నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు స్టార్ట్ కానున్నాయి. శాసనమండలి సమావేశాలు రేపు( జులై 24) ఉదయం 10 గంటలకుయ ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది.

ఇవాళ ఉదయం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.

ఇక, ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీలో నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది.

ఈ సమావేశంలో సభ ఎజెండా, అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు రైతు రుణమాఫీ అంశంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

అలాగే, ఈ నెల 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 26వ తేదీన సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు.

ఇక, ఈ నెల 27న బడ్జెట్‌ ప్రసంగంపై చర్చ స్టార్ట్ అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ సభకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 30వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సెషన్స్ లో స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్‌ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీల మీద కూటమి టార్గెట్

ఉత్తరాంధ్ర జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఖాళీలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ కోటా నుంచి తొందరలోనే ఇద్దరు ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉంది.

విశాఖ జిల్లాలో ఒకటి, విజయనగరం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. విశాఖ కోటాలో వంశీ క్రిష్ణ శ్రీనివాస్ 2021లో వైసీపీ తరఫున గెలిచారు.

ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది.

విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ రాఘురాజు టీడీపీకి ఎన్నికల్లో సహకరించారు అని వైసీపీ ఫిర్యాదు మేరకు ఆయన మీద శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి ఖాళీగా ప్రకటించవద్దు అని కోర్టు ఆదేశించింది.

అయితే ఆ పోస్టు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మరో మూడున్నరేళ్ళ దాకా పదవీ కాలం ఉన్న ఈ రెండు పోస్టులను లోకల్ బాడీ కోటాలో వైసీపీ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈ పోస్టుల మీద కూటమి టార్గెట్ చేసింది. దాంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తమ వైపునకు తిప్పుకుంటోంది.

జీవీఎంసీలో పెద్ద ఎత్తున కార్పోరేటర్లను చేర్చుకోవడం ద్వారా మేయర్ పదవిని సొంతం చేసుకోవడంతో పాటు ఎమ్మెల్సీ సీటుని కూడా దక్కించుకోవాలన్నది కూటమి ప్లాన్ అని అంటున్నారు.

విజయనగరంలో కార్పొరేషన్, జిల్లా పరిషత్తు చైర్మన్ రెండూ వైసీపీ చేతిలో ఉన్నాయి. అక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కూటమి బలపడుతుందని అంటున్నారు. దాంతో ఎపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఈ రెండు పదవులూ తమ ఖాతాలోకి వేసుకోవడానికి చూస్తోందని అంటున్నారు. వైసీపీ నుంచి ఆపే ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఏ మాత్రం ఫలించకపోవడంతో చేష్టలుడిగి చూస్తోంది అని తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కష్టమేనా.. సీబీఐ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న కోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఢిల్లీ మద్యం విధానంకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు.. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు తమ పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే కవితను హాజరుపరచాలని ఆదేశించింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మరికొన్ని రోజులు తీహార్ జైలులోనే ఉండనున్నారు. ఇప్పటికే దాదాపు 4 నెలలుగా తీహార్ జైలులోనే ఉంటున్న కవిత.. తనకు డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణను ఆగస్టు 5 వ తేదీకి వాయిదా వేసింది.

ఇక ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. అందులో కవిత పాత్రకు సంబంధించిన అభియోగాలతో కూడిన ఛార్జిషీట్‌ను.. సీబీఐ అధికారులు ఇప్పటికే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. తాజాగా ఆ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. అంతేకాకుండా జులై 26 వ తేదీన కల్వకుంట్ల కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌కు సంబంధించిన కాపీలను నిందితుల తరఫు లాయర్లకు ఇవ్వాలని సీబీఐ అధికారులకు కోర్టు సూచించింది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్‌ 7 వ తేదీన సీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టులో కవిత తరఫు లాయర్లు సందేహాలు వ్యక్తం చేశారు. 60 రోజుల గడువులోపల సీబీఐ అధికారులు పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో విఫలం అయ్యారని ఇదివరకే జులై 8 వ తేదీన కవిత లాయర్లు పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. అంతేకాకుండా కవితను సీబీఐ అధికారులు ఏప్రిల్ 11 వ తేదీన అక్రమంగా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత జూన్ 7 వ తేదీన అసంపూర్తిగా సీబీఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిందని విన్నవించారు. ఇదే సమయంలో ఆ ఛార్జిషీట్‌లో తప్పులు ఉన్నాయని కోర్టు కూడా పేర్కొనడం గమనార్హం.

