చెరువులు వెలవెల.... చేపల పంపిణీ ఎలా..?

నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి...

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల మత్స్య పారిశ్రామిక రంగం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు ముగుస్తున్నప్పటికీ చెరువులు నిండకపోవడంతో మత్స్య రంగంపై ఆధారపడ్డ కార్మికులు ఆందోళన గురవుతున్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇప్పటివరకు భారీ వర్షాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. లోటు వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో నీరు చేరలేదు. ఇప్పటికే జలకళ ఉండాల్సిన చెరువులు వెలవెల పోతున్నాయి. చేపల పంపిణీ సందిగ్ధంలో పడింది.. ఇలా ఉంటే ఇప్పటికే టెండర్ పూర్తయి చేపల సరఫరా చేసే కార్యక్రమం దాదాపు పూర్తి కావాల్సి ఉండే..... కానీ ఉమ్మడి జిల్లాలో టెండర్ వేశారు కానీ వాటిని ఓపెన్ చేయలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఏటా చేప పిల్లలు పంపిణీ చేసే చెరువులు సుమారు 2484 ఉన్నాయి. అందులో దాదాపు 12 కోట్లకు పైగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసేందుకు మూడు జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 700 చెరువులు, నల్గొండ జిల్లాలో 1163 చెరువులు, 621 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రెండు రకాల చేప పిల్లలను సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది అందులో 80-100 ఎంఎం, 35 నుంచి 40 ఎంఎం ఉన్నాయి... ప్రతి ఏటా కూడా ఈ సైజు చేప పిల్లలే పంపిణీ చేస్తుంటారు

చెరువులలో సరఫరా చేయడానికి ప్రతి ఏటా కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆయా జిల్లాల స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మూడు జిల్లాలో జూలై నుంచి టెండర్లు పిలిచారు. వారం రోజుల క్రితం వరకు టెండర్ దాఖలు దశ ముగిసింది. దరఖాస్తులను ఓపెన్ చేయలేకపోవడం ఒకటే మిగిలింది. అయితే నల్గొండ జిల్లాలో సుమారు 6 కోట్ల చేప పిల్లలు సరఫరా చేయడానికి కేవలం నలుగురు కాంట్రాక్టర్లు, సూర్యాపేటలో 3.41కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఐదుగురు కాంట్రాక్టర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు మాత్రమే టెండర్ దాఖలు చేశారు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. జూన్ జూలై మాసాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ వర్షం జాడే కనిపించకుండా పోయింది.ఆగస్టులోనే భారీ వర్షాలు ఉన్నాయని భావించారు కానీ అది జరగలేదు. ఉమ్మడి జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా నాగార్జున సాగర్,మూసీకి జలకళ వచ్చింది. మిగతా ప్రాంతాల్లో ఉన్న చెరువులు నీటి జాడ కనిపించలేదు. ప్రస్తుతం చెరువులో ఉన్న మీరు కూడా సాగునీటి కోసం వాడితే ఆ మాత్రం నీరు కూడా మిగలదు. గతంలో చేపల కాంట్రాక్ట్ కోసం పోటీపడ్డ కాంట్రాక్టర్లు ఈసారి చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం గతంలో చేసిన కాంట్రాక్టుకు బిల్లులు రాకపోవడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేప పిల్లల సరఫరాకు చెల్లించి ధర గిట్టుబాటు కావడం లేదని కారణమని సమాచారం..ఏది ఏమైనా ఈసారి ఉచిత చేపల పంపిణీ అంతంత మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

బతుకమ్మకుంటను బతికిస్తాం...

అంబర్‌పేట బతుకమ్మకుంటను చెరబట్టిన వారిని వదిలేది లేదని, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు.

