ప్రతిభ ఆధారంగానే సీట్ల భర్తీ

అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, కర్నూలులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీలలో పెరిగిన 75 సీట్లను నీట్‌ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని హైకోర్టు పేర్కొంది.

అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌, కర్నూలులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీలలో పెరిగిన 75 సీట్లను నీట్‌ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని హైకోర్టు పేర్కొంది. వీటితోపాటు తమ ఆదేశాలతో కర్నూలు మెడికల్‌ కాలేజీలో నిలిపి ఉంచిన ఒక సీటును కూడా ప్రతిభావంతులకే కేటాయించాలని తెలిపింది.

అదేవిధంగా ఆయా సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీట్‌లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులందరికీ ఈ 76 సీట్ల భర్తీలో అవకాశం ఇవ్వకుంటే ప్రయోజనం ఉండదని, అంతగా ప్రతిభలేని వారికి ఈ సీట్లు దక్కుతాయని పేర్కొంది.

ఈ ఉత్తర్వుల కాపీలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) డైరెక్టర్‌, ఎన్టీఆర్‌ హెల్త్‌ యునివర్సిటీ రిజిస్ట్రార్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేందర్‌, జస్టిస్‌ ఎం. కిరణ్మయితో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను మంగళవారానికి(నేడు) వాయిదా వేసింది. వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక.. కోనసీమ వైద్య, పరిశోధన కళాశాలలో 25 సీట్లు, కర్నూలులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీలో 50 సీట్లు పెంచుతూ ఎన్‌ఎంసీ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ 75 సీట్ల భర్తీకి ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ స్పెషల్‌ ‘స్ట్రే వెకెన్సీ’ విధానంలో కౌన్సెలింగ్‌ చేపట్టి, సీట్లను కేటాయించింది.

ఈ ప్రక్రియను సవాల్‌ చేస్తూ నలుగురు విద్యార్ధులు సోమవారం హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వై. ఠాగూర్‌యాదవ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్టీఆర్‌ వర్సిటీ నిర్వహించిన రెగ్యులర్‌ కౌన్సెలింగ్‌లో ఇద్దరు పిటిషనర్లు బీడీఎస్‌, యాజమాన్య కోటా కింద మరో ఇద్దరు ఎంబీబీఎస్‌ సీట్లు పొందారన్నారు. పెరిగిన 75 సీట్లకు పిటిషనర్లను అనుమతించకుండా స్ట్రే వెకెన్సీ విధానంలో భర్తీ చేయడం వల్ల తక్కువ మార్కులు వచ్చినవారికి కాంపిటెంట్‌ కోటా కింద ఎంబీబీఎస్‌ సీట్లు దక్కుతున్నాయని వివరించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యునివర్సిటీ తరఫున న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపిస్తూ.. పెరిగిన సీట్లను ‘స్ట్రే వెకెన్సీ’ విధానంలో భర్తీ చేయాలని ఎన్‌ఎంసీనే ఆదేశించిందన్నారు.

విమానంలో పాములు

బ్యాంకాక్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికుల వ‌ద్ద విష‌పూరిత‌మైన పాములు బ‌య‌ట‌ప‌డ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల‌ తనిఖీల్లో ఇలా పాములు లభ్యమయ్యాయి.

త‌నిఖీల్లో పాములను కస్టమ్స్‌ అధికారులు గుర్తించిన‌ విషయం తెలిసి బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆందోళ‌న‌కు గురయ్యారు. 

అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్‌ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువ‌చ్చార‌నే విష‌య‌మై అధికారులు ఆరా తీస్తున్నారు.

పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ప్ర‌యాణికుల వ‌ద్ద దొరికిన ఆ పాముల‌ను అనకొండలుగా అధికారులు గుర్తించారు.

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

గౌతమ్‌ అదానీపై అవినీతి ఆరోపణలపై వెల్లువెత్తుతున్న సమయంలో తాము చేసుకున్న ఒప్పందాలు, విరాళంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన గౌతమ్‌ అదానీ కంపెనీ వ్యవహారంతో రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు ఇచ్చిన రూ.వంద కోట్ల విరాళాన్ని తిరస్కరించారు.

