హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. హైదరాబాద్‌లో హైటెన్షన్..!
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీ ఆఫీసు వద్ద ఆందోళన నిర్వహిస్తున్న.. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లదరినీ.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. మరోవైపు.. అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో.. అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై బీఎన్ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కిపోయింది. హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కుందుర్గ్ పోలీస్ స్టేషన్‌కు నేతలను తరలించారు. అయితే.. ఉదయం సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడి ఘటనపై జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌కు ఫిర్యాదు చేశారు.
అరెస్ట్ చేయాలని డిమాండ్..
అయితే.. కౌశిక్ రెడ్డిపై దాడిని సుమోటుగా తీసుకున్న పోలీసులు.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. అయితే.. అరికెపూడి గాంధీని ఏ1గా పేర్కొంటూ మొత్తం 30 మందిపై పలు సెక్షన్ల కింద (సెక్షన్లు 189, 191(2), 191(3), 61 , 132, 329, 333 324(4), 324(5) , 351(2) Red with 190 BNS) కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ కాపీని బీఆర్ఎస్ నేతలకు అందించారు. అయితే.. అందులో ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు పెట్టకపోవటంతో.. హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ హత్యాయత్నం చేసినట్టుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకు వెనక్కి తగ్గేదిలేదంటూ బీష్మించుకుని కూర్చుకున్నారు. అరికెపూడితో పాటు దాడికి యత్నించిన ఆయన అనుచరులను, అందుకు సహకరించిన పోలీసులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్చేయకపోతే.. కోర్టుకు వెళ్తామని హరీష్ రావు డిమాండ్ చేశారు.
హరీష్ రావు సహా అందరినీ అదుపులోకి..
ఆందోళన విరమించి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎంత చెప్పినా వెనక్కి తగ్గకపోవటంతో.. బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా.. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు బలవతంగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు బస్సుల్లో బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్నారు.
అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డి రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహాయంతో కౌశిక్ రెడ్డి కంఫ్లైంట్ ఇవ్వగా.. పోలీసులు అరికెపూడి గాంధీపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఇదే కాకుండా.. బీఎస్‌ఎస్ చట్టంలోని 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అంతకుముందు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు.. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా.. 41 నోటీసులు ఇచ్చి వ్యక్తిగత పూచికత్తు మీద అరికెపూడి గాంధీని పోలీసులు వదిలిపెట్టారు. విడుదలైన అనంతరం.. కౌశిక్ రెడ్డిపై కూడా తాను ఫిర్యాదు చేసినట్టు గాంధీ తెలిపారు. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినట్టుగా ఫిర్యాదు చేసినట్టు వివరించారు.
Sep 16 2024, 11:47