బీసీలు పాలితులేనా?..పాలకులయ్యేదెప్పుడు? -వేముల మహేందర్ గౌడ్
బీసీలు పాలితులేనా?..పాలకులయ్యేదెప్పుడు? - వేముల మహేందర్ గౌడ్*
బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు -వేముల మహేందర్ గౌడ్
[జయశంకర్ భూపాలపల్లి జిల్లా Crime journalist ] :
(తెలంగాణ రాష్ట్రం):- దేశంలో నేటికీ బీసీల భవితవ్యం కోసం జరగాల్సినంత కృషి జరగలేదు. రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశాయి తప్ప, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి అంటే ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్‌లు ప్రకటించి చేతులు దులిపేసుకోవటమేనని గత 8 దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం. దేశానికి స్వాతంత్య్రం వస్తే బహుజన మహాజనావళికి ఏం చేస్తారో చెప్పాలని 150 ఏండ్ల కిందటే మహాత్మా జ్యోతిబా ఫూలే అడిగిన ప్రశ్నకు నేటికీ సమాధానం దొరకలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ..బీసీలకు అన్ని రంగాల్లో రావాల్సిన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం మాత్రం ఇంకా రాలేదు.
బీసీలకు అన్ని రంగాల్లో దక్కాల్సిన వాటా దక్కలేదు. దేశంలో వలస భారతమంటే అది బీసీల కన్నీటి భారతమేనని చెప్పాలి. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల కులగణన ఇప్పటికీ జరగలేదు. కులగణన చేయాలన్న బీసీల డిమాండ్‌ను నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ మొదలుకొని నేటి ప్రధాని మోదీ వరకు అందరూ పక్కన పెట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ చెప్తున్నారంటే కులగణన డిమాండ్‌ను ఇంతకాలం పాలకులు ఎంతలా తొక్కిపెట్టారో బీసీలకు బాగా అర్థం అయ్యింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ర్టాల్లోని పాలకులదీ అదే రీతి.బీసీల అభ్యున్నతికి పాటుపడకపోగా, బీసీ కులాలన్నీ ఐకమత్యంగా ఉండవని, ఎప్పటికీ కలవవని, బీసీలు సమీకృతం కాకుండా కొన్ని పాలకపక్షాలు విష ప్రచారం చేస్తూ వచ్చాయి. దీన్ని తిప్పికొట్టి బీసీలంతా ఒక్కతాటిపై నిలిచి కులగణన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. కులగణన చేసి చట్టసభల నుంచి స్థానిక సంస్థల దాకా బీసీల జనాభా దామాషా ప్రకారం సీట్లివ్వాలి. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో జమిలిగా ఉద్యమాలు జరగాలి. అది మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన అహింసామార్గంలో శాంతియుత మహోద్యమంగా మారాలి. ఈ మానవహక్కుల ఉద్యమానికి పౌరహక్కుల, మానవహక్కుల ఉద్యమకారులంతా తోడై వస్తారు. అధికార పార్టీలో ఉన్నవారి దగ్గర్నుంచి అన్ని పార్టీల్లో ఉన్న బీసీలంతా ఒక్కటి కావాలి. ఇప్పటిదాకా మనం అన్ని పార్టీల జెండాలను మోశాం.
మన బలం, మన మద్దతు లేకుండా ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి, ఏ స్థానిక సంస్థల పదవైనా చేపట్టలేరు. బీసీలు లేకుండా దేశంలో ఏ ఉద్యమమైనా, ఏ పోరాటాలైనా ముందుకుసాగవు. ఇప్పటి దాకా అన్ని ఉద్యమాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉన్న వారి దగ్గర్నుంచి అన్నలు ట్రిగ్గర్ నొక్కే వేళ్ల వరకు అన్నింటిలో మనమే ముందుండి, అన్ని పోరాటాలకు మన గొంతుకలనిచ్చి గర్జించాం. ఇప్పుడు మన కోసం, కులగణన కోసం, మన హక్కుల కోసం గొంతెత్తి భాస్వరాలమై భగ్గుమందాం.
