జలాశయాల నుంచి నీరు విడుదల
జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీకరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయంలోకి గురువారం వరదనీరు పోటెత్తింది. జలాశయం నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.40 మీటర్లు వరకు నీరు చేరిందని ఇరిగేషన్ ఏఈ సీహెచ్.భాస్కరరావు తెలిపారు
జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీకరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయంలోకి గురువారం వరదనీరు పోటెత్తింది. జలాశయం నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.40 మీటర్లు వరకు నీరు చేరిందని ఇరిగేషన్ ఏఈ సీహెచ్.భాస్కరరావు తెలిపారు. గంటకు 72,111 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతుండగా జలాశయం గేట్లు తెరచి 10,239 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదిలినట్టు తెలిపారు. ఎర్ర కాలువ దిగువ ఉన్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల, తాడేపల్లి గూడెం, నిడదవోలు మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జల వనరుల శాఖాధికారులు సూచించారు.
జల్లేరు జలాశయం నుంచి 1,500 క్యూసెక్కులు..
బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయంలోకి వరద ఉధృతి పెరగడంతో గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్ డీఈ ఆనంద్, ఏఈలు సురేష్, తులసీ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలోకి 3 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, జలాశయం పూర్తి నీటిమట్టం 217.80 ఎంటీఎస్ కాగా ప్రస్తుతం 215 ఎంటీఎస్‌లకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద నీరు
చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం వద్ద ఉన్న తమ్మిలేరు రిజ ర్వాయర్‌కు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 336.33 అడుగులు ఉంది. ఎగువ నుంచి 858 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ఎగువ తెలంగాణలో వర్షాలు పడుతున్నందున శివపురం వద్ద వంతెనకు ఆనుకుని వాగులో వరద నీరు వస్తోంది. తమ్మిలేరు రిజర్వాయర్, గోనెలవాగు రెండుబేసిన్‌లు ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వచ్చిన వరద నీరు తమ్మిలేరు రిజర్వాయర్‌లో చేరి అక్కడి నుంచి గోనెలవాగులోకి చేరు తుంది. రెండు బేసిన్‌లు నిండిన తరువాత 348 అడుగులు దాటితే వరద నీరు దిగువకు విడుదల చేస్తామని ప్రాజెక్టు ఏఈ పరమానందం తెలిపారు.
బుట్టాయగూడెం : అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణఽశాఖ హెచ్చరికలు జారీచేయడంతో ఈనెల 19న ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించామని కేఆర్ పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ తెలిపారు. గురువారం ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో పీవో పర్యటించి ముందు జాగ్రత్తలను వివరించారు.
Jul 19 2024, 19:13