మహిళ ఫిర్యాదుపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పందన

వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తూ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన నుంచి రూ.90లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

ఈ నేపథ్యంలో మహిళ ఫిర్యాదుపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. తనపై కోపం ఉంటే చంపేయండి కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని కోరారు. రాజకీయాల్లో ఎదుగుతున్న దళితుడిని టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, ఈ విషయంలో తప్పు ఉందని నిరూపిస్తే, ఉరి శిక్షకు సైతం సిద్ధమని మేరుగు స్పష్టం చేశారు. 

 

మంత్రిగా ఉన్న సమయంలో తనను అనేక మంది కలిసి ఉంటారని, కానీ ఎవరితోనూ వ్యక్తిగతంగా పరిచయం లేదని తెలిపారు. తనపై లైంగిక కేసు పెట్టిన విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఏ ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలను ఉమ్మడి కడపజిల్లా కేంద్రంగా మారింది.

ఉమ్మడి కడపజిల్లాలో విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు కలసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నందలూరు టంగుటూరు ఇసుక క్వారీల నుంచి లారీలు, టిప్పర్‌లతో అక్రమంగా ఇసుక మాఫియా తరలిస్తుంది. ఒక్కరోజే ఒంటిమిట్టలో ఐదు టిప్పర్లు నందలూరులో నాలుగు టిప్పర్లు రెండులారీలను రెండు జేసీబీలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లారీలు, టిప్పర్లతో తమిళనాడు కర్నాటక రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిస్తూ.. నిత్యం లక్షలాది ఇసుక మాఫియా దండుకుంటుంది. బెంగళూరు నుంచి తమిళనాడుకు ప్రతిరోజు 50 లారీలకు పైన ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను కొన్నేళ్లుగా తవ్వేసి.. తరలించి.. కోట్లు గడించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది కూటమి నాయకుల అండతో వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు ఆపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికారపార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం, మరో వైపున రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అక్రమ ఇసుక దందా ఎలా కొనసాగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఇసుక డంపుల నుంచి దూర ప్రాంతాలకు రాత్రి వేళ లారీల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తుండటంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను, ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు కొందరు అక్రమార్కులతో చేతులు కలపడంతో ఇసుకమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఉమ్మడి కడపజిల్లాలో ఉన్న నదులు, చెరువుల్లో సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వేసి.. ఇసుక తీసేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలూ అడుగంటిపోతున్నాయి. దీనిపై గతంలో, ప్రస్తుతం ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వీటిని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో తవ్వకాలను అడ్డుకుంటున్నామని గ్రామస్తులు చెప్పారు కలెక్టర్‌ సకాలంలో స్పందించి ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

నాటి జగన్‌ పాలనలో అక్రమాలకు పూర్తిస్థాయిలో తెరదీసిన అధికార యంత్రాంగం అదే ధోరణి అవలంభించడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ ఇసుక అమ్మకాల వెనుక ఎవరి హస్తం ఉందనేది క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇసుక అక్రమ అమ్మకాలపై దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇసుక అక్రమ అమ్మకాలు ఇలాగే కొనసాగితే నూతన ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతుందని కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, సంబంధిత మంత్రి ఇసుక అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల పాలసీలు తీసుకువస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా నీరుగారుతోంది. సామాన్యులు ఎక్కడైనా చిన్న చిన్న అవసరాల కోసం ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి, ఇబ్బందులు పెట్టే అధికారులు తమ కనుసన్నల్లో ఇసుకను తరలిస్తూ మామూళ్లు ముట్టజెప్పే వారికి మాత్రం సలాం కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరైనా ప్రశ్నించినా, మీడియాపై దాడులకు తెగబడుతున్నారంటే ఇసుక మాఫియా ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల ఈ ఇసుక మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇసుక అక్రమ దందాకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఎత్తయినా ఉంది. లేకపోతే మాఫియా ఆగడాలు పెరిగి, సామాన్యులపైనా దాడులు చేసే పరిస్థితి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది

ఏపీలో మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 4న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంటుంది. 28వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌.. డిసెంబర్ 1న కౌంటింగ్ ఉంది.ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటుతో ఖాళీగా. 2027 డిసెంబర్‌ 1 వరకు పదవీకాలం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది.. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్‌ జరుగుతుంది.. డిసెంబర్‌ 1న ఓట్లు లెక్కిస్తారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల ఇందుకూరు రఘురాజుపై అనర్హత వేటుతో విజయగనరం జిల్లా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది.

