జమ్మూ & కాశ్మీర్లో తొలి విడత ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక సందేశం..

జమ్ముకశ్మీర్‌లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కశ్మీర్‌లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎల్‌వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్ల దగ్గర అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతంలోని పౌరులు “పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ”ను జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి.. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.

హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి.. 21 గ్రామాల మీదుగా, భూముల ధరలకు రెక్కలు

హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి ఫోర్త్ సిటీ (ఫ్యూచర్‌ సిటీ) కీలకంగా మారుతుందని రేవంత్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. నగర విస్తరణ కూడా ఎక్కువగా అటువైపే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు మెుదలుపెట్టింది. 21 గ్రామాల మీదుగా 40 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా ఆ రహదారిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగర అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా.. ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించతలపెట్టారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతాల్లో ఈ ఫోర్త్‌సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక ఈ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్‌ అవసరాలను అనుసరించి కొత్తగా రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కి.మీ పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్‌-13 రావిర్యాల నుంచి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వరకు మెుత్తం 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) వరకు ఈ రహదారిని అనుసంధానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల గుండా ఈ రహదారిని నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి హెచ్‌ఎండీఏ (HMDA) ఇప్పటికే రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను కూడా రూపొందించింది. రేవంత్ సర్కార్ ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది.

ఇబ్రహీంపట్నం మండలంలోని నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కొంగరకలాన్, కప్పపహాడ్, ఫిరోజ్‌గూడ, మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్, కందుకూరు మండలంలోని రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల గుండా నిర్మించనున్నారు.

కాగా, గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావటంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ధర పలుకుతుండగా.. మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఏకంగా రూ.130 కోట్ల విరాళం..

ప్రముఖ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ అతి పెద్ద కార్పొరేట్ విరాళాన్ని అందించింది. ఈ ఫౌండేషన్ ఏకంగా రూ.130 కోట్ల విరాళాన్ని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ బాంబే ఐఐటీకి అందించింది. ఈ విద్యాసంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ను మరింతగా మెరుగుపర్చేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ తెలిపింది. అత్యాధునిక విద్య సంబంధిత మౌలిక వసతుల ఏర్పాటు, ఫైనాన్షియల్ మార్కెట్ లో వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణే లక్ష్యంగా ఈ సాయాన్ని అందించింది. 

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఒఎఫ్ఎస్ఎల్) రూ.4000 కోట్ల ఈక్విటీల్లో పది శాతం దాతృత్వం కోసం ఇస్తామని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రకారం ఈ మొత్తాన్ని అందజేయడం విశేషం. ఐఐటీ బాంబేలో మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటునకు ఇది తోడ్పడనుంది.

తమ విద్యాసంస్థకు పెద్ద మొత్తంలో విరాళం అందించిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ కు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీశ్ కెదారె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ట్రస్టీ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ .. మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్, సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహాత్మక దాతృత్వ శక్తికి నిదర్శనంగా ఉంటాయన్నారు.

మహారాష్ట్ర ఎమ్మెల్యేపై తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు

రాహుల్ గాంధీ నాలుక కోస్తే రూ.11 లక్షల రివార్డు ఇస్తానన్న సంజయ్ గైక్వాడ్

మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యేలతో కలిసి ఫిర్యాదు చేసిన చామల కిరణ్

సొంత మండల కేంద్రం శాలిగౌరారంలో ఫిర్యాదు

రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలో రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షల రివార్డ్‌ను అందిస్తానని ప్రకటించారు. దీంతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు వీరేశం, మందుల శ్యాంబాబుతో కలిసి శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన సొంత మండల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫిర్యాదుకు సంబంధించిన కాపీని పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ నాలుక కోస్తే రివార్డ్ ఇస్తామన్న మహారాష్ట్ర బుల్దానా ఎమ్మెల్యే సంజయ్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి... శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం

అతిషి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో అతిషి పేరును ఆమోదించారు. సమావేశంలో అతిషి పేరును సీఎం కేజ్రీవాల్‌ ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈరోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ఎల్జీని కలుసుకుని పదవికి రాజీనామా చేయనున్నారు.

ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలం తర్వాత తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారని మీకు తెలియజేద్దాం. ఆ తర్వాత కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో కొత్త సీఎంగా అతిశిని ఎన్నుకున్నారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ అతిషి పేరును ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ప్రతిపాదనను ఆమోదించారు.