సీఆర్పీసీ 167(2) ప్రకారం.. కల్వకుంట్ల కవిత డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు ఉంటుందని... 7 ఏళ్ల శిక్ష పడే కేసులో 60 రోజులు మాత్రమే కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంటుందని కవిత లాయర్లు వాదించారు.

తాము డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జూలై 6 తేదీ నాటికి.. ఆమె కస్టడీ 86 రోజులు పూర్తైందని ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కవిత బెయిల్ పిటిషన్‌ విచారణకు రాగా.. ఆగస్టు 5కు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేసులు నమోదు చేసిన సీబీఐ, ఈడీ.. కవితను అదుపులోకి తీసుకున్నాయి. అయితే అప్పటి నుంచి ఆమెకు బెయిల్ తీసుకువచ్చేందుకు లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. అవి విఫలం అవుతున్నాయి.

తాజాగా కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేయడంతో ఆమె మరికొంత కాలం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రుణమాఫీ ఖాతాలో పడని రైతన్నలు ఆందోళన పడొద్దు..

తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture minister) తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. రుణమాఫీ-2024లో మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture Minister) తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు.

రుణమాఫీ-2024లో మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) సమాచారం ప్రకారం 11.32లక్షల రైతు కుటుంబాలకు రూ.6,014కోట్లు జమ అయినట్లు వెల్లడించారు.

కొన్ని సాంకేతిక కారణాలతో 17,877ఖాతాలకు చెందిన రూ.84.94కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదన్నారు. రైతులు ఎవ్వరూ కూడా కంగారు పడొద్దని వారికి కూడా త్వరలోనే నగదు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

దీనిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నదాతలకు సూచించారు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం సాంకేతిక సమస్యలు సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.

వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(సీడెడ్ సంఘాలు)కు సంబంధించి మిగిలిన 15,781 రుణఖాతాల తనిఖీ సోమవారంతో పూర్తవుతుందని చెప్పారు.

అనంతరం ఆ ఖాతాలకు సైతం రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

వేగంగా క్షీణిస్తున్న నీటి వనరుల్లోని ఆక్సిజన్!.. ఈ పరిణామం దేనికి దారితీస్తుంది?

ప్రపంచ నీటి వనరుల్లో కరిగి ఉండే ఆక్సిజన్ వేగంగా క్షీణిస్తోందని నూతన అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిణామం భూగ్రహంపై ప్రాణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుల్లో ఒకటిగా పరిణమించే అవకాశం ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం హెచ్చరించినట్టు ‘సైన్స్ అలర్ట్’ కథనం పేర్కొంది.

వాతావరణ మార్పులు, కర్బన వాయు ఉద్గారాల కారణంగానే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేడి నీటిలో తక్కువ ఆక్సిజన్‌ ఉంటుందని, నీటిలో ఉండే ఆక్సిజన్‌పై ఆధారపడి జీవించే ప్రాణులకు ఇది పెనుప్రమాదమని అధ్యయనం విశ్లేషించింది. అంతేకాదు మనుషులు, జంతువులకు చాలా ముఖ్యమైన వాతావరణంలోని ఆక్సిజన్‌పై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది.

నీటి వనరుల్లోని ఆక్సిజన్ వేగంగా తగ్గడానికి ఆల్కే, బాక్టీరియా కూడా కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. 

వ్యవసాయ, వినియోగం కోసం వాడే ఫెర్టిలైజర్లు, మురుగు, పారిశ్రామిక వ్యర్థాల రూపంలో సేంద్రియ పదార్థాలు నీటిలో కలుస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

ప్రాణవాయువు ప్రమాదకర స్థాయికి పడిపోతే ఆక్సిజన్‌పై ఆధారపడని సూక్ష్మజీవులు కూడా చనిపోతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మనుషుల పురోగతి, సురక్షిత కార్యకలాపాల కోసం భూమి చుట్టూ నిర్దేశించుకున్న ‘గ్రహ సరిహద్దుల’ (Planetary Boundaries) జాబితాలో ఈ ‘ఆక్వాటిక్ డీఆక్సిజనేషన్’ను కూడా జత చేయాలని పరిశోధనా బృందం అభిప్రాయపడింది.

