కోహ్లి చేసిన ఆ తప్పుతోనే వరల్డ్ కప్ కోల్పోయాం: రోహిత్
2019 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్స్‌లోనే నిష్క్రమించడానికి గల కారణాలను రోహిత్ శర్మ వివరించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి పేలవమైన వ్యూహాలే తమ జట్టు ఓటమికి పరోక్ష కారణమని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను భారత జట్టు కెప్టెన్ రోహిత్ తాజాగా చేయలేదు. గతంలో చేసిన ఈ కామెంట్స్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఓటమికి ప్రధాన కారణం భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో సరైనోడే లేకపోవడమే అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో అంబటి రాయుడు అని ఈ మెగాటోర్నీకి ముందు టీమ్ మేనేజ్మెంట్ ఓ అంచనాకు వచ్చింది. కానీ అనూహ్యంగా రాయుడును ఆ ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు.
అయితే నాలుగో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం మరోలా వచ్చి ఉండేదని రోహిత్ పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగిన సెమీస్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ''నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ జట్టుకు ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ ఎలా ఆలోచిస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంది. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే బాగుండేది అని నా అభిప్రాయం'' అని రోహిత్ పేర్కొన్నాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రోహిత్ నిలిచిన విషయం తెలిసిందే. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. దీనిలో అయిదు శతకాలు కూడా ఉన్నాయి. కాగా, ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ సారథ్యంలో టీమిండియా 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌కు చేరింది. ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది.
Aug 25 2024, 21:25