చారిత్రక కట్టడం నేలమట్టం
కాలగర్భంలో కలిసిన మహబూబ్‌నగర్ పాత కలెక్టరేట్ భవనం
ఉమ్మడి జిల్లాకేంద్రం మహబూబ్‌గర్‌లోని పాత కలెక్టరేట్ భవనం నేలమట్టమైంది. నిజాం నవాబుల కాలంలో నిర్మితమై చారిత్రక కట్టడంగా విరాజిల్లుతూ 8 దశాబ్దాలకు పైగా పాలన కేంద్రంగా ఉన్న ఈ భవనం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ భవన నిర్మాణానికి 1931లో శంకుస్థాపన చేసి 1936లో ప్రారంభించారు. నిజాం నవాబుల పరిపాలనలో ఉండే 12 శాఖల అధికారులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. పాలమూరు జిల్లా 8 తాలుకాలతో ఉండేది. అప్పట్లో నాగర్‌కర్నూల్ కేంద్రంగా పరిపాలన సాగేది. జనాభా పెరగడం, గ్రామాలు విస్తరించడంతో మరో రెండు తాలుకాలు కొత్తగా ఏర్పాటుచేయగా పాలమూరు జిల్లా ఆవిర్భవించింది. తర్వాత 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ గౌరవార్థం 1890లో పాలమూరు పేరును మహబూబ్‌నగర్‌గా మార్చారు. కలెక్టరేట్(పాత) భవన నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
1948లో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం కావడంతో అప్పటి నుంచి ఈ భవనం ద్వారానే ప్రభుత్వ పాలన మొదలైంది. 1960-61 నుంచి ఇప్పటి వరకు ఈ భవనం నుంచి 45 మంది కలెక్టర్లు పరిపాలన అందించారు. 2022 డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ భూత్పూర్ రోడ్డులో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయడంతో పాత కలెక్టరేట్ భవనాన్ని ఖాళీ చేశారు. శిథిలావస్థకు చేరిందంటూ మంగళవారం కూల్చివేశారు.
ఆసుపత్రి నిర్మించాలని..
చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న భవనాలను వారసత్వ సంపదగా చూడాలని, వాటిని కాపాడుకుంటూ గ్రంథాలయాలు, మ్యూజియం వంటి వాటికి వాడాలని జిల్లాలోని సీనియర్ సిటిజన్లు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్లకు పలు దఫాలుగా వినతిపత్రాలు అందజేశారు. ప్రభుత్వానికి మెయిల్స్ ద్వారా విజ్ఞాపనలు పంపించారు. అయినా ప్రభుత్వం పాత కలెక్టరేట్ భవనం కూల్చేందుకే నిర్ణయించడంపై జిల్లా ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం కోసం ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Mar 01 2023, 08:35