Supreme Court: కఠిన చట్టాల పేరుతో బెయిలివ్వకుండా ఆపలేరు: సుప్రీం
నేర శిక్షాస్మృతిలోని కఠిన చట్ట నిబంధనలు నిందితులకు బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమైనవీ, పవిత్రమైనవని తేల్చి చెప్పింది.
నేర శిక్షాస్మృతిలోని కఠిన చట్ట నిబంధనలు నిందితులకు బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమైనవీ, పవిత్రమైనవని తేల్చి చెప్పింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) కింద అరెస్టయిన నేపాలీ పౌరుడు షేక్ జావేద్ ఇక్బాల్‌కు బెయిలు మంజూరు చేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఎంత కఠినమైన శిక్షాస్మృతి చట్ట నిబంధన అయినా దాని అర్థాన్ని తీసుకొనే సమయం లో రాజ్యాంగ న్యాయస్థానం(హైకోర్టు, సుప్రీంకోర్టు) రాజ్యాంగ విలువలకు, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలని చెప్పింది. ఆ రెండింటిలోనూ వ్యక్తి స్వేచ్ఛ అంతర్లీనంగా ఉంటుందని వివరించింది.
ఈ నేపాలీ వ్యక్తి కేసులో రాజ్యాంగ న్యాయస్థానం బెయిలు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు కానీ ఫలానా చట్టం కింద బెయిలు ఇవ్వడం కుదరదని చెప్పడం తప్పే అవుతుందని స్పష్టం చేసింది. ఇక్బాల్ నేపాల్లో భారతదేశపు నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు అంగీకరించాడని పోలీసులు ప్రకటించారు.
అతని మీద 489(బి), 489(సి) కింద నకిలీ నోట్లు ఉంచుకున్నాడని, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడని కేసు పెట్టారు. దానికి తీవ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని జోడించారు. ఇక్బాల్ తొమ్మిదేళ్లుగా కస్టడీలో ఉన్నాడని, ఈకేసు ఇప్పట్లో తేలే వాతావరణం కనబడటం లేదని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇక్బాల్ తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడని, నేపాలీ పౌరుడు అయినందున దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. నత్తనడకన నడుస్తున్న ఈ కేసు ఎప్పట్లోగా తేలుతుందో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది. పాస్‌పోర్టు, పౌరసత్వ పత్రాలను తీసుకొని అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే స్వాధీ నం చేసుకుంటే ట్రయల్ కోర్టుకు అప్పగించాలని పేర్కొంది. ట్రయల్ కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని నిందితుడికి చెప్పింది. విచారణ పూర్తయ్యే దాకా పక్షం రోజులకు ఒకసారి పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలని ట్రయల్ కోర్టు నిబంధన పెట్టొచ్చని సూచించింది.
Jul 19 2024, 15:28