అంబర్‌పేట బతుకమ్మకుంటను చెరబట్టిన వారిని వదిలేది లేదని, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. బతుకమ్మకుంట స్థలాన్ని రక్షించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ కార్పొరేటర్‌ జ్ఞానేశ్వర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు కమిషనర్‌ బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు లేఅవుట్‌, చుట్టుపక్కల కాలనీలు తదితరాంశాలను తెలుసుకున్నారు. బతుకమ్మకుంట చెరువు, రికార్డులు, కోర్టు కేసులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే చర్యలు చేపడతామని కమిషనర్‌ వివరించారు.

త్వరలో వచ్చే బతుకమ్మ పండుగ లేదా వచ్చే ఏడాది నాటికి బతుకమ్మకుంట చెరువును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గోల్నాక డివిజన్‌ హుస్సేన్‌సాగర్‌ నాలా బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఖైరతాబాద్‌ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, పార్టీ నేతలు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

అనుమతి లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న భవనాలను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. నార్సింగి మున్సిపల్‌ పరిధిలోని విజయనగర్‌ కాలనీలో ఓ నిర్మాణదారుడు నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకొని ఆరు అంతస్తులు నిర్మించాడు. సమాచారం అందుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అలాగే మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలో రెండోరోజు కూల్చివేతలు కొనసాగాయి. మంగళవారం పాక్షికంగా కూల్చిన భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతోపాటు మరోమూడు విల్లాలను బుధవారం కూల్చివేశారు.

కృష్ణా వరదలకు అమరావతి మునిగిపోతుందా ? వరల్డ్ బ్యాంక్ ప్రశ్నకు సర్కార్ సమాధానమిదే..!

ఏపీ రాజధాని అమరావతికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ప్రభుత్వానికి ఓ కీలక ప్రశ్న వేశాయి. రెండు రోజులుగా అమరావతి రాజధానిలో పర్యటిస్తున్న ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు పలు విషయాలను సీఆర్డీఏ అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కీలక ప్రశ్నను వారికి సంధించాయి. అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది.

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిని అమరావతి వంటి ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతంలో కట్టడం సరికాదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పేవారు. చివరికి అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. చివరికి అది కాస్తా కోర్టుల పరిధిలోకి వెళ్లిపోవడంతో చేసేది లేక మిన్నకుండిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో తిరిగి అమరావతిలోనే రాజధాని నిర్మాణం కోసం పావులు కదులుతున్నాయి. అయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా అదే ప్రశ్న వేసింది.

అమరావతికి కృష్ణావరదలతో ఉన్న ముప్పును వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏడీబీ ప్రతినిధులు ప్రశ్నించారు. కృష్ణానది వరదల వల్ల రాజధానికి ముంపు ముప్పు ఉందా అని సీఆర్డీఏ అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి వారు నేరుగా స్పందించలేదు. కరకట్టలు అయితే పటిష్టంగా ఉన్నాయని, ఎప్పుడూ ముంపు సమస్య ఎదురుకాలేదని మాత్రం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారుల చెప్పారు. దీనిపై వారు సంతృప్తి చెందారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో ఎలాగో తేలిపోనుంది.

గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాక వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ అనుకూల రైతులు.. ఇక్కడ రాజధాని కడితే కృష్ణావరదలకు మునిగిపోతుందని ఫిర్యాదులు చేశారు. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతికి రుణం అక్కర్లేదని చెప్పేయడంతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ అప్పట్లో తమ నిర్ణయాలను సవరించుకున్నాయి.

లక్షల కార్లు షోరూమ్‌ల్లోనే..

ప్రయాణికుల వాహనాల అమ్మకాలు నీరసించాయి. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్ల నిల్వలు పేరుకు పోయాయి. వీటి విలువ ఎంత లేదన్నా రూ.73,000 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. గత నెల ప్రారంభంలో 65-67

దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డీలర్ల వద్ద ఏడు లక్షల కార్ల నిల్వలు పేరుకు పోయాయి. వీటి విలువ ఎంత లేదన్నా రూ.73,000 కోట్ల వరకు ఉంటుందని ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. గత నెల ప్రారంభంలో 65-67 రోజుల అమ్మకాలకు సరిపడా నిల్వలు ఉంటే, ఇప్పుడది 70-75 రోజులకు చేరింది. కంపెనీలు ఎడాపెడా ఉత్పత్తి పెంచేయడం, అధిక వడ్డీరేట్లు ఇందుకు ప్రధాన కారణమంటున్నారు.

