యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హర్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అయింది
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి హర్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అయింది
Streetbuzz news :నల్గొండ జిల్లా :
యాదగిరిగుట్ట; యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల 21 మాఘ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 3 వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు చేపట్టనున్నారు. కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో రూ. 1,250 కోట్లతో మహాద్భుతంగా రూపుదిద్దుకున్న ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం వస్తున్న తొలి బ్రహ్మోత్సవాలు అవడంతో కనీవినిఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓరామకృష్ణారావు తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కల్యాణోత్సవాన్ని గతంలో మాదిరి కాకుండా ఈసారి కొండపైన తిరుమాఢవీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 వేల మంది భక్తులు కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో వివరించారు.
కొండపైనే స్వామివారి తిరు కల్యాణం
ప్రధానాలయం ప్రాంగణంలోనే స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం చేపట్టనున్నారు. ప్రధానాలయం ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిఫ్ట్, రథశాల ప్రాంతంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 28న రాత్రి 8 గంటలకు తిరు కల్యాణోత్సవం జరుపనుండగా అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారం(హనుమంత సేవ), రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ నిర్వహించనున్నారు. ఇందుకోసం 56 ఫీట్ల పొడవు, 28 ఫీట్ల వెడల్పుతో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణ మండపం ఎదురుగా ఉత్తర మాఢ వీధుల్లో 10 వేల మంది భక్తులు కూర్చునే విధంగా వసతులు కల్పించనున్నారు. వీవీఐపీ, వీఐపీలతోపాటు కల్యాణంలో పాల్గొనే భక్తులు, అర్చకులు, డోనర్లు, మీడియా కోసం ప్రత్యేకమైన లాబీలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు కల్యాణతంతు స్పష్టంగా కనినిపించే విధంగా 8 ఎల్‌ఈడీ స్క్రీన్లను బిగించనున్నారు. స్వామివారి కల్యాణం చేయించుకునే భక్తులకు రూ. 3,000 టికెట్ ధరను నిర్ణయించారు. కల్యాణం అనంతరం దాతలకు శేష వస్త్రంగా ఒక ఉత్తరీయం, కనుము, అభిషేకం లడ్డూ, 2 వడలు ప్రసాదంగా ఇవ్వనున్నారు. గతంలో స్వామివారి కల్యాణం ఉదయం కొండకింద పాత హైస్కూల్ మైదానంలో నిర్వహించేవారు. పునర్నిర్మాణం అనంతరం ప్రధానాలయంతోపాటు ఆలయ మాఢ వీధులు విశాలంగా ఉండడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను కొండపైనే నిర్వహిస్తున్నారు.
కల్యాణోత్సవంలో పాల్గొననున్న ప్రముఖులు
స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 28న రాత్రి 8 జరిగే తిరు కల్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొననున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణరావు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అలోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
కొండపైకి 10 నిమిషాలకో బస్సు
బ్రహ్మోత్సవాలకు బస్సు మార్గంలో వచ్చే భక్తులకు ఆటంకం కలుగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, వివిధ ప్రాంతాల నుంచి నుంచి భక్తులు ఎక్కువగా వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్- సికింద్రాబాద్ నుంచి ప్రతి అరగంటకు గుట్టకు ఒక బస్సు ఉన్నది. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి కూడా బస్సులు నడుస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి కొండపైకి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే 4 బస్సులు కొండపైకి నడుస్తుండగా అదనంగా మరో 3 బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
మొక్కు సేవలు రద్దు
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 21 నుంచి 3 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణ తెలిపారు. స్వామివారి రాత్రి నివేదన అర్చన తదుపరి 8.15 నుంచి 9.00 గంటల వరకు బలిహరణ, ఆరగింపు రద్దు చేయనున్నారు. 21వ తేదీ నుంచి మార్చి 3 సాయంత్రం వరకు భక్తులతో నిర్వహించే అర్చనలు, బాలభోగాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 27 నుంచి మార్చి 1 వరకు అభిషేకం, అర్చనలు రద్దు చేయనున్నట్లు చెప్పారు.
విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం
ఆలయ పునర్నిర్మాణంలో మరో అద్భుత కట్టడం విష్ణు పుష్కరిణి. కొండపైన క్యూ కాంప్లెక్స్ పక్కన రూ. 5.3 కోట్లతో దీనిని నిర్మించారు. పొడవు 19 మీటర్లు, వెడల్పు 21 మీటర్ల వెడల్పుతో మండపంతో నిర్మించిన పుష్కరిణిలో చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. చక్రతీర్థం అనంతరం స్వామివారికి వినియోగించిన శుద్ధ జలాలను ప్రచారం రథంతో ఊరేగింపుగా వెళ్లి కొండకింద లక్ష్మీ పుష్కరిణిలో కలుపుతారు. అనంతరం లక్ష్మీ పుష్కరిణిలో భక్తులకు పుణ్యస్నానాలకు అనుమతినిస్తారు.
వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఆలయాన్ని విశాలంగా కృష్ణ శిలలతో మహాద్భుతంగా నిర్మించారు. ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా మాఢ వీధులను తీర్చిదిద్దారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత మొదటిసారిగా జరిగే బ్రహ్మోత్సవాలు కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని ఆలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. ఆలయ ప్రధాన రహదారుల్లో లైటింగ్‌తో కూడిన స్వాగత తోరణాలు బిగించనున్నారు. ఇందుకు కావాల్సిన టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు.
వైటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా వైటీడీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం తూర్పు మాఢ వీధుల్లోని బ్రహ్మోత్సవ మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నారు. 24 నుంచి 27 వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. దీంతో పాటు వీఐపీ వాహనాల పార్కింగ్ ప్రాంతంలో దేవస్థానం ఆధ్వర్యంలో 26 నుంచి ఉదయం, సాయంత్రం సాంస్కృతిక, ధార్మిక, సంగీత, సాహిత్య సభలు ఉంటాయని ఆలయ డీఈఓ భాస్కర్‌శర్మ వెల్లడించారు.
రూ.1.50 కోట్లు కేటాయింపు
గతేడాది బ్రహ్మోత్సవాలకు రూ. 72 లక్షల ఖర్చు వచ్చింది. ఈ సారి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ. 1.50 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.50 లక్షలు ప్రధానాలయం, పురవీధులు, కొండకింద గల ప్రధాన రహదారి, పాత బస్టాండ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో డెకరేషన్ లైటింగ్‌కు వినియోగించనున్నారు. మరో రూ. 20 లక్షలు పూలు కొనుగోలు చేయనున్నారు. మరో రూ. 80 లక్షలు బ్రహ్మోత్సవాల్లో వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. ఈసారి చలువ పందిళ్లు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు.
మాఢవీధుల్లో అలంకార సేవలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అలంకార సేవలు ఈ నెల 23న ఉదయం 9 గంటలకు మత్స్యాలంకారంతో ప్రారంభం కానున్నాయి. మార్చి 1న ఉదయం 9 గంటలకు మహావిష్ణువు అలంకారంపై గరుఢ వాహన సేవతో సేవలు ముగుస్తాయి. మొదటి ప్రాకార మండపంలో స్వామివారి సేవలను అలంకరించనున్నారు. సేవలను ఉత్తర రాజగోపురం గుండా మాఢవీధుల్లో ఊరేగిస్తారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ఆస్థానం వద్ద భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అక్కడి నుంచి దక్షిణ భాగం మాఢ వీధుల గుండా పశ్చిమ రాజగోపురం, ఉత్తర గోపురం నుంచి సేవను లోపలికి ప్రవేశింపజేస్తారు.
Feb 15 2023, 12:58