రాష్ర్టానికి రెడ్ అలర్ట్.. మరో రెండ్రోజులు అత్యంత భారీ వర్షాలు ‼️*
- కరీంనగర్‌లో కూలిన దేవాలయం పైకప్పు ..
- నల్లగొండలో కొట్టుకుపోయిన వంతెన
- ఇంటిపైకప్పు కూలి ఒకరు.. పిడుగుపాటుకు మరొకరు..
- కరెంట్‌షాక్‌తో ఇంకొకరు మృతి
- సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
- శ్రీశైలం ప్రాజెక్టుకు 4.10 లక్షల క్యూసెక్కుల వరద
- లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించండి
- కలెక్టరేట్లలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేయండి
- తక్షణ సహాయ చర్యలు చేపట్టండి: సీఎం రేవంత్
- అధికారులు సెలవులు పెట్టొద్దు: మంత్రుల ఆదేశాలు
- రెస్క్యూకు 24 బోట్లతో సిద్ధం: అగ్నిమాపకశాఖ
అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని దీంతో రాష్ర్టానికి రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న శనివారం తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని నాగరత్న తెలిపారు. ఈ జిల్లాలకు రెడ్ అలెర్జ్ జారీ చేశామని, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతెనే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఇండ్లలోకి నీరు చేరింది. రహదారులు చెరువులను తలపించాయి. కరీంనగర్‌లో శనివారం కురిసిన భారీ వర్షానికి 150 సంవత్సరాల పురాతన పాండురంగ దేవాలయం పైకప్పు కూలిపోయింది. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయం స్లాబ్ పైకప్పు, గోడలు విరిగి పడ్డాయి. డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆలయాన్ని పరిశీలించి, శిథిలాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. నల్లగొండలోని పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్‌లోకి వర్షపు నీరు చేరి రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. త్రిపురారం మండలం బాబుసాయిపేట వద్ద కొత్త వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే ఓసీ-2, 3 గనుల్లో వరద నీరు చేరి బురదయమై బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణి సంస్థకు దాదాపు రూ. కోటి మేర నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
విజయవాడకు వెళ్లే వాహనాల దారి మళ్లింపు...!
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను భారీ వర్షాల నేపథ్యంలో నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గుంటూరు మీదుగా దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. ఏపీలోని జగ్గయ్యపేట వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తున్నందున వాహనాలను నార్కట్‌పల్లి – అద్దంకి రహదారి మీదుగా మిర్యాలగూడ, వాడపల్లి, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను సూర్యాపేట సమీపంలోని రాయినిగుడెం వద్ద ఖమ్మం బైపాస్ మీ దుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు ఖమ్మం, సత్తుపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్లొచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
పిడుగుపాటుకు ఒకరు.. ఇల్లు కూలి మరొకరు..!
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపురం గ్రామంలో బర్లను మేపేందుకు వెళ్లిన పుట్ట రమేశ్ కుమారుడు మహేశ్ (18)పై శనివారం పిడిగుపడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన గైని స్వాతి (18) తన చిన్నాన్న ఇంటికి వెళ్లింది. అప్పటికే పిడుగుపడి విద్యుత్ వైర్ తెగడంతో ఆ ఇల్లంతా కరెంట్ సరఫరా అయి స్వాతి డోర్ తీస్తుండగా, షాక్ తగిలి మృతి చెందింది. బొప్పాస్‌పల్లిలో పిడుగుపడి గాయపడిన చవాన్ చిమ్యా నాయక్ (65)ను బాన్సువాడ దవాఖానకు తరలించారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో ఇంటిపైకప్పు కూలడంతో వడ్డె చంద్రయ్య (65) మృతి చెందాడు.
రెస్క్యూకు 24 బోట్లతో సిద్ధం
భారీ వర్షాల్లో బాధితులను రక్షించేందుకు అగ్నిమాపకశాఖలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 50 మంది సిబ్బందిని 24 రెస్క్యూ బోట్లతో సంసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో బోట్స్‌తో పాటు నీటిని తోడే పంప్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్లు ఇతర రెస్క్యూ సామగ్రితో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల కోసం అత్యవసరమైతే ప్రత్యేక బృందాలను పంపుతామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ‘ఆపద మిత్ర’ పేరుతో వలంటీర్లను సిద్ధం చేస్తున్నామని నాగిరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 109 మంది ఆపద మిత్రలను సిద్ధం చేశామని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో వీరి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలకు బోట్లు నడిపేందుకు అగ్నిమాపకశాఖలోనే 145 మంది ఫైర్‌మెన్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్టు తెలిపారు.
24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు
సూర్యాపేట జిల్లా
లక్కవరం రోడ్డు ; 29.88cm
చిల్కూరు ; 28.53cm
మట్టపల్లి ; 26.70cm
ములుగు జిల్లా
తాడ్వాయి ; 23.08cm
మహబూబాబాద్
ఇనుగుర్తి ; 21.50cm
ఖమ్మం జిల్లా
ఎర్రుపాలెం ; 21.33 cm
మధిర (ఏఆర్‌ఎస్) ; 20.25
సూర్యాపేట జిల్లా
తొగర్రాయి ; 19.03
రఘునాథపాలెం ; 18.98
ఖమ్మం జిల్లా
మధిర ; 18.95
Sep 05 2024, 08:05