చీకట్లో జీవోలు
వివిధ శాఖల్లో పని చేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు 10 ప్రభుత్వ శాఖల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తూ ఏప్రిల్ 30న రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో నంబర్ 38ను జారీ చేసింది. వాస్తవంగా అయితే ఈ జీవో.. ప్రభుత్వ వెబ్‌సైట్ అయిన http://goir.telangana.gov.inలో కనపడాలి. కానీ కనిపించట్లేదు.
ఐఏఎస్ అధికారులు కోరెం అశోక్‌రెడ్డి, బి.గోపి, ఆశిష్ సంగ్వాన్‌లను బదిలీ చేసి, పోస్టింగులిస్తూ ఏప్రిల్ 28న సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జీవో నంబర్ 613 జారీ చేసింది. మరో ఇద్దరు ఐఏఎ్‌సలు కె.హైమావతి, ఎం.సత్య శారదా దేవి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని అందులోనే ఆదేశించింది. ఇదీ కనిపించుట లేదు.
మహారాష్ట్రకు చెందిన శరద్ మర్కడ్‌ను ముఖ్యమంత్రి ప్రైవేటు సెక్రటరీ(పీఎ్‌స)గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 647 జారీ చేసింది. ఈ జీవోను మే 2న జారీచేసినట్లు పేర్కొన్నప్పటికీ... శుక్రవారం (5న) వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటకు వచ్చింది.
..ఇలా చెప్పుకొంటూ పోతే మరెన్నో! తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సిన ఇలాంటి జీవోలు చాలానే సర్కారీ వెబ్‌సైట్‌లో కనిపించట్లేదు. ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా జీవో రూపంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ, పలు ముఖ్యమైన జీవోలను ప్రభుత్వం దాచిపెడుతోంది. ఇప్పుడే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం తీరు ఇలాగే ఉంది. ప్రభుత్వ పథకానికి సంబంధించినవి, భూసేకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్, బదిలీలు, నియామకాలు, నిధుల విడుదల, ఉద్యోగాలకు అనుమతి, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... ఇలా ప్రతి కీలకమైన జీవోను దాచి పెడుతోంది. వాట్సాప్ గ్రూపులు లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వాట్సాప్ గ్రూపు ద్వారామాత్రమే వాటిని బయటపెడుతోంది. అదీ ప్రభుత్వానికి ఇబ్బంది లేదనుకునే జీవోలను మాత్రమే వాట్సాప్ గ్రూపుల ద్వారా బయటకు తెస్తున్నారు. వివాదాస్పద జీవో అనుకుంటే.. దానిని అసలు బయటే పెట్టడం లేదని, ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
పారదర్శకత కోసం
పాలనలో పారదర్శకతే లక్ష్యంగా చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో పెట్టడం ప్రారంభించాయి. ఈ కోవలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా http://goir.telangana.gov.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో 32 శాఖలకు సంబంధించిన జీవోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ శాఖలన్నింటి నుంచీ కలిపి ఏటా 6000 నుంచి 8000 దాకా జీవోలు వెలువడుతుంటాయి. అయితే, వీటిలో.. ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరు, ముఖ్యమైన నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణలు, వివిధ కమిషన్ల ఏర్పాటు, ఐఏఎ్‌సలు, ఇతర అధికారుల బదిలీలు, పదవీ బాధ్యతల అప్పగింత, వివిధ రకాల అనుమతులు, ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు మార్పులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోస్టుల భర్తీకి అనుమతులు వంటి అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన జీవోలను మాత్రం ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయట్లేదు.
హైకోర్టు సీరియస్
2014 జూన్ 2 నుంచి 2019 ఆగస్టు 15 వరకు మొత్తం 1,04,171 జీవోలు వెలువడగా.. వాటిలో 43,462 జీవోలను వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదంటూ 2019లో పేరాల శేఖర్‌రావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) వేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. ప్రజలకు తెలియాల్సిన జీవోలను ఎందుకు దాచిపెడుతున్నారంటూ అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను ప్రశ్నించింది. మిస్సింగ్ జీవోలన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. అలాగే.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకానికి సంబంధించిన జీవోను సైతం వెబ్‌సైట్‌లో పెట్టకపోవడంతో.. ‘వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిల్ వేసింది. దీనిపై 2021 ఆగస్టులో స్పందించిన హైకోర్టు... 24 గంటల్లో జీవోను అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. అయినా సర్కారు తీరులో ఎలాంటి మార్పూ లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 5 వరకు మొత్తం 35 రోజుల్లో దాదాపు 250 వరకు జీవోలు వెలువరించినట్లు సమాచారం. కానీ.. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించని 163 రొటీన్ జీవోలు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చేఅవకాశం లేని జీవోలు కాబట్టే వాటిని ప్రభుత్వం అప్‌లోడ్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
May 07 2023, 10:06