గతంలో ఈ స్థానంలో వైఎస్సార్‌‌సీపీ తరఫున గెలిచిన ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌ 3 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.. తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల షెడ్యూల్, కోడ్ అమల్లోకి రావడంతో చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన వాయిదా పడింది. విజయనగరం జిల్లా కాకుండా అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాత్రి బస చేసి.. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి జిల్లాకు వెళ్లారు.

ముఖ్యమంత్రి ఉదయం 11.15 గంటలకు హెలికాప్టర్‌లో చింతలగోరువానిపాలెంలోని లారస్ సంస్థ దగ్గరకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.. మధ్యాహ్నం 12.20 గంటలకు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలేనికి వెళ్లి రహదారి గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.

మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్‌లో రుషికొండ వెళ్లి ఏపీ టూరిజం రిసార్ట్స్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు వెళతారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని నివాసానికి వెళతారు.

తెలంగాణలో ఒంటిపూట బడులు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల గణన అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ప్రక్రియ కోసం టీచర్ల సేవలను వినియోగించుకోనుంది. దీంతో, రాష్ట్రంలోని బడులను ఒంటి పూట నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు జరగనున్నాయి. బడులు నిర్వహించే సమయాలను అధికారులు ఖరారు చేసారు.

తెలంగాణలో పేరెంట్స్ కు బిగ్ అలర్ట్. వేసవి కాలం రాకముందే ఒంటి పూట బడులు అమలు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన మొదలు కానుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను ప్రభుత్వం నియమించింది. అలాగే మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగం చేసింది. దీంతో సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో, ఇక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీచర్లు స్కూళ్లలో పనిచేయాలి. అనంతరం కులగణన కోసం ఇంటింటికీ వెళ్లాలి. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను సర్కారు నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటాను అధికారులు సేకరించనున్నారు. దీని కోసం వారికి ప్రత్యేకంగా కిట్లను కూడా అందజేశారు. ఈ నెల 13వ తేదీ వరకు కులగణన మీద ప్రజాసేకరణ ఉంటుందని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ వెల్లడించారు. దీంతో, అప్పటి వరకు పాఠశాలలు ఒంటి పూటే నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ సర్వే పూర్తయ్యే వరకు అని తాజా సర్క్యులర్ లో స్పష్టం చేసారు. సర్వే మరింత సమయం తీసుకుంటే పొడిగించే అవకాశం ఉంది.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కుల గణన కోసం ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా అధికారులు, సిబ్బంది డేటా సేకరించనున్నారు. ఇందు కోసం సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదని... సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామని వెల్లడించారు. ఈనెల 30లోగా సర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం డెడ్‌ లైన్ విధించింది. ఈ సర్వేకు అనుగుణంగా పాఠశాలల నిర్వహణ పైన నిర్ణయం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఇదేం సర్వే.. ఇదేం పద్ధతి

రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన సమగ్ర కులగణన సర్వే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన సమగ్ర కులగణన సర్వే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. చివరకు పలువురు బీసీ మంత్రు లు, స్వపక్షంలోని ఎమ్మెల్యేలు కూడా అసహనంతో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. సర్వే కోసం రూపొందించిన ప్రశ్నావళిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోలను ముద్రించడాన్ని తప్పుబడుతున్నారు. సర్వే అనేది సంక్షేమ కార్యక్రమం కాదని, ఫొటోలు ముద్రించుకోవడం తగదని హితువు చెప్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా సేకరించే సమాచారానికి గోప్యత ఉంటుందనే భరోసాను కల్పించకుండా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

ఇప్పటికే బీహార్‌, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు సమగ్ర కులగణన సర్వేలను నిర్వహించాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలకు సంబంధించిన ప్రశ్నావళి, ట్రైనింగ్‌ బ్రోచర్లపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను ముద్రించలేదని సామాజికవేత్తలు చెప్తున్నారు. ఆయా రాష్ర్టాలు డాటా సేకరణ పత్రాలపై కేవలం రాష్ట్ర చిహ్నాన్ని మాత్రమే ముద్రించాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో మాత్రం సర్వే ప్రశ్నావళిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోలను ముద్రించడాన్ని తప్పుబడుతున్నారు. ఇది డాటా సేకరణను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాళ్లు ఉంటారని, ఫొటోలతో ప్రభావితమవుతారని చెప్తున్నారు. కచ్చితమైన వివరాలను ఇచ్చేందుకు అయిష్టత చూపేవారు కూడా ఉంటారని, దీంతో అసమగ్రంగానే వివరాలు అందుబాటులోకి వచ్చి సర్వే లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇది ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారు వివరాల నమోదుకు ముందుకు రాకపోవచ్చని వివరిస్తున్నారు.