ఇప్పటిదాకా అందరికీ జైకొట్టినం. ఇకపై మన అస్తిత్వ సామాజిక ఉద్యమానికి జైకొట్టి కదులుదాం. సై కొట్టి సాగుదాం. ఎన్నెన్నో తిరుగుబాట్లకు పురుడుపోసిన మనం, మన కోసం, మనం తిరుగుబాటు జన జాతరలను చేద్దాం. మన ఉద్యమ వ్యూహరచనను మనమే రచించుకుందాం. కులగణన చేయకుండా పక్కనపెట్టిన కుట్ర రాజకీయాలను చేధించాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని నెలకొల్పాలి. బీసీల హక్కుల కోసం మనకు మనంగా సమీకృతమవుతున్న సందర్భంలో బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసుకుందాం.అనేక దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం ఉద్యమిస్తున్న అక్కలు, అన్నలు ఎందరెందరో ఉన్నారు. బీసీల జీవితాలు బాగుపడాలని బహుజన తాత్త్వికతతో నిలబడ్డ యోధులు, పోరాడి అసువులు బాసిన వాళ్లు, బీసీల హక్కుల కోసమే తపిస్తూ జీవితాలను అంకితం చేసి పనిచేస్తున్న వాళ్లెందరో ఉన్నారు. వాళ్లందరికీ పాదాభివందనాలు. బీసీలుగా మనందరం కలిసి కులగణన కోసం కలబడే సమయం ఆసన్నమైంది. మనల్ని విడదీయాలని కుట్రలు చేసే శక్తుల్ని ఒక కంట కనిపెడుతూ సామూహిక స్వరంగా ముందుకు సాగాలి. రాష్ట్రంలో ఎవరికి వాళ్లుగా ఉన్న మన బీసీ సంఘాలన్నీ ఒక్కటై నిలిస్తే మనకంటే శక్తిమంతమైన సంఘం మరొకటి ఉండదు. పోలీసుల దగ్గర్నుంచి ఐటీ సెక్టార్ వరకు, రాష్ట్ర సచివాలయం దగ్గర్నుంచి స్థానిక సంస్థల వరకు, పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల దగ్గర్నుంచి సింగరేణి బొగ్గును మండించే గని కార్మికుల వరకు పనిచేసే శక్తులలో సగానికి పైగా బీసీలేనని మరువకండి. సంపద పంచే చేతులు మనవే. వాటిని పొందాల్సింది మనమే.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీసీలు, బీసీ జనగణన గురించి రాజకీయ పార్టీలు గొంతెత్తి మాట్లాడతాయి. కానీ, అమలులో వాటికి చిత్తశుద్ధి ఎంత ఉందో చూడాలి. అదేందో గానీ, ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకువస్తారు. మ్యానిఫెస్టోల్లో గాంభీర్యంగా బీసీలకు వరాలు ప్రకటిస్తారు. బీసీలపై డిక్లరేషన్‌లు తెస్తారు. అది కామారెడ్డి, నాగపూర్ కాంగ్రెస్ డిక్లరేషన్ కావచ్చు, 2019 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో కావచ్చు. కాకా కాలేల్కర్ కమిషన్ వేసి ఆ నివేదికను బుట్టదాఖలు చేసిన నెహ్రూ దగ్గర్నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు బీసీ జనగణన కోసం చేసిందేమీ లేదు.బీసీల మొగ్గు ఎటువైపు ఉంటే అటువైపే ఎన్నికల్లో విజయం ఉంటుంది. ఈ లెక్కలు రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. అందుకే, ఎన్నికల ముందు బీసీల అభ్యున్నతే తమ ధ్యేయమని ఊదరగొడతాయి. బీహార్‌లో నితీశ్ ప్రభుత్వం ఉదంతమే దీనికి ఉదాహరణ. నితీశ్ సర్కార్ జనగణన చేస్తే.. కొంతమంది కోర్టులను ఆశ్రయించి దాన్ని అమలవకుండా అడ్డుతగిలారు. దీంతో ‘మేం బీసీ జనగణన చేశాం. కానీ, ఆ విషయం కోర్టుల పరిధిలో ఉన్నది. తీర్పు వచ్చాక పరిశీలిద్దాం’ అని నితీశ్‌కుమార్ తప్పించుకున్నారు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రమే బీసీ జనగణనకు సిద్ధం కావాలి.బీసీల హక్కుల కోసం తమ జీవితాలను అంకితం చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్.కృష్ణయ్య, ప్రొ.తిరుమలి, ప్రొ.సింహాద్రి, ప్రొ.మురళీమనోహర్ జోషి, తదితరులు చేస్తున్న ఉద్యమాలు, విజ్ఞప్తులను ప్రభుత్వాలు వింటున్నట్టు నటిస్తాయి. కాని వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు వెతకరు. బీసీల హక్కులు ఎందుకో ఈ దేశంలో ప్రగతిశీలవాదులకు మానవహక్కుల్లా, పౌరహక్కుల్లా కనిపించవు.బీసీల జనగణన జరిగితే దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. పార్లమెంట్, అసెంబ్లీల నుంచి స్థానిక సంస్థల వరకు అన్నింటిలో సగానికిపైగా బీసీలే ఉంటారు. అలా జరగకూడదనే నామినేటెడ్ పదవులను ఎరగా వేసి పబ్బం గడుపుకొంటున్నాయి. బీసీల కులగణన చేస్తామని, జనాభా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
Feb 07 2024, 07:47