ఆ డబ్బులను తీసుకోవడం లేదని చెబుతూ లేఖ రాసినట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అనవసర వివాదం జోలికి వెళ్లకూడదనే నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు.

న్యూఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై సోమవారం చర్చించిన అనంతరం రేవంత్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ అదానీ వ్యవహారంపై కీలక ప్రకటన చేశారు. 'గౌతమ్‌ అదానీ అంశంపై ఇప్పటికే చెప్పాను.

అయినా ఆరోపణలు చేస్తున్నారు అని రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. యంగ్ ఇండియా పథకంలో రూ.100 కోట్లు నాకు చేరాయని చెబుతున్నారు. వివాదాల నేపథ్యంలో రూ.100 కోట్లను స్కిల్‌ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దని వారికి లేఖ రాశాం అని వివరించారు.

పార్టీ మారే యోచనలో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణలో మళ్లీ పార్టీ ఫిరాయింపులు మొదలయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై హై కోర్టులో అప్పీల్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ కు టైమ్ బాండ్ లేదని తేల్చి చెప్పింది. రీజనబుల్ టైమ్ లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరగా ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వీరు త్వరలో హస్తం గూటికి చేరుతారని పేర్కొన్నారు. ముగ్గురు గులాబీ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు అని ప్రచారం సాగుతోంది. పార్టీ బలహీన పడితే కష్టమని భావిస్తున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చర్చలు జరుపుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వీరిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చేరికల స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది.

అంతే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెంచంకునేందుకు గ్రేటర్ కు చెందిన గులాబీ ఎమ్మెల్యేలకు గాలం విసురుతుంది. బీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి గ్రేటర్ బలం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం పెంచుకుంది. ఇదే తరహాలో కూడా హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

పార్టీ మారే ఎమ్మెల్యేల్లో ఒకరు గొర్రెల పథకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఎమ్మెల్యేలకు విద్యాసంస్థలు ఉన్నాయి. వీరిద్దరు పార్టీ మారితేనే సమస్యలు రావని భావిస్తున్నారు.

బాలినేని సంచలన కామెంట్స్

సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వైసీపీ నేత చెవి రెడ్డి భాస్కర్ రెడ్డికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ స్థాయి ఏందీ అని ప్రశ్నించారు. అధికారంలో ఉండగా ఒంగోలు జిల్లాల్లో ఆర్టీసీ సైట్లను తీసుకున్నవా లేదా అని నిలదీశారు. ఇవాళ(సోమవారం) ఏబీఎన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా పని చేస్తూ కందుకూరు, సంత నూతల పాడు నియోజకవర్గాల్లో చెవిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు బయటకు తీయమంటావా అని ప్రశ్నించారు. చెవిరెడ్డిది చిత్తూరు జిల్లా అయ్యి ఉండి కూడా ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అండతో చేసిన బాగోతాలు ప్రజలకు తెలుసునని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదని.. విజయమ్మ , షర్మిల కూడా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు.

వాళ్ల కుటుంబానికి తాను ఎప్పుడు విధేయుడినేనని చెప్పారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతల్లో ఏ ఒక్కరికి లేదని అన్నారు. సెకీ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

వైసీపీలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్‌లో నిర్ణయం కోసం అర్ధరాత్రి ఫైల్ పంపి సైన్ చేయమన్నారని చెప్పారు. కేవలం మంత్రి వర్గం చర్చ కోసం అనుకోని సైన్ చేశానని చెప్పారు. ఎవరు ఎవరి మెప్పు కోసం పని చేస్తారో అందరికీ తెలుసునని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

అదానీ విషయంలో రేవంత్‌‌కు హరీష్ ప్రశ్న

అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాలు వద్దని చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే.. మరి అదానీ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల సంగతేంటని బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అదానీ విరాళం తిరస్కరించారు సరే కానీ.. మరి ఆ సంస్థలతో కుదిరిన ఒప్పందాలను ఏం చేస్తారని అడుగుతున్నారు. అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ నేతలు తమదైన స్టైల్‌లో సీఎంకు, ప్రభుత్వానికి ప్రశ్నలు విసురుతున్నారు. యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లను వద్దని చెప్పిన విషయాన్ని పక్కనపెడితే.. మరి తెలంగాణ ప్రభుత్వంతో, అదానీ గ్రూప్ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటని నిలదీస్తున్నారు. గతంలో దావోస్‌లో అదానీ గ్రూప్‌తో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

