జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ 3 హత్యలు
•సైకో సీరియల్ కిల్లర్ అరెస్టు
రాజేంద్రనగర్ అతను కరడుగట్టిన నేరస్థుడు. అయిదుగుర్ని కిరాతకంగా చంపాడు. ఒళ్ళు గగుర్పొడిచే నేరచరిత్ర ఉన్న అతనికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ క్షమాభిక్ష లభించి జైలు నుంచి బయటికొచ్చాడు. మళ్లీ అతనిలో ఉన్మాది నిద్రలేచాడు. వరుసగా మూడు హత్యలు చేశాడు. హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులను చేసిన ‘సైకో సీరియల్ కిల్లర్’ బ్యాగరి ప్రవీణ్ (34)ను పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు.
ఈ కేసుల వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. రాజేంద్రనగర్ ఇంద్రారెడ్డి నగర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కూలీ పనిచేసేవాడు. 2011లో బుద్వేల్‌లో ప్రకాశ్ అనే వ్యక్తి బయట పడుకుని ఉండగా బండరాయితో మోది చంపాడు. కొన్ని రోజులకు అలాగే అత్తాపూర్ పిల్లర్ నెం.127 వద్ద ఓ యాచకుడిని హతమార్చాడు. తర్వాత ప్రవీణ్ తన మిత్రులు షేక్ ఫయాజ్, దర్గా నరేశ్‌తో కలిసి ఇంద్రారెడ్డినగర్ బస్తీకి చెందిన భార్యాభర్తలు, వారి కొడుకుని హత్య చేశారు. ఇంటి బయట పడకున్న వ్యక్తిని చంపి, ఇంట్లోకి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేసి గొంతు కోసి హతమార్చారు. ఆమె పక్కనే ఉన్న కొడుకుని కూడా చంపి పారిపోయారు. అప్పట్లో వరసగా జరిగిన 5 హత్యలు కలకలం రేపాయి. 2014 జూన్‌లో ప్రవీణ్‌కు యావజ్జీవ శిక్ష పడింది. గతేడాది అక్టోబరు 29న క్షమాభిక్షపై విడుదలయ్యాడు. తర్వాత ప్రవీణ్‌లోని ఉన్మాది మళ్లీ నిద్రలేచాడు. ఈ నెల 8న నేతాజీనగర్‌లో ఆరుబయట పడుకున్న గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశాడు. మంగళవారం (20వ తేదీ)అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మరో ఇద్దర్ని చంపాడు. కాటేదాన్ స్వప్న థియేటర్ సమీపంలో ఖజారియా దుకాణం ముందు పడుకున్న గుర్తు తెలియని వ్యక్తి తలపై బండరాయితో మోది చంపి అతని వద్ద ఉన్న రూ.400 తీసుకుని దుర్గానగర్ వైపు వెళ్లాడు. అక్కడ దుప్పట్లు అమ్ముకునే ప్రకాశ్ (55) అనే వ్యక్తి ఆరుబయట పడుకుని ఉండగా అతని తలపై బండరాయితో మోది హత్య చేశాడు. అతని వద్ద ఉన్న రూ.1500 తీసుకుని పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నిందితుడిని 24 గం టల్లో పట్టుకున్నారు. ప్రవీణ్‌పై చోరీ, దోపిడీ, చైన్‌స్నాచింగ్ కేసులు కూడా ఉన్నట్టు గుర్తించారు...
Jun 23 2023, 18:37