అక్కడ గేట్లు ఎత్తివేత- శ్రీశైలానికి వరద
కర్ణాటక సహా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఫలితంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ఠస్థాయి నీటిమట్టాన్ని అందుకుంది.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి.
భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ, బెళగావి, హవేరి, విజయపురా, బాగల్‌కోటె, కలబురగి, బళ్లారి.. వంటి జిల్లాల్లో అతి భారీగా వర్షాలు కురుస్తోన్నాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే. అటు మహారాష్ట్రలోనూ కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి.
ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనితో రెండు రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. జూరాల ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులుగా రికార్డయింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు.. ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం అందుకుంది. ఈ కొద్దిరోజుల్లోనే ఆరు టీఎంసీలకు పైగా వరదనీరు జూరాలకు వచ్చి చేరింది.
Jul 20 2024, 12:36