తెలంగాణా ప్రజలకు అదిరిపోయే శుభవార్త!
తెలంగాణా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 2వ తేదీన తేదీ నుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులను ఇచ్చేందుకు రెడీ అయ్యింది . ఇక ఇదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించిన్నట్లు మంత్రి తెలిపారు.
ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు
వరంగల్ పట్టణంలోని ఎల్బీ నగర్ క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొని 454 మంది లబ్ధిదారులకు రూ. 3,97,96,308 రూపాయల సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీనుండి డిజిటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డులను ప్రతి కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
హైదరాబాద్ కు ధీటుగా వరంగల్
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 104, 108 వాహనాల ద్వారా లక్షల మంది ప్రాణాలను రక్షించడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ పై ప్రత్యేక దృష్టి సారించి హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.త్వరలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని మంత్రి అన్నారు.
వరంగల్ మాస్టర్ ప్లాన్ పై స్పెషల్ ఫోకస్
వరంగల్ నగరం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నామని, వరంగల్ లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2050 వరకు జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నామన్నారు.
ఈ అంశాలతో వరంగల్ మాస్టర్ ప్లాన్
ఫార్మా సిటి, ఐటి సర్వీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేడియం, ఎయిర్ పోర్టు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎకో టూరిజం, లాజిస్టిక్స్ పార్కు, టూరిజం వంటి అంశాలు ప్రధానంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తున్నామని అన్నారు. కోటి మంది మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి
అందులో భాగంగా వరంగల్ నగరంలో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఇది ప్రజా ప్రజా ప్రభుత్వమని, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Sep 24 2024, 14:38