కారు ఎక్కుతాం ప్లీజ్..లిఫ్ట్!
రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో ఎన్నికల మూడ్ వచ్చేసింది. సర్వేలు, సీట్ల పంపకం అంటూ ఏదో ఒక అంశంపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
ఇతర పార్టీల సంగతేమో కానీ అధికార బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా రోజురోజుకి పెరిగిపోతోంది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు అధికారులు కూడా ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నారు.
కొలువు వదిలి కారు ఎక్కి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇలాంటి వారు ఐదారుగురు ఉన్నారు. ఎన్నికల టికెట్ ఆశిస్తున్న వీరంతా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని ఆ శాఖ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. నిజానికి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరే ఇన్నాళ్లూ ఎన్నికల రేసులో వినిపించేది. తాజాగా వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి పేరు ఈ జాబితాలో చేరింది.
అంతేకాక, రమేశ్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. 2017 జూన్ నుంచి డీఎంఈగా కొనసాగుతున్న రమేశ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ వద్ద మంచి పేరుందనే ప్రచారమే ఇందుకు కారణం. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన రమేశ్‌రెడ్డికి విద్యార్థి నాయకునిగా పనిచేసిన అనుభవమూ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న రమేశ్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జహీరాబాద్ లేదా కంటోన్మెంట్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి, 2018లో ఎర్రోళ్ల ఉమ్మడి మెదక్ జిల్లా అందోల్ సీటు ఆశించినా అధిష్ఠానం టికెటివ్వలేదు. రంగారెడ్డి డీఎంహెచ్‌వో ఆఫీసులో పనిచేస్తున్న టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. రాజేందర్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ డీఎంహెచ్‌వోతోపాటు నీలోఫర్‌లో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్ కూడా బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. డాక్టర్ లాలూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్టీ స్థానమైన దేవరకొండ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.
కొత్తగూడెం బరిలో డీహెచ్ గడల
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు తన సొంత నియోజకవర్గం కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి విస్తృత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాక, ఆ నియోజకవర్గంలో డీహెచ్ గడల సామాజికవర్గపు ఓట్లు 35వేల వరకు ఉన్నాయి. ఇప్పటికే సామాజిక వర్గ పెద్దలతో పలుమార్లు భేటి అయిన ఆయన వారి మద్దతు కూడగట్టినట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆశీస్సులతోనే గడల ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. మరోపక్క, కొత్తగూడెం సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు వయసు పైబడటం, ఆయన కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలుండటంతో ఈసా రి ఆ కుటుంబానికి టికెట్ దక్కదని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగి తే ఆ స్థానంలో గులాబీ పార్టీకి మరో బలమైన నాయకుడు లేరు. దీంతో ఆ టికెట్ ఆశిస్తున్న గడల ఎన్నికల బరిలో నిలవాలని పట్టుదలగా ఉన్నారని సమాచారం...
Jun 26 2023, 10:58