సాధారణంగా డీలర్ల వద్ద కార్ల నిల్వలు నెల రోజులకు సరిపడా ఉంటాయి. ఇప్పుడది 70-75 రోజులకు పెరిగి పోయింది. దీంతో డీలర్లు ఆర్థికంగా చితికి పోతున్నారు. వర్కింగ్‌ కాపిటల్‌ అవసరాలు పెరిగిపోయి వడ్డీల భారం పెరిగి పోతోంది. ఈ పరిణామంతో కొంత మంది డీలర్లు దివాలా తీసే ప్రమాదం పొంచి ఉందని ఫాడా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్ల కంపెనీలు రిటైల్‌ అమ్మకాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి వ్యూహం మార్చుకుని సరఫరాలు తగ్గిస్తే, ఈ పరిస్థితి నుంచి కొంత వరకు బయట పడవచ్చని డీలర్లు చెబుతున్నారు.

పరిస్థితి నుంచి బయట పడేందుకు కార్ల కంపెనీలే తమను ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు. నెల రోజులకు మించి ఉండే నిల్వల నిర్వహణకు అయ్యే వర్కింగ్‌ కాపిటల్‌ వడ్డీ ఖర్చులైనా కంపెనీలు భరించాలని కోరుతున్నారు. లేకపోతే ప్రస్తుత కష్టాల నుంచి బయట పడడం డీలర్లకు కష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు పేరుకుపోయిన వాహన నిల్వల అమ్మకాల కోసం కంపెనీలు ప్రత్యేక పథకాలు, డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రవేశ పెట్టాలని డీలర్లు కోరుతున్నారు.

డీలర్లు ఇన్ని కష్టాల్లో ఉన్నా కార్ల కంపెనీల నుంచి పెద్దగా స్పందన లేదు. నిల్వలు పేరుకుపోవడం పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. ఇటువంటి ఆటోపోట్లు ఏర్పడుతూనే ఉంటాయని తేలికగా తీసిపారేసింది. అయితే డీలర్లు ఆర్థికంగా బాగుండడం, కంపెనీలకే మంచిదని మాత్రం అంగీకరించింది. డీలర్ల వద్ద పేరుకు పోయిన వాహనాల నిల్వలను వదిలించేందుకు ఆయా కంపెనీలే బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవడం మంచిదని సియామ్‌ తెలిపింది.

హైదరాబాద్‌లో వందెకరాల భూమి, ఆఫీసులు అమ్మేస్తున్న ఐటీ దిగ్గజం.. వందల కోట్ల డీల్.. గండిమైసమ్మ దగ్గర ఇంత రేటా?

భారత దిగ్గజ ఐటీ సంస్థలకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆఫీసులు, భూములు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవి కొన్ని కొన్ని సార్లు చేతులు మారుతుంటాయి. అంటే క్రయవిక్రయాలు జరుపుతుంటాయి. ఇప్పుడు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రాకు చెందిన 103 ఎకరాల విస్తీర్ణంలోని భూమి చేతులు మారనుంది. ఇందుకోసం రూ. 535 కోట్లకు డీల్ కుదుర్చుకుంది.

హైదరాబాద్‌ను రియల్ ఎస్టేట్ అడ్డా అని చెప్పొచ్చు. ఈ విశ్వనగరంలో కొంతకాలంగా భూములు, ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్ని తలదన్నేలా ఇక్కడ డీల్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. గతేడాది కోకాపేటలో ఎకరం రూ. వంద కోట్లు పలికిన సంగతి తెలిసిందే. అప్పుడు దేశమంతా హైదరాబాద్ వైపు చూసింది. ఆ తర్వాత ఇంకెన్నో వందల కోట్ల డీల్స్ జరిగాయి. ఇది తర్వాత్తర్వాత సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ .. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఇక ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌లో దిగ్గజ ఐటీ సంస్థ అతిపెద్ద డీల్ చేసుకుంది.

