మన్మోహన్ సింగ్ కన్నుమూత
దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నో కీలక పదవుల్లో విశిష్టమైన సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఆయన దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో దేశ ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు మన్మోహన్ సింగ్ ప్రతీకని కొనియాడారు. 1991లో ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా దేశానికి వెలకట్టలేని సేవలందించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
Dec 27 2024, 10:35