టార్గెట్ పవన్, చంద్రబాబు.. షర్మిల సంచలన ట్వీట్
3 ఉచిత సిలిండర్లు ఇచ్చి.. ప్రజలను నుంచి డబ్బులు వసూలు చేయాలని కూటమి సర్కార్ ఆలోచిస్తుందన్నారు షర్మిల. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు పెంచడం దారుణమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 5న ఆందోళనకు పిలుపినిస్తున్నట్లు చెప్పారు.
కూటమి సర్కార్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో జనసేన, టీడీపీ, బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని కూటమి సర్కార్ గఫ్ఫాలు కొట్టుకుంటోంది అని అన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిపడ్డారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అని సెటైర్లు వేశారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు అని అన్నారు. ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుంది కదా అని ప్రశ్నించారు. దీపం - 2 కింద వెలుగులు పక్కన పెడితే .. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు అని ఫైర్ అయ్యారు. గత వైసీపీ చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా అని చురకలు అంటించారు. మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా అని నిలదీశారు.
మీకు వాళ్లకు ఏంటి తేడా. రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదని అన్నారు. బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురండి అని అన్నారు. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుందని అన్నారు.
Nov 03 2024, 09:40