హైదరాబాద్ గండిమైసమ్మ దగ్గర్లోని బహదూర్‌పల్లిలోని 103 ఎకరాల మేర విస్తరించి ఉన్న భూమిని టెక్ మహీంద్రా రూ. 535 కోట్లకు విక్రయించేందుకు డీల్ చేసుకుంది. ఇందులోనే సుమారు 1.26 మిలియన్ చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న 17 బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆగస్ట్ 20న దీనికి సంబంధించి ఒప్పందం ఖరారైంది. ఇక డీల్‌ను మహీంద్రా యూనివర్సిటీతోనే కుదుర్చుకోవడం విశేషం.

రూ. 535 కోట్లకు అదనంగా టాక్సులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, కన్వర్షన్ ఛార్జీలు, ఇంకా వర్తించే ఏవైనా ఛార్జీలు కూడా ఉన్నాయి. ఇక ఈ మొత్తాన్ని ఏకకాలంలో కాకుండా.. నాలుగేళ్లలో చెల్లించేలా ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు ఇరుపార్టీలు అంగీకరించాయి. వార్షిక ప్రాతిపదికన 8.20 శాతం వడ్డీ రేటుతో చెల్లించేందుకు ఒప్పుకున్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా.. ఎక్స్చేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది.మహీంద్రా యూనివర్సిటీని సమాజ అభివృద్ధిపై దృష్టి సారించే స్వయం ప్రతిపత్త సంస్థగా ఏర్పాటు చేయడమే ఈ విక్రయం వెనుక లక్ష్యమని టెక్ మహీంద్రా తెలిపింది. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్- 2018 అనుగుణంగా స్థాపించిన విశ్వవిద్యాలయం మహీంద్రా యూనివర్సిటీ. ఇక దీనికి మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్పాన్సరింగ్ బాడీగా ఉంది. ఈ డీల్ నేపథ్యంలోనే టెక్ మహీంద్రా షేరు ఇటీవల పుంజుకుంది. ఆగస్ట్ 20న 2 శాతానికిపైగా పెరిగింది. ప్రస్తుతం రూ. 1600 లెవెల్స్‌లో ఉంది. మార్కెట్ విలువ రూ. 1.57 లక్షల కోట్లు కాగా.. స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 1633.65 గా ఉంది.

నేడు అచ్యుతాపురం ప్రమాద స్థలానికి చంద్రబాబు..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాద ఘటన స్థలాన్ని, బాధిత కుటుంబాలను నేడు సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఉదయం 10:30 కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు.

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాద ఘటన స్థలాన్ని, బాధిత కుటుంబాలను నేడు సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. ఉదయం 10:30 కు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. 12 :10 కి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మెడికవర్ హాస్పిటల్, వెంకోజిపాలెంకు చేరుకోనున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించి, వైద్య బృందాలతో చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి సాయంత్రం నాలుగున్నరకు చంద్రబాబు చేరుకోనున్నారు.

ఫార్మా ప్రమాదంలో మృతుల వివరాలు..

1. నీలాపు రామిరెడ్డి (48) అసిస్టెంట్ జనరల్ మేనేజర్

2. ప్రశాంత్ హంస (33) ప్రొడక్షన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్

3. నారాయణరావు (33) అసిస్టెంట్ మేనేజర్

4. గణేష్ కుమార్ (32) సీనియర్ ఎగ్జిక్యూటివ్

5. హారిక (22) ట్రైని ఇంజనీర్

6. రాజశేఖర్ (21) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్

7. సతీష్ (31) సీనియర్ ఎగ్జిక్యూటివ్

8. నాగబాబు (35) అసిస్టెంట్ మేనేజర్

9. నాగేశ్వర రామచంద్ర రావు 47 (అసిస్టెంట్ మేనేజర్, టీం లీడర్)

