జగన్ ‘కారు’ కథలు!
మా నాయకుడికి కేటాయించిన కారు మాటికీ మాటికీ ఆగిపోతోంది’ అంటూ వైసీపీ రచ్చ చేసింది. చివరికి... కారు బాగానే ఉందని, వైసీపీయే ఎప్పట్లాగా తప్పుడు కోతలతో యాగీ చేసిందని రుజువైంది. అసలేం జరిగిందంటే... వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి వినుకొండ ఎమ్మెల్యే పెంచి పోషించిన ‘గ్యాంగ్’ వార్ కారణంగా రషీద్ అనే యువకుడు హత్యకు గురయ్యారు. దీనిని రాజకీయం చేసిన జగన్...
రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శుక్రవారం వినుకొండ పర్యటనకు బయలుదేరారు. జగన్ భద్రత రీత్యా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎ్‌సడబ్ల్యూ) బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ కారు ఏర్పాటు చేసింది
శుక్రవారం ఉదయం 10.05 గంటలకు తాడేపల్లి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన జగన్ కేవలం ఐదు నిమిషాల్లోనే కిందికి దిగారు. వైసీపీ నాయకుడికి చెందిన ఫార్చూనర్‌లో కూర్చున్నారు. అంతే... వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. ‘‘జగన్‌కు కేటాయించిన కారు అడుగడుగునా ఆగిపోతోంది. మాజీ సీఎంకు భద్రత కల్పించేది ఇలాగేనా? ఇది పోలీసుల వైఫల్యమే’’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఇక... జగన్ కూలి, నీలి మీడియా కూడా ఇదే పాట పాడాయి. నిజానికి... ప్రభుత్వం జగన్ పర్యటనకోసం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ సఫారీ వాహనం ఎక్కడా ఆగలేదు. ఆయన కాన్వాయ్‌లోనే వినుకొండ దాకా రయ్య్‌మని దూసుకెళ్లింది.
జగన్ పర్యటన కోసం కేటాయించిన సఫారీ (ఏపీ 39 పి0014) పూర్తి కండీషన్‌లో ఉంది. ఎన్నికల్లో విజయం సాధించే వరకూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు అందులోనే ప్రయాణించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు... అక్కడి నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వరకు ఇందులోనే ప్రయాణించారు. ‘చంద్రబాబు వాడిన కారు నేను ఎక్కడమేమిటి’ అనుకున్నారో ఏమో! ఎక్కిన ఐదు నిమిషాల్లోనే జగన్ అందులో నుంచి దిగిపోయారు. రచ్చ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.
జగన్ పర్యటన కోసం టయోటా ఫార్చూనర్ లేదా ల్యాండ్ క్రూజర్ ప్రడో పంపాలని తాడేపల్లి నుంచి ఐఎ్‌సడబ్ల్యూకు ఫోన్ వెళ్లింది. అయితే... ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బుల్లెట్ ప్రూఫ్ సఫారీని కేటాయించారు. అది కూడా విజయవాడలో సిద్ధంగా లేకపోవడంతో విజయనగరం నుంచి తెప్పించారు. గురువారం రాత్రి 11 గంటలకు అక్కడ బయలుదేరిన సఫారీ... ఉదయానికి తాడేపల్లి చేరుకుంది. పూర్తి కండిషన్‌లో... ఎక్కడా ఆగకుండా పరుగులు తీసింది. కానీ... జగన్ ఎక్కిన ఐదు నిమిషాల్లోనే అది బ్రేక్‌డౌన్ అయ్యిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేసింది.
అదే వాహనం జగన్ కాన్వాయ్‌లో వినుకొండ వరకు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లిందంటూ ఐఎ్‌సడబ్ల్యూ వీడియో ఆధారాలు కూడా చూపించింది. ‘‘మొన్నటిదాకా ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ క్రూజర్ ప్రడో కారులో ప్రయాణించిన జగన్‌కు...
బహుశా ఇప్పుడు ‘సఫారీ’ ప్రయాణం నచ్చలేదేమో! మాజీ అయిన తర్వాత కూడా అదే దర్పం ప్రదర్శించాలంటే ఎలా? సెక్యూరిటీ రివ్యూ కమిటీ-2024 నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్‌కు భద్రత కల్పిస్తున్నాం. సీఎంగా ఉండగా ప్రధాని తరహాలో ఆయన ఏర్పాటు చేసుకున్న స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(ఎ్‌సఎ్‌సజీ)ను కొనసాగించేందుకు నిబంధనలు అంగీకరించవు’’ అని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి
Jul 20 2024, 12:59