సర్వే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. సేకరించే సమాచారానికి గోప్యత ఉంటుందన్న భరోసా లేకుండా పోతున్నదనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్వే ఎందుకు, ఏ లక్ష్యం కోసం చేస్తున్నారు? ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? అనే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సమగ్ర సర్వే నిర్వహణకు ప్రామాణిక పద్ధతులు, నిబంధనలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ చట్టం-1952 ప్రకారం.. స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌తోపాటు గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్‌ డిపార్ట్‌మెంట్‌గా ఏర్పాటుచేయాలని, నోడల్‌ ఏజెన్సీకి నోడల్‌ అధికారిని, కమిషన్‌కు కార్యదర్శిని నియమించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.

కులగణన సర్వే తీరుపై స్వపక్షంలోని కొందరు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామం టూ సీఎం, డిప్యూటీ సీఎంలే క్రెడిట్‌ కొట్టేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసహ నం వ్యక్తంచేస్తున్నారని సమాచారం. సర్వే సమీక్షలు, సమావేశాలపై సమాచారం ఇవ్వడం లేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏకంగా ప్రశ్నావళి పత్రాలపై కూడా ఆ ఇద్దరి ఫొ టోలను ముద్రించడంపై లోలోన రగిలిపోతున్నారని కాంగ్రెస్‌ నేతలే చర్చించుకుంటున్నారు.

హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సులు

కురుమూర్తి జాత‌ర‌కు వెళ్లే భ‌క్తుల‌కు తెలంగాణ ఆర్‌టీసీ ఓ శుభ‌వార్త‌ను అందించింది. కురుమూర్తి జాత‌ర‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డ‌పనున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ బ్ర‌హ్మోత్స‌వాల ఈనెల (నవంబ‌ర్‌) 18 వరకు ఎంతో వైభ‌వంగా జరగనున్నాయి. ఈ జాత‌రకు సుమారు 10 లక్షల మంది భ‌క్తులు పాల్గొన‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్‌న్యూస్‌ను మోసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. పాలమూరు జిల్లాలోని వెల‌సిన కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోనేందుకు త‌ర‌లి రానున్నారు.

జాత‌రలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం న‌వంబ‌ర్ 8వ తేదిన ఉంటుంది. ఈ నెల 7వ తేది నుంచి 9వ తేది వ‌ర‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవకాశం ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

ఈక్ర‌మంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి ఏర్పాటు చేయ‌నున‌ట్లు అధికారులు తెలిపారు. ఎమ్‌జిబిఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు బస్సులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ అవ‌కాశం కూడా ఉంది.

కురుమూర్తి స్వామివారి జాతరకు సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్న‌ట్లు ఇక్క‌డివారు చెబుతున్నారు. అందుకే ఇక్క‌డ ప్ర‌తి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్ర‌గాఢ న‌మ్మ‌కం. దాదాపు 500 మంది పోలీసులతో జాతర ప్రాగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

నగరంలో మరో స్కైవాక్

హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ స్కైవ్ నిర్మించనున్నారు. ఆ ప్రాంతంలో మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో స్కైవాక్ నిర్మించనున్నారు. కాగా, ఇప్పటికే నగరంలో ఉప్పల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో స్కైవాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌళిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్త అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో భారీగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించింది. గత ప్రభుత్వ అభివృద్ధిని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది.

అందులో భాగంగా నగరవాసులకు మరో శుభవార్త చెప్పింది. నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రోరైలు స్టేషన్ వద్ద కొత్తగా ఈ స్కైవాక్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెట్రో జంక్షన్‌గా ఈ స్టేషన్ నుంచి నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్లైఓవర్ కారణంగా ప్రస్తుతం స్టేషన్ నుంచి కిందికి వచ్చి రద్దీగా ఉండే రోడ్డు దాటాల్సివస్తోంది. అక్కడ అత్యంత రద్దీ ప్రాంతం కావడం.. రెండోవైపు ఎల్అండ్ టీ మెట్రోకు కేటాయించిన భూములు ఉండటంతో కనెక్టివిటీ కోసం స్కైవాక్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు.

నగరంలో బ్రిడ్జిలు ఉన్నచోట మెట్రో స్టేషన్లను రోడ్డుకు ఒక వైపు నిర్మించారు. ప్యారడైజ్ మెట్రో స్టేషన్‌ను ఇలాగే సికింద్రాబాద్ పీజీ కాలేజీ వైపు నిర్మించారు. రోడ్డు దాటి రెండొవైపు రావాలంటే ప్రయాణికులకు చాలా కష్టంగా ఉండేది. ప్రయాణికుల ఇబ్బంది తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఇక్కడ స్కైవాక్ నిర్మించారు. ఇదే మాదిరి పరేడ్ గ్రౌండ్ స్టేషన్ వద్ద కూడా కొత్తగా మరో స్కైవాక్ నిర్మించబోతున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ఈజీగా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది.