10. సన్యాసినాయుడు (55) హౌస్ కీపింగ్

11. చిన్నారావు (33) పెయింటర్

12. పార్థసారథి (27) ఫీట్టర్

13. మోహన్ దుర్గాప్రసాద్ (19) హౌస్ కీపింగ్ బాయ్

14. ఆనందరావు (36) అసిస్టెంట్ మేనేజర్

15. సురేంద్ర (37) అసిస్టెంట్ మేనేజర్

16. వెంకట సాయి (27) సీనియర్ ఎగ్జిక్యూటివ్

17. చిరంజీవి (24) ఫిట్టర్

18. గుర్తు తెలియని వ్యక్తి

ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన 8 మంది, ఇంజనీరింగ్ కి చెందిన ఐదుగురు, ల్యాబ్ కు నలుగురు చెందిన మృతి చెందారు. ఫార్మాలో చేరిన నెలరోజుల్లోనే రాజశేఖర్, సతీష్, మోహన్ దుర్గాప్రసాద్ మృతి చెందారు. ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ రాజశేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్, హౌస్ కీపింగ్ బాయ్‌గా మోహన్ దుర్గాప్రసాద్ మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు 18 మృతదేహాలను తరలించారు. నష్టపరిహారం ప్రకటించేంత వరకూ పోస్టుమార్టం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదా జిల్లా అధికారి కలెక్టర్ అధికారికంగా ప్రకటిస్తేనే పోస్టుమార్టానికి అంగీకరిస్తామని బంధువులు తెలిపారు.

ఉక్రెయిన్‌లో మోదీ టూర్.. లగ్జరీ ట్రైన్‌లో ప్రయాణం.. ట్రైన్ ఫోర్స్ వన్ విశేషాలేంటంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం మొదలై రెండేళ్లు దాటిన తర్వాత త్వరలోనే ప్రధాని మోదీ కీవ్‌లో పర్యటించనున్నారు. అయితే కీవ్ పర్యటనకు విమానంలో కాకుండా రైలులో వెళ్లనున్నారు. అయితే అత్యంత సురక్షితమైన రైలుగా పేరు గాంచిన ట్రైన్ ఫోర్స్ వన్‌లో ప్రధాని కీవ్ చేరుకోనున్నారు. ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో ప్రయాణించి ప్రపంచ దేశాల అధినేతలు కీవ్‌లో పర్యటించారు. ఇంతకీ ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలు విశేషాలు ఏంటి.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు దేశాల అధినేతలకు సూచించిన మోదీ.. ఈసారి ఏకంగా ఉక్రెయిన్‌లోనే పర్యటించడం విశేషం.

నరేంద్ర మోదీ ఈ నెల 23 వ తేదీన కీవ్‌లో పర్యటించనున్నారు. అయితే ఇతర దేశాల మాదిరిగా విమానాల్లో కాకుండా.. రైలులో ఉక్రెయిన్‌ రాజధానికి చేరుకోనున్నారు. అత్యంత సురక్షితమైన రైలుగా పేరు గాంచిన ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌లో ప్రధాని మోదీ కీవ్ చేరుకోనున్నారు. ఇప్పటివరకు యుద్ధం సందర్భంగా కీవ్‌లో పర్యటించిన ప్రపంచ దేశాధినేతలు అందరూ ఈ ట్రైన్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణించడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టిన నాటి నుంచి కీవ్‌కు విమానంలో వెళ్లడం అంత సురక్షితం కాకపోవడంతో అప్పటి నుంచి ఉక్రెయిన్‌ ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌.. జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు ట్రైన్ ఫోర్స్ వన్‌లోనే ప్రయాణించి కీవ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఈ రైలు పేరు ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ లేదా రైల్‌ ఫోర్స్‌ వన్‌గా మారిపోయింది. అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం అయిన సమయంలో లక్షలాది మంది ఉక్రెయిన్‌ వాసులను సురక్షిత ప్రాంతాలకు ఈ రైలు తరలించింది. ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు ఇదే లైఫ్‌లైన్‌గా మారింది.

