పదేండ్ల కిందటి తెలంగాణను తలుచుకుంటే.. ఇప్పటికీ దు:ఖం తన్నుకొస్తది: సీఎం కేసీఆర్
పదేండ్ల కిందటి తెలంగాణను తలుచుకుంటే.. ఇప్పటికీ దు:ఖం తన్నుకొస్తది సీఎం కేసీఆర్
దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఒక పవిత్ర యజ్ఞం
పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది అని కేసీఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాక్‌కో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఉండే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించిందని సీఎం తెలిపారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది
ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసిందని కేసీఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచింది అని కేసీఆర్ పేర్కొన్నారు.
పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్న తెలంగాణ
నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది అని కేసీఆర్ తెలిపారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1
ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు.. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం అని కేసీఆర్ చెప్పారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ. 3 లక్షల 12 వేల 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.
వెలుగు జిలుగుల తెలంగాణ
విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కేసీఆర్ పేర్కొన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసింది అని కేసీఆర్ తెలిపారు.
Aug 17 2023, 12:58