అదానీ గ్రూప్ ఇచ్చిన విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. స్కిల్‌ యూనివర్సిటీకి ఇచ్చిన రూ.100 కోట్లు నిధులు వెనక్కి తీసుకున్నారు సరే.. అదానీ అవినీతిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న వేళ.. దావోస్‌లో అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని హరీష్ రావు ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణలోని డిస్కంలను అదానీ గ్రూప్‌కు అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న కుట్రల మాటేమిటి అని మండిపడ్డారు.

20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో అదానీ గ్రూప్ వస్తే.. తాము మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించినట్లు హరీష్ రావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు నాలుకల విధానాన్ని పాటిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే.. గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్న అదానీతో.. రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం అదానీతో అవినీతి బయటికి రాగానే మాట మార్చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌తో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని హరీష్ రావు డిమాండ్ చేశారు.

కొన్ని రోజుల క్రితం.. అదానీ గ్రూపు.. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు రావడం, అమెరికాలో కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న వేళ.. దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటముల మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బీజేపీకి, అదానీకి మధ్య సంబంధాన్ని చెబుతూ తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్న వేళ.. అదానీ గ్రూప్‌ ప్రకటించిన విరాళాన్ని తెలంగాణ సర్కార్ విరమించుకుంది.

ప్రమాదంలో హైదరాబాద్ వాసులు

దేశ రాజధాని ఢిల్లీ గాలి కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అక్కడి ప్రజలు కాలుష్యంతో వ్యాధుల బారిన పడుతున్నారు. అయినప్పటికీ అక్కడ గాలి కాలుష్యం తగ్గడం లేదు. అయితే ఎయిర్ పొల్యూషన్ ఒక్క ఢిల్లీలోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. కోల్ కత్తా, ముంబై, బెంగళురు, చెన్నై, హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఒక్కసారిగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోయింది.

భారీగా గాలి కాలుష్యం పెరిగింది. కూకట్ పల్లి, మూసాపేట్, బాలానగర్ నాంపల్లి, మెహదీపట్నం లో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం ఉందని అధికారులు గుర్తించారు. సోమవారం పలు ప్రాంతాల్లో ఎయిర్ కాల్విటీ ఇండెక్స్ 300 క్రాస్ అయింది. నవంబర్ 24న గూగుల్ AQI డేటా ప్రకారం బంజారాహిల్స్ 'పేలవమైన' ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 133, టెక్ హబ్ మాదాపూర్ 128, విట్టల్ రావునగర్ 157, జూ పార్క్ వద్ద 129గా నమోదయ్యాయి. ఢిల్లీకి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతుండడంతో ఆందోళన మొదలైంది.

పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాల్సిన పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కూడా హైదరాబాద్ లో గాలి కాలుష్యం పెరిగింది. అప్పుడు భారీ ఎత్తున బాణసంచ పేల్చడంతో గాలి కాలుష్యం పెరిగింది. తాజాగా మరోసారి గాలి కాలుష్యం పెరగడానికి కారణం పరిశ్రమ నుంచి వచ్చే పొగ, వాహనాల వాడకం అని చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 కంటే తక్కువగా ఉంటే మంచిది. 50 కంటే తక్కువ ఉంటే ఇంకా మంచిది. 100 కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదకరం.

అధిక స్థాయి వాయు కాలుష్యంతో దగ్గు, శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నార. గాలి కాలుష్యం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు కారణమవుతాయని చెబుతున్నారు. ఎయిర్ పొల్యూషన్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది హెచ్చరిస్తున్నారు.

వాయు కాలుష్యం పిల్లలలో ఊపిరితిత్తుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యుక్తవయస్సు వరకు కొనసాగే దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

అయితే ప్రభుత్వం ఇప్పటికే గాలి కాలుష్యం నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. అంతే కాదు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి రోడ్ ట్యాక్స్ ఎత్తివేశారు.