అతిషి ఈ వారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతల్లో అతిషి కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. మనీష్ సిసోడియా జైలుకు వెళ్ళిన తరువాత, అతిషికి విద్యా మంత్రిత్వ శాఖతో సహా అనేక పెద్ద బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఆయన ఢిల్లీలోని కల్కాజీ ఎమ్మెల్యే.

ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి అతిషి. ఇంతకు ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఈ పదవిలో ఉన్నారు.

బ్రిటీష్‌ నాటి రూల్స్‌ బద్దలుకొట్టారు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు కనపడవ్‌. పోడియంలు కానరావ్.. సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతున్న రాచరికపు రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ… ఫ్రెండ్లీ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం.

కోర్టుల్లో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్‌ రిజిస్ట్రార్ సీటింగ్‌ పద్దతిని మార్చనుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు కూడా సింపుల్‌గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ… అన్ని ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు, పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలే తప్పా… వారి పనుల్లో నిర్లక్షంగా వ్యవహరించొద్దని అధికారులకు స్పష్టం చేసింది. అంతేకాదు పనులు ఆలస్యమైతే… ప్రజలకు మంచినీళ్లు, టీ,కాఫీ లాంటివి అందించాలంటూ ఏపీ ప్రభుత్వం కొత్త పద్దతిని తీసుకొస్తోంది.

ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ గుణదలలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పోడియంను తొలగించారు రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మరో రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల రూపురేఖలు మారిపోనున్నాయని తెలిపారు. పాత పద్దతులు ప్రజలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని వివరించారు.

ప్రజలకు మర్యాదపూర్వకంగా పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిరైనా ఉందని సిసోడియా చెప్పారు. మొత్తంగా… ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

చరిత్రపుటల్లో ఓ కమ్యూనిస్టు యోధుడు

బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో 1910లో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య. కృష్ణయ్య, రత్నమ్మ దంపతులకు...

బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో 1910లో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య. కృష్ణయ్య, రత్నమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో కొల్లా వెంకయ్య పెద్ద కుమారుడు. 1921–22లో పర్వతనేని వీరయ్య నాయకత్వంలో జరిగిన పన్నుల నిరాకరణోద్యమ ప్రభావంతో జాతీయోద్యమంలోకి ఆకర్షితులయ్యారు. పన్నెండేళ్ల వయస్సులో వెంకయ్య పెదనాన్న కొడుకు గోవిందు, ఆయన కుమారుడు పాపయ్య శాంతి సేనలో చేరారు. పెదనందిపాడు గ్రామంలో ఆజానుబాహుడు దాసరి సుబ్బయ్యశెట్టి, లావు వెంకటసుబ్బయ్యలు శాంతి సేనకు ముందు నిలిచేవారు. 1921లో శాంతి సేన ఆధ్వర్యంలో పుసులూరులో పెదనందిపాడు పరిసర ప్రాంత గ్రామ అధికారులు సభ జరిపి తమ పదవులకు రాజీనామా చేశారు. పెదనందిపాడు గ్రామ కరణం సరికా సీతారామయ్య రాజీనామా చేయగా, గ్రామస్తులు ఆయనను పల్లకీలో ఊరేగించారు. ఆ సభకు వెంకయ్య వెళ్లారు. పెదనందిపాడు ఫిర్కా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ ఉద్యమ సమయంలో రైతులే మాల, మాదిగలను ప్రోత్సహించి చెరువులో నీరు ముంచుకునేటట్లు చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మార్పు కొనసాగింది. గ్రామం చివరలో ఉన్న సారా దుకాణాన్ని మూయించారు. వారు మహాత్మాగాంధీ ప్రబోధించిన అంటరానితనానికి, మద్యపానానికి వ్యతిరేకంగా, హిందూ–ముస్లిం ఐక్యత కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

1948–51 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మైదాన ప్రాంతం నుంచి ఆ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో చివుకుల శేషశాస్త్రి, దండా నారాయణస్వామి, కొనికి లక్ష్మీనారాయణ వంటి రైతు నాయకులను కాల్చి చంపుతున్న రోజులవి. ఆ కాలమంతా కొల్లా వెంకయ్య అజ్ఞాత జీవితం గడిపారు. అప్పటికే ఆయన జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడు. రహస్య జీవితమంతా చాలా గడ్డుగా నడిచింది. రాత్రిపూట రైతుల కొట్టాల్లోనూ, పగలు పొలాల్లోనూ గడిపారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులకు రక్షణ ఇవ్వటం ప్రాణసంకటంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం వెంకయ్య గ్రామగ్రామాన కాలినడకన నడిచి ఉద్యమాన్ని నిర్మించారు.

కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర నాయకుడుగా కొల్లా వెంకయ్య వివిధ హోదాలలో పనిచేశారు. సీపీఐ నుంచి సీపీఐ(ఎం) వైపు వచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ మూడు నాలుగు జాతీయ కాంగ్రెస్‌లలో ఆయన కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) నుంచి తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులతో కలిసి సీపీఐ(ఎం)కి వ్యతిరేకంగా పాలకొల్లు లోనూ, బర్ద్వాన్‌లోనూ సిద్ధాంత పోరాటం నిర్వహించారు. కొంతకాలం చారు మజుందార్‌ నాయకత్వంలోని సీపీఐ(ఎంఎల్)లో కొనసాగారు. పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించబడి ఏడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాలు గాడి తప్పాయని చైనావారు సలహాలు ఇచ్చారు. అది దళ చర్యల ద్వారా సాగించే వ్యక్తిగత సంహారమని జైలు నుంచి కొల్లా వెంకయ్య, కాను సన్యాల్‌, చౌదరి తేజేశ్వరరావు, భువనమోహన్ పట్నాయక్, నాగభూషణ పట్నాయక్, సౌరీన్ బోస్ తదితరులు చారు మజుందార్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఆరుగురు కామ్రేడ్స్‌ లేఖగా అది ప్రసిద్ధి చెందింది. మార్క్సిజం–లెనినిజం, మావో ఆలోచన విధానం మా మౌలిక సిద్ధాంతం అని ఆయన పార్వతీపురం కుట్ర కేసులో వాదించారు. జిల్లా కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధంచగా, హైకోర్టు కొట్టివేసింది.

1952లో పొన్నూరు నుంచి శాసనసభకు, 1957లో శాసనమండలికి, 1962లో తెనాలి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1962లో భారత–చైనా సరిహద్దు ఘర్షణ సమయంలో నిర్బంధానికి గురయ్యారు. 1975లో అత్యవసర పరిస్థితిలో జైల్లో నిర్బంధించబడ్డారు. ఆయన అనేక సిద్ధాంత రచనలు చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉన్నది. వెంకయ్య నిరంతర అధ్యయనశీలి. కుల సమస్య పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కుల సమస్య వర్గ సమస్యతో ముడిపడి ఉన్నదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. 1955 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయన ఒక ‘కీ’ నోటు పెట్టారు.

1977లో జైలు నుంచి విడుదలైన తరువాత, నల్లమడ ముంపు నివారణ కోసం గొప్ప ఉద్యమం నిర్మించారు. 1973 భూగరిష్ఠ పరిమితి చట్టం అమలుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 1980లో గ్రామీణ పేదల సంఘాన్ని స్థాపించి భూ సంస్కరణల కోసం పోరాడారు. 1986లో భూ సంస్కరణల చట్టం అమలు కోసం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 1991లో తీర్పు రాగా, దాని అమలు కోసం జీవిత పర్యంతం పోరాడారు.

ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ రెండు విషయాల్లో తప్పు చేసిందనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఒకటి– ఎన్నికల్లో భూస్వామ్య పార్టీలతో పొత్తు కట్టటం, రెండు– సాయుధపోరాటం కొరకు పంథాను రూపొందించడం, అమలుపరచటంలోనూ! భారతదేశం అర్ధ వలస, భూస్వామ్య దేశం అని పార్లమెంటరీ పంథాను ఆయన తిరస్కరించారు. ఈ దేశంలో సోషలిజం స్థాపన జరగాలంటే కమ్యూనిస్టు ఉద్యమం సూత్రబద్ధంగా ఐక్యం కావాలని అందుకోసం ఆయన సుదీర్ఘ కృషి చేశారు. కడదాకా పేదరిక నిర్మూలన కోసం, సమసమాజం కోసం, ఎన్నో ఆటుపోట్లను, నిర్బంధాలను తట్టుకొని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడిన కొల్లా వెంకయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడు. ఆయన చనిపోయి నేటితో 26 సంవత్సరాలు పూర్తి అయింది.

మెుదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరుకు అన్నీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు భారీ ట్రక్కును తెప్పించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని ట్రక్కులోకి ఎక్కించారు. ఉదయం 6:15గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకూ పెద్దఎత్తున సాగనుంది. వందల, వేల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే ఖైరతాబాద్‌కు చేరుకున్నారు.

ఇవాళ మంగళవారం కావడంతో అర్ధరాత్రే కలశపూజ అనంతరం గణనాథుణ్ని కదలించారు. అనంతరం శోభాయాత్రకు సిద్ధం చేశారు. మొత్తం రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర.. ఖైరతాబాద్ మీదుగా సెన్సేషనల్ థియేటర్, రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్, NTR మార్గ్ వరకూ కొనసాగనుంది. NTR మార్గ్‌లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరగనుంది. హుస్సేన్ సాగర్‌లో ఇవాళ మధ్యాహ్నం 2గంటల కల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ యేడాది బడా గణేశ్ విగ్రహం తయారీ ఆలస్యంగా ప్రారంభమైనా అనుకున్న సమయానికే పూర్తి చేసి ఏర్పాటు చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి బడా లంబోదరుణ్ని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ వినాయకుణ్ని పెట్టడం మెుదలుపెట్టి 70ఏళ్లు అయిన సందర్భంగా ఈ యేడాది 70అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి పూజలు అందుకున్నారు. కుడి వైపు శ్రీనివాస కల్యాణం, ఎడమ వైపు పార్వతీ కల్యాణంతో కనివిందు చేస్తున్నారు. భారీ విగ్రహం కాళ్ల వద్ద అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విగ్రహం బరువు సుమారు 40నుంచి 50టన్నుల వరకూ ఉంటుంది. విగ్రహం తయారీకి పెద్దఎత్తున ఐరన్, పీచు, మట్టి వినియోగించారు.

మరోవైపు నగరవ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద గణేశ్ విగ్రహాలు అర్ధరాత్రి నుంచీ నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. 75 పాండ్స్‌తో పాటు 5 చెరువుల వద్ద క్రేన్లను సిద్ధం చేశారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జెసీబీలు, 102 మినీ టిప్పర్లు సిద్ధంగా ఉన్నాయి. నిమజ్జన డ్యూటీలో 20వేల మందికి పైగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లు సిద్ధం చేశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 25వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు అన్ని నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని పోలీసులు సూచించారు.

చైనాలో బెబింకా తుఫాను

చైనా ఆర్థిక నగరమైన షాంఘైను బెబింకా తుఫాను వణికిస్తోంది. సోమవారం ఉదయం షాంఘై నగరాన్ని తాకిన ఈ టైఫూన్‌ విజృభిస్తుండటంతో అక్కడి జనజీవనం స్తంభించింది. గత ఏడు దశాబ్దాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 151 కి.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘై నగరాన్ని తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది.

1949 తరువాత వచ్చిన తీవ్ర తుఫాను ఇదే ..!

ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అరుదు. 1949లో టైఫూన్‌ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుపాను ఇదే. దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. షాంఘై డిస్నీ రిసార్ట్‌తో సహా నౌకలను రీకాల్‌ చేశారు. పర్యాటక ప్రదేశాలను ఆదివారం మూసివేశారు. తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని చైనా వాతావరణ యంత్రాంగం ఆదివారం మధ్యాహ్నం టైఫూన్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

హైనాన్‌ ప్రావిన్స్‌లో యాగి తుపాను …

మరోవైపు చైనాలోని హైనాన్‌ ప్రావిన్స్‌ను యాగి తుపాను కలవరం రేపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ అయిపోవడంతో డిజిటల్‌ చెల్లింపులకు ప్రజలు నానాతంటాలు పడ్డారు. అంధకారంలో గడిపారు. కనీసం నిత్యావసర సరకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వివరించాయి.

నిమజ్జనంలో 15వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది

రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (GHMC Commissioner Amrapali ) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి అసలైన పని ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.

రేపటి మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 160 గణేష్ టీమ్స్ పనిచేయనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్, పెద్ద చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. అలాగే రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లు పొన్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ క్రేన్లు కూడా ఉన్నాయన్నారు. అవసరమైన ప్రాంతాలకు తరలించదానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రేపు (మంగళవారం) ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎల్లుండి వర్కింగ్‌ డే అని ఆలోపు నిమజ్జనం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.