎన్‌డీసీ ద్వారా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేశారు. ప్రత్యేక కేటగిరీ ప్రకటించేందుకు అనేక కారణాలు, అవసరాల ఆధారంగా వర్గీకరించారు. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. బీహార్ రాష్ట్ర పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతకుముందు.. గతంలో ప్రత్యేక కేటగిరీ హోదా కోసం బీహార్ చేసిన అభ్యర్థనపై.. అంతర్గత మంత్రుల గ్రూపు సమగ్ర పరిశీలన చేసి.. 2012 మార్చి 30 వ తేదీన తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పటికే నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రమాణాల ఆధారంగా.. అంతర్గత మంత్రుల గ్రూపు.. బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించేందుకు ఎలాంటి సూచనలు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో పార్లమెంటు ముందు ఉంచారు.
దీంతో ఎన్డీఏలో చక్రం తిప్పవచ్చని.. తమ డిమాండ్లు కేంద్రం వద్ద నుంచి సాధించవచ్చని ఇన్ని రోజులు భావించిన నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఇటీవలె నితీష్ కుమార్ సర్కార్ ఆమోదించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం.. బీహార్‌కు ప్రత్యేక హోదా లేదని తేల్చేయడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక పార్లమెంటు సమావేశాలకు ముందు నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ను ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు వినిపించాయి. జనతాదళ్ యునైటెడ్ నుంచి సంజయ్ కుమార్ ఝా..
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్.. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు కూడా తమ గళం వినిపించాయి. అయితే ప్రత్యేక హోదా కల్పించడం వీలు కాని పక్షంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అయినా బీహార్‌కు ఇవ్వాలని సంజయ్ కుమార్ ఝా తెలిపారు.
Jul 22 2024, 17:24