సీఎం పోస్టుపై ఫార్ములా అజిత్ పవార్ ఏమన్నారంటే

సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్‌సత్ తెలిపారు.

మహాయుతి కూటమి 236 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం సీటుకు సంబంధించి ఏదైనా ఫార్ములాపై చర్చ జరుగుతోందా అనే విషయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సోమవారంనాడు స్పందించారు. అలాంటి ఫార్ములా ఏదీ చర్చకు రాలేదని ఆయన చెప్పారు. మహాయుతి ప్రభుత్వానికి పట్టం కడుతూ ప్రజలు చాలా గట్టి తీర్పునిచ్చారని, అసెంబ్లీ విపక్ష నేత పదవికి అవసరమైన సంఖ్యాబలం కూడా మహా వికాస్ అఘాడికి రాలేదని చెప్పారు.

ఏ ఫార్ములాపై చర్చ జరగడం లేదు. మేము ముగ్గురూ (కూటమి) కలిసి సీఎం పదవిపై చర్చిస్తాం. అసెంబ్లీలో ఎన్‌సీపీ నేతగా నన్ను ఎన్నుకున్నారు. శివసేన తరఫున ఏక్‌నాథ్ షిండే ఎన్నికయ్యారు. బీజేపీ కూడా ఇదే చేసింది. మేము కలిసి చర్చించుకుని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని అజిత్ పవార్ తెలిపారు.

సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్‌సత్ తెలిపారు. సీఎం ఎవరనేది అంతిమంగా ఢిల్లీలో నిర్ణయిస్తారని, చర్చలు జరుగుతున్నందున ఫలితం ఏమిటనేది వేచిచూడాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నందున దానిని కూడా సీఎం ఎంపిక విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంగళవారానికి ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

సీఎం పీఠంపై తలెత్తిన ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఢిల్లీలో సోమవారం మహాయుతి అగ్రనేతలతో సమావేశం ఏర్పాటైంది. హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం హాజరవుతున్నారు. సమావేశానంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ

తెలంగాణ‌లోని ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దాడుల్లో అవ‌నీతికి పాల్ప‌డే అధికారులు చిక్కుతున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణం ఎస్ఆర్‌సీ నీటి పారుద‌ల శాఖ అసిస్టెంట్ ఇంజ‌నీర్ న‌ర్సింగ‌రావును ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్య‌క్తి నుంచి లంచం డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

రూ.20,000 తీసుకుంటుండ‌గ

కాంట్రాక్ట‌ర్‌కు ఓ బిల్లు విష‌యంలో ఏఈ న‌ర్సింగ‌రావుకు లంచం డిమాండ్ చేశారు.

దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్ట‌ర్ రూ.20,000లు అంద‌జేశారు. అక్క‌డే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో సిబ్బంది దాడి చేసి ప‌ట్టుకున్నారు.

అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయ‌న్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాల‌యంలో రికార్డుల‌ను ప‌రిశీలిస్తున్నారు.

పవన్ కు ఢిల్లీ పిలుపు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరు కానున్నారు.

ఉప ముఖ్యమంత్రి..జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారింది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ ముఖ్యుల సూచన మేరకు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ చర్చలు రాజకీయంగా కీలకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేసారు. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్ పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బిజెపి కూటమి గెలుపొందింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.

ఇప్పుడు బీజేపీ జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో, పవన్ సేవలను దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా దక్షిణాదిన పవన్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించటం ద్వారా పవన్ గురించి పలు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చ కొనసాగింది. తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ అన్నామలై బీజేపీ కోసం శ్రమించినా..తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. దీంతో, పవన్ కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ రేపు (మంగళవారం) ముంబాయి చేరుకోనున్నారు. మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించి న బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. ఎన్డీఏ భాగస్వామి గా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. మహారాష్ట్ర లో కొత్త సీఎం ఖరారు పైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీలో మకాం వేసారు. ఈ సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎం గా ఫడ్నవీస్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, త్వరలో ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.