India: ఉగ్రవాదులకు చైనా అండ.. మండిపడ్డ భారత్..
దిల్లీ: పాకిస్థాన్ కేంద్రంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా చైనా అడ్డుపుల్ల వేసింది..
దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
'అనేక సభ్య దేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదన విజయవంతం కాకపోతే, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఆర్కిటెక్చర్‌లో నిజంగా ఏదో తప్పు ఉందని నమ్మడానికి మాకు న్యాయమైన కారణాలు ఉన్నాయి. అల్పమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను నిషేధిత జాబితాలోకి చేర్చలేకపోతే.. మనకు ఉగ్రవాదంపై పోరాడే నిజమైన సంకల్పం లేనట్టే' అని చైనాపై తీవ్రంగా మండిపడింది.
ఎవరీ సాజిద్ మీర్..
పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా ఉగ్ర ముఠాలో సాజిద్ మీర్ 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2011 వరకు ఈ ముఠా విదేశాల్లో జరిపిన దాడులకు మీర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. 2008లో ముంబయిలో చోటుచేసుకున్న 26/11 పేలుళ్లలో ఇతడే కీలక సూత్రధారి. అతడిపై అమెరికా 5 మిలియన్ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. కాగా.. గతంలో సాజిద్ మీర్ చనిపోయినట్లు పాకిస్థాన్ ప్రచారం చేసింది. కానీ, పశ్చిమ దేశాలు నమ్మలేదు. అతడి మృతిపై ఆధారాలు చూపించాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో వెనక్కి తగ్గిన పాక్.. గత ఏడాది జూన్‌లో అతడికి 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
మరోపక్క, భారత్ సాజిద్‌ను మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్, అమెరికా సంయుక్తంగా ఓ ప్రతిపాదననూ సిద్ధం చేశాయి. దీనిని ఐక్యరాజ్య సమితి(ఐరాస)లోని భద్రతా మండలికి చెందిన 'అల్‌ఖైదాపై ఆంక్షల కమిటీ'సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా చైనా అడ్డుకుంది.
Jun 21 2023, 12:10