కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్.. ల్యాండ్ సేల్, పర్చేస్‌లో తహశీల్దార్ల కొత్త మెలిక
నాలుగేండ్లు పరిష్కారమైందని అనుకుంటున్న వారికి మరో ముప్పు పొంచి ఉన్నది. ‘రెండు, మూడేండ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి.. అడిగినంత సమర్పించుకొని తమ సమస్యను పరిష్కరించుకున్నాం.. మేం సేఫ్!’ అని అనుకుంటున్నారు.
కానీ.. మరోసారి అధికారుల చుట్టూ తిరిగే రోజు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఎప్పుడైనా ల్యాండ్‌ను అమ్మేద్దామనుకున్నా, సక్సెక్షన్ చేద్దామనుకున్నా.. తహశీల్దార్లు ఆర్డర్ కాపీ చూపించండి అని అడుగుతుండటంతో ఖంగు తింటున్నారు.
ధరణి పోర్టల్‌లో డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్స్, పీవోబీ అన్ బ్లాకింగ్ వంటి అనేక సమస్యలకు 33 మాడ్యూళ్లు ఇచ్చారు. అందరినీ ఆన్‌లైన్‌లోనే రూ.1,000 చెల్లించి అప్లయ్ చేసుకోమన్నారు. ఇప్పటికే 19 లక్షల మందికిపైగా తమ రికార్డుల్లో పొరపాట్లు ఉన్నాయని అప్లయ్ చేశారు.
కొందరి దరఖాస్తులు ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేస్తే నాలుగు, ఐదుసార్లు కూడా అప్లయ్ చేసుకున్నారు. ప్రతిసారీ రూ.1,000 వంతున చెల్లించారు. తహశీల్దార్లను వేడుకుంటే.. కొందరికి ఇంత ఖర్చు పెట్టుకుంటే తప్పా పాజిటివ్ రిపోర్టులు రాయలేదు. ఆ రాసిన కాపీని చేతికి ఇవ్వాలని కోరితే తామే ఆర్డీవో, కలెక్టర్లకు పంపుతామన్నారు. ఏ అధికారి కూడా దరఖాస్తుదారుడికి వారేం రిపోర్ట్ పంపారన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆఖరికి కలెక్టర్ అప్రూవ్ చేసినా, సీసీఎల్ఏ ఆమోదించినా, టీఎస్ టీఎస్ వాళ్లు ఓకే చేసినా ఎక్కడా దరఖాస్తుదారుడికి చిన్న కాగితం ముక్క కూడా ఇవ్వలేదు. రిజెక్ట్ చేసినా కారణాలు తెలపలేదు. ఇప్పుడేమో అమ్మడానికి వెళ్తే, ఏదైనా డీడ్స్ చేయడానికి వెళ్తే అదే తహశీల్దార్ కాపీ అడుగుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.
అధికారిక లెక్కల ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు 16,57,407 దరఖాస్తులు రాగా.. 8,78,282 పరిష్కరించారు. 5,37,984 దరఖాస్తులను తిరస్కరించారు. పెండింగులో 2,40,127 ఉండేవి. అయితే మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టి 1,61,760 దరఖాస్తులను పరిష్కరించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా 1,15,308 కొత్తగా వచ్చాయి. అంటే 1,93,675 వరకు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. రిజెక్ట్ చేసిన వాళ్లు మళ్లీ అప్లయ్ చేస్తూనే ఉన్నారు. డ్యాష్ బోర్డు క్లియర్ పేరిట అకారణంగా తిరస్కరణకు గురైన అప్లికేషన్లు మళ్లీ వస్తాయి. అంటే ఇంకా లక్షల్లో ఉంటాయి. అయితే ఇప్పటి దాకా పరిష్కరించిన సుమారు 10 లక్షల దరఖాస్తులకు ఆర్డర్ కాపీలు ఎవరి దగ్గర తెచ్చుకోవాలో ఉన్నతాధికారులు చెప్పడం లేదు. లేదంటే ధరణి పోర్టల్‌లో సవరించిన రికార్డుల ప్రకారం కరెక్టుగా ఉంటే ఆర్డర్ కాపీ అడగకుండానే క్రయవిక్రయాలు చేయాలని తహశీల్దార్లు/డిప్యూటీ తహశీల్దార్లకు ఆదేశాలివ్వాలని బాధితులు కోరుతున్నారు
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో రెండెకరాల భూమిని ధరణి పోర్టల్ రాకముందే కొనుగోలు చేశారు. అన్ని పహాణీలు చూసి, లీగల్ ఓపినియన్ తీసుకొని సేల్ డీడ్ ద్వారా కొన్నారు. ఆ తర్వాత మ్యుటేషన్ అయ్యింది. కొత్త పాస్‌బుక్కులు కూడా వచ్చాయి. ధరణి రాగానే అది ప్రభుత్వ ల్యాండ్‌గా పీవోబీలో నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసి 18 నెలలపాటు తిరిగి చివరకు సమస్యను పరిష్కరించుకున్నారు. దాంతో ధరణి పోర్టల్‌లో క్లాసిఫికేషన్ పట్టాగా మారింది. ఇప్పుడు అదే భూమిని సేల్ చేయడానికి స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజులన్నీ కట్టి స్లాట్ బుక్ చేసుకున్నారు.
తీరా సమయానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్తే ధరణి ఆపరేటర్ పాత రికార్డును తహశీల్దార్/డిప్యూటీ తహశీల్దార్ ముందు పెట్టడంతో తాను చేయనంటూ తెగేసి చెప్పారు. సమస్య పరిష్కారమైందని చెబితే తమకు ఆర్డర్ కాపీ చూపించాలని సేల్ డీడ్‌ను పక్కన పెట్టేశారు. రికార్డుల్లో తప్పుగా ఉంటే స్లాట్ బుక్ కాదు కదా అంటే కూడా వినలేదు. దాంతో ఉన్నతాధికారుల నుంచి ఫోన్ చేయిస్తే తప్ప సేల్ డీడ్ కాలేదు.
Jul 20 2024, 15:48