తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ : వాన కబురు
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా.. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణను తాకే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. అలాగే పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం కొనసాగనుంది.
నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని వాతావారణశాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని స్పష్టం చేసింది.
ఇక ఇవాళ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలుల ప్రభావం ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. రేపు పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాలులు తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అలాగే సోమవారం పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఈరోజు నుంచి 21 మధ్య రుతుపవనాలు విస్తరించేందుకు మరిన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో తెలంగాణలో 19వ తేదీ నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
ఇక నేడు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు, 27 డిగ్రీలు నమోదవుతాయని తెలిపింది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంది.
అటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పలు ప్రాంతాల్లో నమోదవుతుండటంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు.....
Jun 18 2023, 17:58