రాహుల్ వరంగల్ సభ 28న?
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు నేపథ్యంలో వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కృతజ్ఞత సభ ఈ నెల 28న జరిగే అవకాశం ఉంది. ఆగస్టు 3న సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ లోపే సభ నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.
కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు శనివారమే ఢిల్లీకి చేరుకున్నారు.
సోమవారం ఈ ముగ్గురూ రాహుల్‌గాంధీని కలిసి కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించనున్నారు. రాహుల్‌కు ఉన్న వెసులుబాటును బట్టి సభ నిర్వహించే తేదీ ఖరారు కానుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచిప్రారంభం కానుండగా..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభవుతున్నాయి. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ సమావేశాలకు ఇబ్బంది రాకుండా ఈ నెల 28న ఆదివారం వరంగల్ కృతజ్ఞతా సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో రేవంత్ భేటీ తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
రాహుల్‌గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర అగ్రనేతలనూ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లు కలిసి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 23న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం సీఎం, మంత్రులు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పలువురు కేంద్ర మంత్రులనూ కలవనున్నారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై వారికి విజ్ఞాపన పత్రాలను సమర్పించనున్నారు. రేవంత్, నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌లు సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర జల వనరుల మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసే అవకాశం ఉంది. పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆయన దగ్గర ప్రస్తావించాలని భావిస్తున్నారు.
రాహుల్‌గాంధీ.. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఢిల్లీలో నేతలకు అందుబాటులోకి రానున్నట్లు ఏఐసీసీ ఇచ్చిన సమాచారం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. భట్టి, ఉత్తమ్‌లు కూడా అప్పటికే ఢిల్లీలో ఉండడంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపైనా అధిష్ఠానం పెద్దలతో చర్చిస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్లమెంటు సమావేశాల్లో అధిష్ఠానం, అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర నాయకత్వం బిజీ అవుతున్న నేపథ్యంలో ఈ చర్చ ఉత్పన్నం కాదని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. సోమవారం దీనిపై స్పష్టత వస్తుందని అంటున్నారు.
Jul 22 2024, 10:29