నేడు సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం
2013లో ఆప్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి అధిష్టించనున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేశారు.
మరికొన్ని గంటల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు సైతం ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాజ్ నివాస్‌లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఈ ఆరుగురి చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అతిషితోపాటు ఆమె కేబినెట్‌లో గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరబ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్‌లతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదా సీదాగా జరగనుందని సమాచారం.
అయితే మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వీరికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. కేజ్రీవాల్ కేబినెట్‌లోని దాదాపు 14 కీలక శాఖలు అతిషినే పర్యవేక్షించే వారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా శాఖలను ఆమె వద్దే ఉంచుకుంటారా? లేకుంటే.. వాటిని వీరికి కేటాయిస్తారా? అని చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.
2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అతిషి ఈ రోజు అధిష్టించనున్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి మనీశ్ సిసోడియాకు ఆమె సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల్లోని మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు అతిషి తీవ్రంగా కృషి చేసిన విషయం విధితమే.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహాడ్ జైలు నుంచి విడుదలైన ఆయన... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే శాసన సభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అతిషిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఆ నిర్ణయానికి ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
అనంతరం సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనాకు అందజేశారు. అలాగే శాసనసభ పక్షం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఎల్జీకి కేజ్రీవాల్ వివరించారు. దీంతో ఢిల్లీ సీఎంగా ఈ రోజు అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్న అతి పిన్న వయస్కురాలు అతిషినే కావడం గమనార్హం.
Sep 21 2024, 13:02