ఆగస్టు 1 నుంచి 23వరకు ‘గురుకుల’ పరీక్షలు
: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్షియల్ గురుకులాల్లోని 9,210 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రిబ్) పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 23వరకు ఆయా పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను (సీబీఆర్‌టీ) నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే.. ఆగస్టులోనే కేంద్ర సర్వీసుల పరీక్షలు ఉన్నాయి. ఇటు టీఎస్‌పీఎస్‌సీ సైతం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో గురుకుల పోస్టులను ఏ తేదీల్లో నిర్వహించాలి, ఎప్పుడు ఏం పరీక్షలు ఉన్నాయి అన్నదానిపై ట్రిబ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆగస్టులో కేంద్ర సర్వీసుల పరీక్షల తేదీలు సైతం ఇప్పటికే విడుదల అయ్యాయి. మరోవైపు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్(ఎస్‌ఎస్‌సి–హెచ్‌ఎస్‌ఎల్)ను ఆగస్టు 2 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన విడదులైంది.
ఈ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి చాలా మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఐబీపీఎస్–ఆర్‌ఆర్‌బి పరీక్షలో ఉచిత పరీక్ష శిక్షణను(పీఈటీ) ఆగష్టు 17 నుంచి 22 వరకు నిర్వహించాలని, ప్రిలిమినరీ పరీక్షను అదే నెల 12, 13, 19 తేదీల్లో నిర్వహించాలని ఆ బోర్డు నిర్ణయించింది. ఇక గురుకుల పరీక్షల షెడ్యూల్ కూడా వస్తే తమ పరిస్థితి ఏంటోనని అభ్యర్ధులు అందోళనకు లోనవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో అత్యంత ముఖ్యమైన పరీక్షలన్నింటినీ ఉంటే తాము అంతిమంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందేమోనంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురుకుల పోస్టుల పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చేసి తమను ఆదుకోవాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లోని 9,210 పోస్టులను భర్తీ చేసేందుకు గురుకుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 14 నుంచి మే 25వరకు ఆన్‌లైన్ ద్వారా ఆయా పోస్టుల దరఖాస్తులను స్వీకరించారు. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి. ఈక్రమంలో గురుకుల బోర్డు పరీక్ష తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
Jun 18 2023, 18:00