ఇక ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. మొదట పోలండ్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత పోలండ్ నుంచి ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో 10 గంటలు ప్రయాణించి కీవ్‌కు చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలోనూ మరో 10 గంటలు ప్రయాణిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే మోదీ ప్రయాణం కోసం భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో విలాసవంతమైన క్యాబిన్లు ఉంటాయి. సమావేశాల కోసం పెద్ద పెద్ద టేబుల్స్‌, సోఫా, టీవీతో పాటు రెస్ట్ తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్ రూమ్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం యుద్ధం సమయంలో ఈ లగ్జరీ రైలు ప్రయాణించడానికి ఉక్రెయిన్‌ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రష్యా చేస్తున్న దాడుల కారణంగా తరచూ పవర్ కట్‌లు ఎదురవుతున్న వేళ.. ఈ రైలు ఇంజన్లను కూడా మార్చేశారు. ఈ రైలు టైమింగ్స్ సహా ఇతర వివరాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.మరోవైపు.. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఆ రెండు దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చలు జరుపుకోవాలని భారత్‌ మొదటి నుంచీ ఒకే విషయాన్ని చెబుతోంది. ఉక్రెయిన్‌ పర్యటనలో భాగంగా ఈ నెల 23 వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కీవ్‌లో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

సింహం కూడా సంక్రాంతికి ఫిక్సైందా..?

నందమూరి నట సింహం బాలకృష్ణ తన 109వ సినిమాగా కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కలిసి తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు. వరుస సినిమాలు వాటితో వరుస హిట్లతో అదరగొట్టేస్తున్న బాలయ్య బాబు బాబీ సినిమాతో కూడా భారీ హిట్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్టు టాక్.

అక్టోబర్ కల్లా సినిమా పూర్తి చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఐతే డిసెంబర్ లో పుష్ప 2, గేమ్ చేంజర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి రిలీజ్ కష్టమని భావిస్తున్నారు. ఐతే నిర్మాతలు ఇప్పుడు బాలయ్య బాబు సినిమాను సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజైతే ఆ లెక్క వేరేలా ఉంటుంది. సంక్రాంతికి నందమూరి హీరో సినిమా వస్తే ఫ్యాన్స్ కి పండుగే. సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలకు మంచి హిట్ రికార్డ్ ఉంది.

అందుకే బాలయ్య 109వ సినిమాను కూడా సంక్రాంతి రేసులో దించాలని చూస్తున్నారు. ఐతే సంక్రాంతికి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ లాక్ చేశారు. వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమా కూడా సంక్రాంతికి రావడం కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇప్పుడు బాలయ్య బాబు మూవీ కూడా పొంగల్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సీనియర్ హీరోల సినిమాల ఫైట్ తో బాక్సాఫీస్ కళకళలాడుతుందని చెప్పొచ్చు. ఐతే ఇదివరకు కూడా బాలయ్య, వెంకటేష్, చిరంజీవి ముగ్గురు కలిసి బాక్సాఫీస్ ఫైట్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు బాలకృష్ణ సినిమా సక్సెస్ అందుకుంది.

ఐతే ఈ ముగ్గురితో పాటు నాగార్జున కూడా ఏదైనా సినిమా తో వస్తే సంక్రాంతి ఫెస్టివల్ సీనియర్లకు ఇచ్చేసినట్టు అవుతుంది. మరి సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ మెంట్ అయితే చేస్తారు రిలీజ్ టైం కు ఏవి ఉంటాయి. ఏవి వాయిదా పడతాయన్నది తెలియాల్సి ఉంది. అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం సీనియర్ స్టార్ సినిమాలతో ఒక రేంజ్ లో హంగామా ఉండదనుందని చెప్పొచ్చు. సీనియర్ స్టార్ బాక్సాఫీస్ ఫైట్ తో సంక్రాంతికి సినిమాల సందడి షురూ కానుంది. మరి వీరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్లో 39 పరుగులు చేసిన బ్యాటర్

అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ఒకే ఓవర్లో 39 పరుగులు చేసిన బ్యాటర్ సరికొత్త రికార్డు (Record) నెలకొల్పాడు. ఆ సంచలన ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (39 Runs In One Over).