ఇప్పటివరకు వాతావరణ మార్పు, సముద్రాల ఆమ్లీకరణ, ఓజోన్ క్షీణత, ప్రపంచ భాస్వరం-నత్రజని వలయాలు, జీవవైవిధ్య తగ్గుదల రేటు, ప్రపంచ తాజా మంచినీటి వినియోగం, భూమి-వ్యవస్థలో మార్పు, ఏరోసోల్ లోడింగ్, రసాయన కాలుష్యం పేరిట మొత్తం తొమ్మిది గ్రహ సరిహద్దులు ఉన్నాయి. 

భూమిపై తాజా నీరు, సముద్ర జలాల్లోని ఆక్సిజన్ క్షీణతను అదనపు భూగ్రహ సరిహద్దుగా పరిగణించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

భూమిపై జీవ పర్యావరణం, సామాజిక వ్యవస్థల సమగ్రతకు ఈ అదనపు గ్రహ సరిహద్దు ప్రక్రియ ముఖ్యమని వారు పేర్కొన్నారు. ఇతర గ్రహ సరిహద్దు ప్రక్రియలతో పోల్చదగిన విధంగా ఆక్సిజన్ క్షీణత చేరుకుంటోందని వారు వివరించారు.

నూతన చట్టాలపై మీ వైఖరి చెప్పాల్సిందే.. సర్కార్‌కు కేటీఆర్ లేఖ

దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయన్నారు.

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా..

లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలన్నారు.

ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలన్నారు.

దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరపున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వలేం.. పార్లమెంటులో తేల్చి చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పేసింది. దీంతో ఇప్పటివరకు ప్రత్యేక హోదా వస్తుందని పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాశలు అయ్యాయి. లోక్‌సభలో మెజార్టీ మార్కును అందుకోవడంలో విఫలమైన బీజేపీకి ఎన్డీఏలోని టీడీపీ, జేడీయూలు కీలక మిత్రపక్షాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఏపీ, బీహార్‌లు ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురుచూస్తుండగా.. కేంద్రం చేసిన ప్రకటనతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.

మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా 2014 నుంచి కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ సొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి సొంతంగా లోక్‌సభలో మెజార్టీ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ - టీడీపీ.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ - జేడీయూల మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌.. మళ్లీ తెరపైకి వచ్చింది.

అయితే ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రణాళిక సహాయం కోసం.. గతంలో నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ -ఎన్‌డీసీ ద్వారా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేశారు. ప్రత్యేక కేటగిరీ ప్రకటించేందుకు అనేక కారణాలు, అవసరాల ఆధారంగా వర్గీకరించారు. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. బీహార్ రాష్ట్ర పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతకుముందు.. గతంలో ప్రత్యేక కేటగిరీ హోదా కోసం బీహార్ చేసిన అభ్యర్థనపై.. అంతర్గత మంత్రుల గ్రూపు సమగ్ర పరిశీలన చేసి.. 2012 మార్చి 30 వ తేదీన తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పటికే నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రమాణాల ఆధారంగా.. అంతర్గత మంత్రుల గ్రూపు.. బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించేందుకు ఎలాంటి సూచనలు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో పార్లమెంటు ముందు ఉంచారు.

దీంతో ఎన్డీఏలో చక్రం తిప్పవచ్చని.. తమ డిమాండ్లు కేంద్రం వద్ద నుంచి సాధించవచ్చని ఇన్ని రోజులు భావించిన నితీష్ కుమార్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఇటీవలె నితీష్ కుమార్ సర్కార్ ఆమోదించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం.. బీహార్‌కు ప్రత్యేక హోదా లేదని తేల్చేయడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇక పార్లమెంటు సమావేశాలకు ముందు నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌లో బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ను ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు వినిపించాయి. జనతాదళ్ యునైటెడ్ నుంచి సంజయ్ కుమార్ ఝా..

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్.. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు కూడా తమ గళం వినిపించాయి. అయితే ప్రత్యేక హోదా కల్పించడం వీలు కాని పక్షంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అయినా బీహార్‌కు ఇవ్వాలని సంజయ్ కుమార్ ఝా తెలిపారు.

