ఉమెన్స్ డే సందర్భంగా దేశ మహిళలకు మోదీ కానుక ఇదేనా?: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: గ్యాస్ ధరల (Gas cylinder Price) పెంపునకు నిరసనగా ఎల్లుండి (శుక్రవారం) అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (Minister KTR) పిలుపునిచ్చారు.
మంత్రులు, భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోదీ (PM Modi) సిలిండర్ ధరలు (Gas Cylinder) పెంచారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు.
గృహావసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.350 మేర పెంచడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1200లకు చేరుకుందన్నారు. పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర సరకుల ధరలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పార్టీ నేతలకు కేటీఆర్ వివరించారు.
ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా, కేంద్రాన్ని నిలదీస్తూ ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం ధరలు పెంచుతున్న తీరును ప్రజలకు వివరించాలన్నారు. ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయ మాటలు చెప్పిన భాజపా ప్రభుత్వం.. మరోవైపు గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ ప్రజలకు సిలిండర్‌ను దూరం చేస్తోందని మండిపడ్డారు. ఉజ్వల పథకంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ కూడా ఇప్పుడు సిలిండరు కొనలేక పొయ్యిపై వంట చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Mar 02 2023, 11:09