ఎన్నికల వేళ కేసీఆర్ మాస్టర్ ప్లాన్..❓️
సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం తన ప్రసంగంలో అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి వరాలు కురిపిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున మొత్తం అమరవీరుల కుటుంబాలను ఆకట్టుకునే విధంగా పలు హామీలు ఇస్తారన్న టాక్ గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నది. ఇప్పటికే సుమారు 585 కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం, కొద్దిమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఇచ్చినందున మిగిలిన కుటుంబాలను ఎలాంటి హామీలతో సంతృప్తిపరుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ కుటుంబాలను స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించడం, ప్రతి నెలా ఆ కుటుంబాలకు పింఛన్‌ను అందజేయడం, సొంతిల్లు లేని కుటుంబాలకు గృహవసతి కల్పించడం లాంటి హామీలు ఉండొచ్చని సమాచారం. అమరవీరుల కుటుంబాలను పూర్తిస్థాయిలో గుర్తించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కేసీఆర్‌పై ఉన్న అసంతృప్తిని, వ్యతిరేకతను, మచ్చను తొలగించుకోడానికి కొన్ని నిర్దిష్టమైన హామీలను ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. అమరవీరుల కుటుంబాల్లో ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందినందున మిగిలిన ఫ్యామిలీస్‌ను గుర్తించి ఇలాంటివి అందించడంపై స్పష్టత ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి.
రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఈ దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌లో అమరవీరుల కుటుంబాలపై స్పష్టత ఇచ్చింది. ప్రియాంకాగాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి ఈ డిక్లరేషన్‌లోని అంశాలను వివరించారు. అమరవీరుల కుటుంబాలన్నింటినీ గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా సాయం చేస్తామని, ఆ కుటుంబాల్లో ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని, ప్రతి నెలా రూ. 25 వేల చొప్పున పెన్షన్ ఇస్తామని, చనిపోయినవారిని స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తిస్తామని, వారిపైన నమోదైన అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నందున ఆ డిక్లరేషన్‌కు దీటుగా సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీలతో ప్రకటన చేసే అవకాశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొమ్మిదేళ్ళుగా వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో హామీల ద్వారా రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ మరి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను అమరవీరుల స్మారకచిహ్నం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం మాత్రమే కాకుండా ప్రభుత్వమే ఒక కారును, వ్యక్తిగత సహాయకుడిని, గన్‌మెన్‌ను ఏర్పాటు చేసి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఆమెను గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశమూ ఉన్నది...
Jun 22 2023, 11:06