తెలంగాణ సీఎం మార్పు వార్తలపై మంత్రి పొంగులేటి
తెలంగాణ సీఎం కుర్చీ మార్పు వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి పీరియడ్ ఇంకా నాలుగేండ్ల ఒక నెల ఉందని.. పూర్తి కాలం రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.
తెలంగాణలో సీఎం మార్పుపై గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పందించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సీఎం మార్పు ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి పీరియడ్ ఇంకా నాలుగేండ్ల ఒక నెల ఉందని.. పూర్తి కాలం రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని తెలిపారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అవి టీ కప్పులో తుఫాను మాత్రమే అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తామన్నారు. గ్రామ సభలు పెట్టి ఇండ్లను మంజూరు చేస్తామని.. నాలుగు విడతల్లో 5 లక్షలు పేమెంట్ చేస్తామన్నారు. ఫౌండేషన్ లెవల్‌కు లక్ష, లెంటల్ లెవల్‌కు 1.25 లక్షలు, స్లాబ్ లెవల్‌కు 1.75 లక్షలు, పూర్తి అయ్యాక లక్ష చెల్లిస్తామన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఇండ్లకు కూడా సహాయం చేస్తామన్నారు. ఈ నెల 20లోపు ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాను పంపిస్తాయన్నారు.
ఈ నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవుతుందని వెల్లడించారు. ఆ వెంటనే ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. కేంద్ర గృహ నిర్మాణ స్కీం అడాప్ట్ చేసుకుంటున్నామని.. పేద ప్రజలకు అన్యాయం జరగొద్దని కేంద్రం ఎన్ని కండిషన్‌లు పెట్టినా ఒప్పుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేంద్రం లోగో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలకు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
రాబోయే నాలుగేళ్లు 20 లక్షల ఇండ్ల నిర్మాణం టార్గెట్ పెట్టుకున్నామని.. తల తాకట్టు పెట్టైనా పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటి విడత ఇండ్లకు 26 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. సంక్రాంతి పండగ ముందు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
Nov 02 2024, 20:52