శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. సద్గురు జగ్గీ వాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, జంతు కొవ్వులను వాడారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు రావడం సంచలనంగా మారింది. భక్తులను ఇది ఆవేదనకు గురిచేస్తోంది. ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాల ఉన్నాయనే ఆరోపణలు యావత్తు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ కోట్లాది మంది భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. తాజాగా, ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్రంగా స్పందించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం అనేది అసహ్యకరమైనదని సద్గురు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు
భక్తులకు తినే ఆలయ ప్రసాదంలో జంతు మాంసం అనేది అసహ్యకరమైంది. అందుకే దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులతో నడపాలి.. భక్తి లేనిచోట పవిత్రత ఉండదు.. హిందూ దేవాలయాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా భక్తులైన హిందువులతో నిర్వహించాల్సిన సమయం వచ్చింది’ అని సద్గురు పేర్కొన్నారు. మరోవైపు, లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివేదిక ఆదారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు, తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సనాతనధర్మంపై జరిగిన చాలా ప్రమాదకమైన కుట్ర అని ఆయన అభివర్ణించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకీ కల్తీ నెయ్యిని వినియోగించారని, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని సీఎం చంద్రబాబునాయడు గతవారం చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అయితే, వీటిని టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు తోసిపుచ్చారు. లడ్డూ ప్రసాదానికి కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి, సేంద్రీయ ఉత్పత్తులనే వాడామని ఆయన చెప్పారు.
కాగా, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి.. శ్రీవారి క్షేత్రాన్ని అపవిత్రం చేశారని, దీనిపై మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ యువజన విభాగం ఆదివారం ఆయన నివాసాన్ని ముట్టించింది. అటు,శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు. వాస్తవానికి శ్రీవారికి ఏటా జరిగే పవిత్రోత్సవాలతోనే ఇలాంటి అపచారాలకు పరిహారం లభిస్తుందని, కానీ భక్తుల్లో నమ్మకం కలిగించడానికే శాంతిహోమం చేపట్టామని ఆయన చెప్పారు.
Sep 23 2024, 19:19