నగరంలో తొలి డ‌బుల్ డెక్కర్ కారిడార్‌ఇక హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజ‌లు, వాహ‌న‌దారుల ట్రాఫిక్ క‌ష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో తొలి డబులు డెక్కర్ కారిడారి నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై మెట్రో మార్గం సైతం నిర్మించ‌నున్నారు. ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్‌ రోడ్డు వరకు 5.320 కి.మీ మేర ఈ కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.650 కి.మీ. కాగా.. అండ‌ర్‌ గ్రౌండ్‌ ట‌న్నెల్ 0.600 కి.మీ ఉంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం

కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, మలక్‌పేట్‌, చార్మినార్‌, ఓయూ, మణిక్‌కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాహనదారులు..

ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, హైటెక్‌ సిటీ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, బోయిన్‌పల్లి, బేగంపేటలో వర్షం దంచికొడుతోంది.ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, మలక్‌పేట్‌, చార్మినార్‌, ఓయూ, మణిక్‌కొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది.

భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు రోడ్లపై నిలిచిపోయింది. బంజారాహిల్స్, పంజాగుట్టలో వాన దంచికొట్టడంతో నీరు రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా మూడు గంటల తర్వాత వాతావరణంలో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం గంట పాటు ఎకధాటిగా కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది.

వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్

కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్’ (Brat) ఎంపికైంది. యూకేకి చెందిన ప్రముఖ గాయని, పాటల రచయిత చార్లీ ఎక్స్‌సీఎక్స్ ఈ పదాన్ని నిర్వచించారు.

బ్రాట్’ అనే పదం సింగర్ చార్లీ విడుదల చేసిన ఆరవ ఆల్బమ్ పేరు అని, విశ్వాసం, స్వతంత్రత, సుఖాలు కోరుకునే వైఖరి... అనే అర్థాలను ఇస్తుందని కాలిన్స్ డిక్షనరీ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్న కమలా హారిస్ మద్దతుదారులు ఈ పదాన్ని స్వీకరించి వినియోగిస్తున్నారని, దీంతో ‘బ్రాట్’ పదాన్ని కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైందని శుక్రవారం పేర్కొంది.

2024లో ఎక్కువగా మాట్లాతున్న పదాలలో ఒకటిగా బ్రాట్ పదం మారిందని కాలిన్స్ డిక్షనరీ తెలిపింది. విజయవంతమైన ఆల్బమ్ కంటే 'బ్రాట్' అనేది ఒక సాంస్కృతిక దృగ్విషయంగా మారిందని, ఈ పదం ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని తెలిపింది.

కాగా యూకేకి చెందిన 32 ఏళ్ల పాప్ స్టార్ చార్లీ ఎక్స్‌సీఎక్స్ అసలు పేరు షార్లెట్ ఎమ్మా ఐచిసన్. ఒక సాధారణ ఆకతాయి అమ్మాయి (Brat Girl) కొంచెం తలతిక్కగా, పార్టీలను ఇష్టపడే వ్యక్తి అని ఆమె 'బ్రాట్' అనే పదం గురించి వివరించారు. తమని తాము తెలివి తక్కువ వాళ్లమని భావించే వ్యక్తులు అని కూడా భావించవచ్చని, అయితే ఆ తర్వాత వారి వైఖరి మారవచ్చని, అది కూడా పార్టీల ద్వారానే అని ఆమె వివరించారు.

ఈ ఏడాది జులైలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను ‘బ్రాట్’ అని పేర్కొంటూ షార్లెట్ ఎమ్మా ట్వీట్ చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో కమలాను ప్రమోట్ చేయడంలో భాగంగా తన ఆల్బమ్‌లోని ‘365’ పాటను ఉపయోగించి ‘కమల ఈజ్ బ్రాట్’ పేరిట ఒక టిక్ టాక్ వీడియో రిలీజ్ చేసింది. షార్లెట్ ఎమ్మా విడుదల చేసిన ‘బ్రాట్’ ఆల్బమ్ యూకేలో మొదటి స్థానంలో, అమెరికాలో మూడవ స్థానంలో నిలిచింది.

ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడని బీజేపీ శాసనసభా పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని గుర్తు చేశారు. అక్కడ దూరం నుంచి చూసి వచ్చాడు తప్పా కలువలేదన్నారు.

మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదని, జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయమన్నారు. తాను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.