శాంతి వివాదంలో మరో టర్న్! భర్తెవరో చెప్పాలని మెమో-సాయిరెడ్డి ట్వీట్ పైనా..!

ఏపీ దేవాదాయశాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన కాళంగిరి శాంతి భర్త వివాదంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తన భార్యకు కలిగిన సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ గతంలో దేవాదాయశాఖకు ఆమె భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు నీ భర్తెవరో చెప్పాలంటూ ఆమెకు అధికారులు మెమో జారీ చేశారు. అసలు ఆమె భర్త వివాదం, దాని వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు కలుగుతున్న భంగం, ఆమె వ్యవహారశైలిపై పూర్తి వివరణకు ఆదేశించారు.

దేవాదాయశాఖలో ఉద్యోగంలో చేరిన 2020లో తన భర్త పేరు కె మదన్ మోహన్ గా సర్వీస్ రిజిస్టర్ లో పేర్కొన్న శాంతి.. గతేడాది ప్రసూతి సెలవుకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనూ ఇదే చెప్పారు.

అయితే తాజాగా ప్రెస్ మీట్ పెట్టి పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చెప్పడం, అంతకు ముందే ఆమె సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు ఆమెకు మెమో జారీ చేశారు. ఇందులో నీ భర్తెవరో చెప్పాలంటూ ఆదేశించారు.

విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమంటూ, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు మెమో పంపారు. దీంతో పాటు మరో 6 అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికే సస్పెండ్ చేస్తూ 9 అభియోగాలు మోపిన అధికారులు.. ఇప్పుడు తాజాగా మరో 6 అభియోగాలు మోపారు.

ఇందులో భర్త పేర్లు మార్చడం, దేవాదాయశాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం, కమిషనర్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం, సాయిరెడ్డిపై గతేడాది పెట్టిన ట్వీట్, విశాఖలో అపార్ట్ మెంట్ ఫ్లాట్ ఓనర్లతో గొడవ, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఆలయ దుకాణాలు, భూముల లీజుల పొడిగింపు వంటివి ఉన్నాయి.

విజయసాయిరెడ్డితో శాంతి అనుబంధంపై ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేస్తున్న వేళ గతేడాది మే 28న ఆమె పెట్టిన ట్వీట్ పై అభియోగం నమోదైంది. ఇందులో ఆమె.. "ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్. మీరు పార్టీకి వెన్నెముక" అంటూ పెట్టిన ట్వీట్ పై అభియోగం మోపారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ఈ ట్వీట్ పెట్టారని అందులో పేర్కొన్నారు. మరోవైపు శాంతి డిప్యూటీ కమిషనర్ గా విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో పనిచేసినప్పుడు చేసిన అక్రమాలపై విచారణకు అధికారులతో మరో కమిటీ వేశారు.

మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్లా?!

తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్‌ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’

అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తుంది? పంటల దిగుబడి ఎంత

ఆ నీటితో తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని?’ అంటూ ఎక్స్‌ వేదికగా ఆదివారం ఆయన నిలదీశారు.

మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు.. మొన్న.. రూ.50వేలకోట్లు అయితుందన్నారు. నిన్న రూ.70వేల కోట్లు వెచ్చిస్తామన్నారు.

ఇప్పుడు ఏకంగా రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు.. పదిహేను పక్కన ఇన్ని సున్నాలా.. అంటూ అంకెలను సూచిస్తూ ఆయన ఎద్దేవా చేశారు.

పుట్టిన గడ్డపై మమకారం లేని సీఎం రేవంత్‌రెడ్డికి.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా..

మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువో చెప్పాలన్నారు. మూసీ అంచనా వ్యయాన్ని సీఎం మూడింతలు పెంచడం కాంగ్రెస్‌ ధన దాహానికి సజీవసాక్ష్యమని విమర్శించారు.

రైతుబీమా దరఖాస్తులకు ఆగస్టు 5 గడువు

రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది.

రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.

ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది.

ఈ నెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

అర్హులైన రైతులు పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదా డిజిటల్‌ సంతకం చేసిన డీఎస్‌ పేపర్‌, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.