ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఫైర్-కోర్టులోనే తేల్చుకుంటా..!
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో ఇవాళ కూల్చివేయడాన్ని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.
స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. తమ ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. అదో ఓ పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని నాగార్జున పేర్కొన్నారు. అది ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అన్నారు. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపైనా కోర్టు స్టే ఇచ్చిందన్నారు.
స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని నాగార్జున తెలిపారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడినని తెలిపారు.
తాజా పరిణామాల వల్ల, తాము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని, ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాగార్జున తెలిపారు.
Aug 25 2024, 08:36