మేడిగడ్డ కుంగడానికి ముందే బుంగలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాకు చాలా ప్రమాదకరమని కాళేశ్వరం విచారణ కమిషన్ వ్యాఖ్యానించింది. బ్యారేజీలపై విచారణ సందర్భంగా సోమవారం చీఫ్ ఇంజనీర్ (సీఈ)లతో పాటు 18 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాకు చాలా ప్రమాదకరమని కాళేశ్వరం విచారణ కమిషన్ వ్యాఖ్యానించింది. బ్యారేజీలపై విచారణ సందర్భంగా సోమవారం చీఫ్ ఇంజనీర్ (సీఈ)లతో పాటు 18 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీ కుంగడానికి గల కారణాలేంటని డీఈఈ ఎల్.భీమరాజును అడగ్గా.. కారణాలు తెలియవని, విశ్లేషణ జరుగుతోందని గుర్తుచేశారు. మేడిగడ్డలోని ఏడో బ్లాకు కుంగడానికి ముందే బుంగలు ఏర్పడినట్లు గుర్తించామని, వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)కి లేఖ రాశామని భీమరాజు తెలిపారు. నాలుగు సార్లు లేఖలు రాసినట్లు నివేదించారు. ఏడో బ్లాకు కుంగడానికి ముందు బుంగలు ఏర్పడడంతో వెంటనే ఈఈకి లేఖ రాశానని, తర్వాత తొలి వరదలకు సీసీ బ్లాకులు చెల్లాచెదురయ్యాక కూడా లేఖ రాశానని, మొత్తం నాలుగు లేఖలు రాసి, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నిర్మాణ సంస్థకు లేఖ రాశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. రాయలేదని బదులిచ్చారు. ఈ సందర్భంగా ఏడో బ్లాకు చాలా ప్రమాదకరమని కమిషన్ వ్యాఖ్యానించింది. విచారణకు హాజరైన 18 మందిఅధికారులను అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలన్నీ వాస్తవాలేనా? అని ప్రశ్నించింది.
ఒక్క సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ ఓరుగంటి మోహన్‌కుమార్ మాత్రం తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో చిన్న పొరపాటు జరిగిందన్నారు. గోదావరి నదిలో ఇంద్రావతి కలిసే చోట నీటి లభ్యత అని రాశానని, అక్కడ గోదావరిలో ప్రాణహిత కలిసే చోటగా మార్పులు చేయాలని నివేదించారు. ఏఈఈ రూపాని విజయ్‌ని అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలేనా అని అడగ్గా.. అదనంగా మరిన్ని వివరాలు చెప్పబోయారు. స్పందించిన కమిషన్.. ‘అడిగిన దానికే జవాబు చెప్పాలి. అడగని వాటికి కాదు’ అని మండిపడింది. రూ.2591 కోట్ల వ్యయంతో మేడిగడ్డ నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇచ్చిందెవరు? అని ప్రశ్నించగా.. నీటిపారుదల శాఖ కార్యదర్శి అని బదులిచ్చారు. మరో ఏఈఈ ఎం.ప్రసాద్‌ను ప్రశ్నిస్తూ.. ప్లేస్‌మెంట్ రిజిస్టర్‌లో సంతకాలు మీరే చేశారా? ఆ సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారా? అని ప్రశ్నించగా.. తానే చేశానని, తన వెంట తోటి సిబ్బంది తప్ప ఎవరూ లేరని చెప్పారు. ఏ రోజు నిర్మాణ వివరాలను ఆ రోజే రిజిస్టర్‌లో నమోదు చేశారా? లేదా? అని ఏఈఈ రవికాంత్‌ను ప్రశ్నించగా.. ఏ రోజు వివరాలు ఆ రోజే నమోదు చేశారని బదులిచ్చారు.
బ్యారేజీతో ముడిపడిన డిజైన్లు ఏమైనా సిద్ధం చేశారా? అని సీడీవో ఈఈ ఎం.రామసుబ్బారెడ్డిని ప్రశ్నించగా.. డిజైన్లు తాను ఇవ్వలేదని, బ్యారేజీతో ముడిపడిన పనుల్లో తన పాత్ర లేదని, బ్యారేజీ కుంగిన తర్వాత 3డీ మోడల్ స్టడీ్‌సలో తాను పాల్గొన్నానని చెప్పారు. డిజైన్ల తయారీలో మీ పాత్ర ఉందా? అని మాజీ సీఈ టి.శ్రీనివా్‌సను ప్రశ్నించగా.. తన పాత్ర లేదన్నారు. బ్యారేజీ అనుబంధ పనుల డిజైన్లలోనే తన పాత్ర ఉందని తెలిపారు.
ప్లేస్‌మెంట్ రిజిస్టర్లపై విచారణకు హాజరైన, ఆయా రిజిస్టర్లలో వివరాలు నమోదు చేసిన ఏఈఈ, డీఈఈల సంతకాలు తీసుకున్న కమిషన్.. ఆ రిజిస్టర్లను స్వాధీనం చేసుకుంది. ఎవరు నిర్మాణబాధ్యతలు చూ శారో నిర్ధారించుకోవడానికే సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. మంగళవారం 15 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది. సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అఽధికారులను ప్రశ్నించనుంది.
Nov 27 2024, 15:48