పవన్ కు ఢిల్లీ పిలుపు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఈ ఫలితాల తరువాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ హస్తిన బాట పట్టారు. పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరు కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి..జనసేనాని పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారింది. బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వేళ బీజేపీ ముఖ్యుల సూచన మేరకు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ చర్చలు రాజకీయంగా కీలకంగా కనిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా పవన్ ప్రచారం చేసారు. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్ పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బిజెపి కూటమి గెలుపొందింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.
ఇప్పుడు బీజేపీ జమిలి ఎన్నికల దిశగా కసరత్తు చేస్తోంది. దీంతో, పవన్ సేవలను దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఢిల్లీ, బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా దక్షిణాదిన పవన్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించటం ద్వారా పవన్ గురించి పలు రాష్ట్రాల్లో ఆసక్తి కర చర్చ కొనసాగింది. తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ అన్నామలై బీజేపీ కోసం శ్రమించినా..తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితం దక్కలేదు. దీంతో, పవన్ కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది.
పవన్ కల్యాణ్ రేపు (మంగళవారం) ముంబాయి చేరుకోనున్నారు. మహారాష్ట్రలో అనూహ్య విజయం సాధించి న బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం రేపు కొలువు తీరనుంది. ఎన్డీఏ భాగస్వామి గా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. మహారాష్ట్ర లో కొత్త సీఎం ఖరారు పైన ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీలో మకాం వేసారు. ఈ సాయంత్రానికి మహారాష్ట్ర నూతన సీఎం గా ఫడ్నవీస్ పేరు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, త్వరలో ఎన్డీఏలో పవన్ కు కీలక బాధ్యతలు ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
Nov 25 2024, 19:07