పాలమూరు అసెంబ్లీ బరిలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్..?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు వీలుగా వ్యూహ రచనలు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ బిడ్డకు కానుకగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇటీవల జడ్చర్ల వేదికగా జరిగిన బహిరంగ సభలో జనానికి విజ్ఞప్తి చేశారు.
ఇదే సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 12 స్థానాలను గెలుచుకోవాలని సూచించగా.. లేదు లేదు 14 స్థానాలను గెలిపించి తీరుతాము అని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక స్థానాలను గెలుచుకుంటేనే పీసీసీ అధ్యక్షునిగా తన బాధ్యతలను సమర్థవంతునిగా నిర్వహించినవాడని అవుతాను అన్న ఆలోచనలతో రేవంత్ రెడ్డి ఉన్నారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారు అన్న విషయము స్పష్టం అయ్యింది. ప్రస్తుతము ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు అన్నింట్లో అధికార బీఆర్ఎస్ పార్టీ బలిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి అంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గంలో నుండి తప్పనిసరిగా పోటీలో ఉండాలి.
కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది అన్న ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.
Jun 18 2023, 18:01