సహకరించకపోయినా పర్వాలేదు.. మా అభివృద్ధిని అడ్డుకోకండి: మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ:జూన్ 24
సహాయం చేయకపోయినా ఫర్వాలేదు.. కనీసం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.
కంటోన్మెంట్‌లో రోడ్ల అభివృద్ధి, స్కైవేల నిర్మాణం తదితర అంశాలపై చర్చించి కేటీఆర్ ఆయనకు విమతిపత్రం సమర్పించారు. రక్షణ మంత్రితో సమావేశం అనంతరం ఆయన ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథంతో కలిసి తుగ్లక్ రోడ్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామనిఅమరులకు అసలైన నివాళి అభివృద్ధి’ అన్న నినాదంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ, ఆసియాలో అతిపెద్ద హౌసింగ్ వంటివి అందులో ఉన్నాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెబుతోందని అన్నారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రానికి మరింత చేయూతనివ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకెళ్తున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సహకరించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది గుండు సున్నా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో రక్షణ శాఖకు మంత్రులుగా పని చేసే ఐదుగురుని పలుమార్లు కలిశామని గుర్తు చేశారు. దేశంలో జరుగుతున్న ఉద్యోగ కల్పనలో 44 శాతం ఉద్యోగాలు హైదరాబాద్ నుంచేనని చెప్పారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ లలో మూడో వంతు హైదరాబాదులోనే తయారవుతూ గ్లోబల్ హబ్‌గా నిలిచిందని అన్నారు. ఇలా శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను ఆ మేరకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
మౌలిక వసతుల కల్పనలో సహకరించాలని తొమ్మిదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నామని, ప్రధాని నుంచి మొదలుపెట్టి ఐదుగురు రక్షణ మంత్రులను పదే పదే అడిగామని గుర్తుచేశారు. అయినా ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని కేటీఆర్ ఆరోపించారు. వరదల్లో హైదరాబాద్ నగరంలో అతలాకుతలమైన సమయంలో కూడా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారికి కనెక్ట్ చేసే మార్గంలో ఒక ‘స్కైవే’ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే ఈ స్కై వే నిర్మాణం కోసం మార్గంలో ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం నుంచి రక్షణ శాఖకు చెందిన 96 ఎకరాలు అవసరమవుతుందని, అలాగే ప్యాట్నీ సెంటర్ నుంచి నాగ్‌పూర్ హైవే వరకు 18.5 కి.మీ స్కై వే మేర నిర్మించ తలపెట్టిన మరో స్కైవే కోసం 56 ఎకరాల రక్షణశాఖ స్థలం కావాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతున్నట్టు చెప్పారు. రక్షణ శాఖ ఇచ్చే స్థలానికి సమాన మొత్తంలో మరోచోట స్థలాన్ని ఇస్తామని చెబుతున్నా సరే కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు...
Jun 24 2023, 10:04