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా సమోవా, వనాటు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సమోవా వికెట్ కీపర్ డారియస్ విస్సర్ (Darius Visser) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వనాటు బౌలర్ నిపికో వేసిన ఓవర్లో ఏకంగా 39 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో నిపికో మూడు నో బాల్స్‌తో సహా 9 బంతులు వేశాడు. ఈ 9 బంతుల్లో డారియస్ 6 సిక్స్‌లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 39 పరుగులు వచ్చాయి. దీంతో యువరాజ్ సింగ్ ఊచకోత రికార్డు బద్దలైంది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఆరు సిక్సర్లు బాది ఈ రికార్డు నెలకొల్పాడు.

అప్పటి నుంచి ఈ రికార్డు పదిలంగా ఉంది. ఆ తర్వాత యువరాజ్ రికార్డును కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దిపేందర్ సింగ్ (2024), రోహిత్ శర్మ-రింకూ సింగ్ (2024) సమం చేయగలిగారు. తాజాగా ఈ అరుదైన రికార్డును 28 ఏళ్ల డారియస్ విస్సర్ బ్రేక్ చేశాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసిన విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సమోవా 2026 టీ20 వరల్డ్ కప్ అర్హత‌కు అవకాశాలను మెరుగుపర్చుకుంది

దటీజ్ హైదరాబాదీ.. కారు వరదల్లో కొట్టుకుపోకుండా తాడుతో కట్టేశాడు!

హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హైదరాబాదీ వీధులు కాల్వలను తలపిస్తున్నాయి. కూడళ్లు చెరువులు, కుంటలుగా మారాయి. చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఆ వరదలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఆ వరదల నుంచి తన కారును కాపాడుకోవడానికి ఓ వ్యక్తి తాడుతో కట్టేశాడు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్.. వర్షంలో తడిసి ముద్దవుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి భాగ్యనగరం జలమయం అయ్యింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరదల్లో వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో కార్లు గల్లంతయ్యాయి. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో వాహనాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ వాహనాలను కాపాడుకోవడం ఛాలెంజ్‌గా మారిందని హైదరాబాదీలు వాపోతున్నారు.

తాడుతో కారును కట్టేసి..

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో తన కారు కొట్టుకుపోతుండా తాడుతో కట్టేశాడు. వెనక డోర్ అద్దం నుంచి ముందు డోర్‌కు తాడు కట్టి.. దాన్ని తన ఇంటికి గట్టిగా కట్టాడు. దీంతో వరదలో తన కారు కొట్టుకుపోలేదు. కానీ.. వరద నీటిలో మునిగిపోయింది. రిపేర్ ఖర్చులు ఎంత అవుతాయో తెలియదు కానీ.. కనీసం కారు అయినా మిగిలిందని సదరు వ్యక్తి సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుంది.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి.. ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకోని ఉన్న గోడ కూలడంతో.. అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి వద్ద విషాదం జరిగింది. విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు.

జల దిగ్భంధంలో పార్శిగుట్ట..

భారీ వర్షాలకు రాంనగర్‌లో వరదలు వచ్చాయి. ఈ వరదలో ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన స్థానిక యువకులు కోట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. మరోవాపు సికింద్రాబాద్ పార్శిగుట్ట ఏరియాను వరద నీరు ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లలోని వరద నీరు చేరింది. దీంతో పార్శిగుట్టు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ బృందం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

భాగ్యనరగంలో భారీ వర్షాల నేపథ్యంలో.. జల మండలి అప్రమత్తమైంది. సంస్థ ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ..ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని.. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సీవరేజి ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి ఫోన్ చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.