కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ 16న జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈనెల 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ కార్మికులకు పిలుపునిచ్చారు.
బుధవారం రోజున చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో ఈ నెల 16వ తేదీన ఏఐటీయూసీ తో పాటు 10 జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరగబోయే "దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్" కు సంబంధించిన గోడ పత్రికలను కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కుల రక్షణలో ఘోరంగా విఫలమైందని అన్నారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కనీస ప్రయోజన కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదని , 44 రకాల శ్రామిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించి వేసిందని , ఫలితంగా కార్మిక వర్గ ప్రయోజనాలకు బదులుగా యాజమాన్యాల కు ప్రయోజన కారిగా మారిందని ఆయన అన్నారు. 2014వ సంవత్సరంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని... ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలను జమ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని , కార్మిక వర్గ ప్రయోజనాలు కనీసం కూడా పట్టించుకోలేదని ఆయనన్నారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు కనీస హక్కులు , సౌకర్యాలు లేక యాజమాన్యాల దోపిడీకి ప్రైవేటు/ ప్రభుత్వా ల శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన అన్నారు.
దేశంలో సుమారు 75 కోట్ల మంది ప్రజలు రోజుకు మూడు పూటల తిండి కూడా తినలేని దీనస్థితిలో ఉన్నారని , ఒకపక్క దేశానికి వెన్నెముక అయిన రైతులూ, పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని , మరొకపక్క అదానీ , అంబానీ లాంటి ధనికులు మాత్రం కుబేరులుగా మారుతూ... ప్రపంచ ధనికుల స్థానానికి పోటీ పడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికి కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పేరుతో బీద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికులచే శ్రమదోపిడి చేసుకుంటూ 5 నుండి 10 వేల రూపాయల అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని , గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్మిక కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలన్న స్పృహ లేకపోవడం విచారకరమైన విషయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ, ఆటో రంగా కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలని, కనీస వేతనం ప్రతి కార్మికునికి 26000 ఇవ్వాలని, ఈ ఎస్ ఐ,పిఎఫ్ సౌకర్యం తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
16న జరిగే సమ్మె లో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గోని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి పగిల్ల మోహన్ రెడ్డి, సివిల్ సప్లై హమాలి యూనియన్ అధ్యక్షులు పాపగళ్ల శంకరయ్య, నాయకులు రామలింగయ్య, రెహ్మాన్, శ్రీకాంత్, బాబు, లింగస్వామి, మల్లేష్, నర్సింహా, ఈశ్వర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Feb 16 2024, 19:56