హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
హైదరాబాద్: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు.
రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బ్రిటీష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతోపాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు..
''కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉంది. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందిస్తున్నా. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలి. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలి.
సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవాలి. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి''అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నర్సింహా, జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు..
Mar 27 2024, 21:20