రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం
సార్వత్రిక ఎన్నికల్లో బొటా బొటి మెజారిటీయే రావడం, మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి జోరుమీద ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా ఆలోచనలో పడ్డారు.
ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థలను విక్రయించడంమీద దృష్టిసారించగా ఇప్పుడు మాత్రం ప్రయివేటీకరించకుండా వాటికి కాయకల్ప చికిత్స చేద్దామని భావిస్తున్నారు. అలాగే భారతీయ రైల్వేలో టికెట్లపై సీనియర్ సిటిజన్లకు వర్తించే రాయితీని కరోనా సమయంలో రద్దు చేశారు. రాబోయే బడ్జెట్ లో దాన్ని పునరుద్ధరించే అవకాశం కనపడుతోంది.
ఉచితాలు, రాయితీలకు నిర్మల వ్యతిరేకం కరోనా ముందు వరకు 58 సంవత్సరాలు దాటిని మహిళకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు ప్రయాణ టికెట్లలో 50 శాతం, 40 శాతం చొప్పున రాయితీ ఇచ్చేవారు.
రాయితీని తొలగించడంవల్ల సీనియర్ సిటిజన్లు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మెప్పు పొందాలని భావిస్తున్న మోడీ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించబోతోంది. ఈనెల 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. వాస్తవానికి ఉచితాలు ఇవ్వడం, రాయితీలు ఇవ్వడంలాంటివి ఆమెకు ఇష్టం ఉండదు.
వ్యాపార ధోరణితో కేంద్రం దాదాపుగా అన్ని రైళ్లల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇచ్చేవారు. వీటిని తొలగించిన తర్వాత రైల్వేకు రూ.2242 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రజల అవసరాలు తీర్చడానికి, వారికి భారం కాకుండా ఉండేందుకు రాయితీలు వర్తింపచేస్తూ పాలన కొనసాగించాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార ధోరణితో వాటిని ఎత్తేసి ముక్కుపిండి వారినుంచి డబ్బులు వసూలు చేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవడంలేదు.
ఎన్నికల్లో మెజారిటీ రాకపోవడం, ఉప ఎన్నికల్లో ఓడిపోవడంలాంటివన్నీ చూసి కేంద్ర పెద్దల మనసు మారింది. అవసరం రీత్యా వీరికి మనసు మారిందేకానీ నిజంగా సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలనే మంచి ఉద్దేశం మాత్రం లేదని ఇండియా కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం భారతీయ రైల్వే.. రకరకాల కేటగిరీల్లో ప్రయాణికులకు రాయితీలు, తగ్గింపులూ ఇస్తోంది. వీరిలో దివ్యాంగులు, 11 రకాల కేటగిరీల పేషెంట్లు, 8 రకాల కేటగిరీల విద్యార్థులూ ఉన్నారు. ఇంతమందికి ఇస్తున్నప్పుడు మాకు కూడా ఇవ్వొచ్చుగా అని సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే స్వయంగా చెప్పారు. అందువల్ల ఈ బడ్జెట్‌పై సీనియర్ సిటిజన్లు దృష్టి పెడుతున్నారు. గుడ్ న్యూస్ వస్తే పండగే
Jul 16 2024, 09:03